Saturday, April 27, 2024

ఘనంగా లాల్ దర్వాజ బోనాలు..

తప్పక చదవండి
  • అమ్మవారి సన్నిధికి పోటెత్తిన భక్తులు
  • కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు
  • బోనాలు జరిగే ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు
  • అమ్మవారిని దర్శించుకున్న రాజకీయ ప్రముఖులు..

భాగ్యనగరం అమ్మవారి బోనాల సందడితో సందడిగా మారిపోయింది.. నగర వ్యాప్తంగా వీధి వీధి అమ్మవారి బోనాలు కన్నుల పండువుగా సాగింది.. పోలీసులు ఎలాంటి అవాఛనీయ సంఘటనలు జరక్కుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.. పిల్లలు, యువత, వృద్దులు అనే తేడాలేకుండా ఉత్సవాల్లో పాల్గొన్నారు.. కాగా భక్తి శ్రద్దలతో బాటు.. పలువురు దొరికినంత తాగి ఊగారు.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక నాయకులు, అధికార, ప్రతిపక్షాలకు చెందిన వారు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎవరు ఎక్కడికి పిలిచినా బోనాల సంబురాలకు హాజరై.. అక్కడి వారిని ఆప్యాయంగా పలుకరిస్తూ పాలు పంచుకోవడం కనిపించింది..

హైదరాబాద్ లో లాల్ దర్వాజ బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. ఆదివారం తెల్లవారుజామున లాల్‌దర్వాజ బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. అమ్మవారి సన్నిధికి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. ఎక్కడా కూడా అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా అధికారులు ఇప్పటికే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. లాల్ దర్వాజలోని సింహవాహిని మహంకాళి, అక్కన్న మాదన్న ఆలయాలతో పాటు ఆలయాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే సీసీ కెమెరాలు కూడా పెట్టి పరిసర ప్రాంతాలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. సౌత్ జోన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏకంగా 400 సీసీ కెమెరాలతో నిఘా ఉంచారు. బోనాలు జరగనున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలు చేశారు.

- Advertisement -

అయితే సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి దర్శనానికి భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. అమ్మవారికి ఆలయ అధికారులు బంగారు బోనం సమర్పించారు. ఇక తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయన బోనం సమర్పించారు. అలాగే ప్రభుత్వం తరుపును పలువురు ప్రజాప్రతినిధులు సైతం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మరోవైపు ఆలయానికి వేసిన రంగులు, అమ్మవారి అలంకరణ, దేవాలయానికి వేసిన విద్యుత్ దీపాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి..

లాల్ దర్వాజ సింహ వాహిని అమ్మవారికి, అక్కన్న మాదన్న ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే పండుగ బోనాల పండుగ అని మంత్రి తలసాని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ప్రతి ఏటా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ వస్తుందని అన్నారు. ప్రయివేట్ దేవాలయాలకు కూడా ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఐక్యతకు మారుపేరు పండుగలు, ఉత్సవాలు అని, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు అంతా సుఖ సంతోషాలతో జీవించాలని మంత్రి ఆకాంక్షించారు.

అమ్మవారిని దర్శించుకున్న రేవంత్, భట్టి :
లాల్ దర్వాజ శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారిని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా కుటుంబ సమేతంగా లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారిని ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ పండితులు పూర్ణకుంభంతో వీరికి స్వాగతం పలికి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేయించారు. అమ్మవారికి భట్టి దంపతులు తమ మొక్కులను చెల్లించుకున్నారు. అనంతరం ఆశీర్వచనం చేసి అమ్మవారి పసుపు, కుంకుమ, ప్రసాదాన్ని ఆలయ పండితులు అందజేశారు. సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు భట్టి విక్రమార్క, రేవంత్ కు వేర్వేరుగా ఆలయం వద్ద ఘనంగా స్వాగతం పలికి శాలువా కప్పి సత్కరించారు. ఆలయానికి వచ్చిన భట్టి విక్రమార్కను బందోబస్తు పర్యవేక్షణకు వచ్చిన అడిషనల్ డీజి సుధీర్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు