- క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ – చిరాగ్ జోడీ..
భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ జపాన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టాడు. యొయొగి నేషనల్ జిమ్నాషియం కోర్టు 1లో ఈ రోజు జరిగిన ప్రీ క్వార్టర్స్‌లో అతను భారత్‌కే చెందిన కిదాంబి శ్రీకాంత్ పై గెలుపొందాడు. హోరాహోరీగా జరిగిన పోరులో 19-21, 21-9, 21-9తో అతను శ్రీకాంత్‌ను చిత్తు చేశాడు. తొలి సెట్ కోల్పోయినప్పటికీ వెనుకడుగు వేయకుండా అద్భుత పోరాట పటిమ కనబరిచాడు. వరుసగా రెండు సెట్లు సొంతం చేసుకొని క్వార్టర్స్‌లో కాలు మోపాడు. శ్రీకాంత్‌పై ప్రణయ్‌కు నాలుగేళ్ల తర్వాత ఇదే తొలి విజయం కావడం గమనార్హం. అవును.. 2019లో చివరిసారగా ప్రణయ్, శ్రీకాంత్‌ను ఓడించాడు. ఇప్పటివరకూ వీళ్లు తొమ్మిదిసార్లు తలపడ్డారు. అయితే.. మూడు సార్లు మాత్రమే ప్రణయ్ అతడిపై విజయం సాధించాడు. అంతేకాదు శ్రీకాంత్‌ను మూడు సార్లు ఓడించిన రెండో భారత షట్లర్‌గా ప్రణయ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. మరోవైపు.. లక్ష్యసేన్ కూడా తర్వాతి రౌండ్‌కు చేరుకున్నాడు.
సాత్విక్ – చిరాగ్ ముందంజ
భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ – చిరాగ్ శెట్టీ జపాన్ ఓపెన్‌లోనూ సత్తా చాటుతున్నారు. డెన్మార్క్‌కు చెందిన జెప్పె బే, లస్సె మొల్మొడేపై 21-17, 21-11తో గెలుపొందారు. క్వార్టర్స్‌లో చైనీస్ తైపీకి చెందిన వాంగ్ చి లిన్, లీ యాంగ్‌ను వీళ్లు ఢీ కొననున్నారు. సాత్విక్ – చిరాగ్ ద్వయం గత వారమే కొరియా ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇది వాళ్లకు కెరీర్‌లో మూడో బీడబ్ల్యూఎఫ్ టైటిల్. ఈ ఏడాది వీళ్లు ఇండోనేషియా ఓపెన్ లో ట్రోఫీ సాధించారు. దాంతో, ఈ ట్రోఫీ నెగ్గిన తొలి భారత డబుల్స్ జోడీగా సాత్విక్ – చిరాగ్ శె రికార్డుల్లోకి ఎక్కారు.