Wednesday, October 16, 2024
spot_img

భారత అంతర్గ వ్యవహారలపై ఒబామా విపరీత వ్యాఖ్యలు

తప్పక చదవండి

అతడో ప్రైవేట్‌ వ్యక్తని అంటూ శ్వేతసౌధం ఖండన.. ఒబామా తీరును దుయ్యబట్టిన రాజ్‌నాథ్‌, నిర్మలా సీతారామన్‌

వాషింగ్టన్‌ : భారత దేశంలో మైనారిటీల రక్షణ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాను అమెరికా ప్రభుత్వం సున్నితంగా పక్కనబెట్టింది. ఆయన పట్ల సమున్నత గౌరవం ఉన్నప్పటికీ, ఆయన ఓ ప్రైవేటు వ్యక్తి అని, శ్వేత సౌధంతో ఆయనకు సమన్వయం లేదని తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల అమెరికా ప్రభుత్వ అతిథిగా సమున్నత గౌరవం పొందుతూ ఆ దేశంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌ దంపతులు అత్యంత ఆత్మీయతతో మోదీని ఆహ్వానించి, గౌరవించారు. జూన్‌ 22న వైట్‌ హౌస్‌ సౌత్‌ లాన్‌లోకి బైడెన్‌ అత్యంత గౌరవ, మర్యాదలతో మోదీని ఆహ్వానించారు. అదే రోజు బరాక్‌ ఒబామా ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ, మెజారిటీ హిందూ ఇండియాలో ముస్లిం మైనారిటీల రక్షణ గురించి మోదీతో బైడెన్‌ మాట్లాడాలన్నారు. తాను మోదీతో మాట్లాడి ఉంటే, తన వాదనలో కొంత భాగం భారత దేశంలో మైనారిటీల హక్కుల గురించే ఉంటుందన్నారు. దేశంలోని మైనారిటీల హక్కులను భారత దేశ ప్రధాన మంత్రి కాపాడకపోతే, భారతదేశం విడిపోయే అవకాశం బలంగా ఉంటుంది. ఈ విస్తృత అంతర్గత సంఘర్షణలు ’ముస్లిం ఇండియా’, ‘హిందూ ఇండియాల ప్రయోజనాలకు విరుద్ధం అని అన్నారు. ఒబామా వ్యాఖ్యలు మన దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ఆయనను తీవ్రంగా విమర్శించారు. ముస్లింలు అధికంగా ఉన్న ఆరు దేశాలపై ఒబామా నేతృత్వంలోని అమెరికా బాంబులు కురిపించిందని నిర్మల సీతారామన్‌ గుర్తు చేశారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ, భారత దేశంలోనే చాలా మంది హుస్సేన్‌ ఒబామాలు ఉన్నారని, అలాంటివారిపై అస్సాం పోలీసులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఓ జాతీయ పత్రిక శ్వేత సౌధం సీనియర్‌ అడ్మినిస్టేష్రన్‌ ఆఫీసర్‌ను ఇంటర్వ్యూ చేసింది. ఆ అధికారి ఆ పత్రికకు తెలిపిన వివరాల ప్రకారం, ప్రధాని మోదీతో ప్రతి అంశాన్ని బైడెన్‌ ప్రస్తావించారు. అదేవిధంగా మోదీ కూడా బైడెన్‌తో ప్రతి అంశం గురించి మాట్లాడారు. అయితే ఈ సంభాషణ గౌరవప్రదంగా, హుందాగా జరిగింది. ఒబామా కఠిన సందేశాన్ని పంపించడం, బైడెన్‌ ఇండియాను మచ్చిక చేసుకోవడంలో ’మంచి పోలీసుచెడ్డ పోలీసు’ విధానం ఉందనే ఊహాగానాల్లో నిజం ఉందా అని ఆ పత్రిక ప్రశ్నించినపుడు ఆ అధికారి స్పందిస్తూ, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా పట్ల తమకు గొప్ప గౌరవం ఉందని, అయితే ఆయన ఓ ప్రైవేటు వ్యక్తి అని, ఆయన మాటలు తమతో సమన్వయంతో మాట్లాడినవి కాదని చెప్పారు. బైడెన్‌మోదీ మధ్య జరిగిన ప్రైవేటు సంభాషణ స్వభావాన్ని తాను వివరించలేనని చెప్పారు. అయితే ప్రతి అంశాన్నీ, ప్రతి సమస్యను వారు చర్చించారని చెప్పగలనని తెలిపారు. అత్యున్నత స్థాయి హుందాతనంతో ఈ పని చేయడం బైడెన్‌ శైలి అని తెలిపారు. సన్నిహిత భాగస్వామ్య స్ఫూర్తితో మాట్లాడటం, భాగస్వాములను గౌరవంగా చూడటం బైడెన్‌ శైలి అని చెప్పారు. ప్రధాని మోదీతో కూడా ఈ విధంగానే ఆయన వ్యవహరించారని భావిస్తున్నాన న్నారు. చర్చించాలని కోరుకునే అంశాలు ప్రతి దేశానికి ఉంటాయన్నారు. సమస్యల గురించి నేరుగా మోదీతో బైడెన్‌ మాట్లాడటం కాదని, మోదీ కూడా కొన్ని అంశాలను లేవనెత్తాలని కోరుకుంటారని అన్నారు. సమస్యలను గౌరవప్రదంగా చర్చించడానికి వారి మధ్యగల గాఢమైన సత్సంబంధాలు అవకాశం కల్పించాయన్నారు. తాను చెప్పినదానిని ఎదుటివారు గౌరవభావంతో విన్నారనే విశ్వాసం కలిగేలా వారు మాట్లాడుకున్నారని చెప్పారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు