మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. శరద్‌పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రెండు ముక్కలైంది. మహారాష్ట్రలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఎన్సీపీ అగ్ర నేత అజిత్ పవార్ పార్టీనీ నిలువునా చీల్చాడు. ఆదివారం మధ్యాహ్నం తన వర్గం ఎమ్మల్యేలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లిన అజిత్ పవార్.. మహారాష్ట్రలోని ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించాడు.
ఆ వెంటనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కొంతమంది రాష్ట్ర మంత్రులు ఒకరి వెంట ఒకరు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. అనంతరం అజిత్ పవార్‌ను రాష్ట్ర క్యాబినెట్‌లో చేర్చుకుని ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తున్నట్లు అక్కడికక్కడే ప్రకటించారు. అనంతరం మహారాష్ట్ర గవర్నర్ రమేశ్ బియాస్ అజిత్ పవార్ చేత మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. పవార్‌తోపాటు ఆయన వర్గానికి చెందిన చగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే పాటిల్ తదితరులు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ పరిణామాలన్నీ ఒకదాని వెంట ఒకటి చకచకా జరిగిపోయాయి.
కాగా, మహారాష్ట్రలో ఎన్సీపీకి మొత్తం 53 మంది సభ్యుల బలం ఉంది. వారిలో నుంచి ఇప్పుడు దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వెనుక ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేగనక జరిగితే ఇప్పుడు శరద్‌పవార్ వర్గంలో కేవలం 10 లేదా 12 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలిపోయే అవకాశం కనిపిస్తున్నది. ఇటీవల శరద్‌పవార్ తన కుమార్తె సుప్రియాసూలే, ప్రఫుల్ పటేల్‌లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌లుగా ప్రకటించడమే అజిత్ పవార్ నిర్ణయం వెనుక కారణంగా తెలుస్తున్నది.