Friday, March 29, 2024

అధికార పార్టీ ముసుగులో అక్రమాలు..

తప్పక చదవండి
  • ఎక్స్ ఆర్మీకి కేటాయించిన ప్లాట్లు కైంకర్యం ..
  • రాత్రికి రాత్రే షెడ్ల నిర్మాణం..
  • అడ్డదారిలో ఇంటి నెంబర్లు పొందిన వైనం..
  • 1. 33 ఎకరాల ప్రభుత్వ భూమి హాం ఫట్..
  • కబ్జా విలువ రూ. 80 కోట్ల పైమాటే..
  • రెవెన్యూ అధికారుల కళ్లుగప్పి అక్రమ నిర్మాణాలు..
  • నల్లచెరువు సాక్షిగా అక్రమ దందా..
  • 16 వార్డు కౌన్సిలర్ పై బాధితుల ఫిర్యాదు.. ఆపై కేసు నమోదు..

మన మాన ప్రాణాలను కాపాడుతూ.. తమ కుటుంబాలను వదిలిపెట్టి, తమ ప్రాణాలను సైతం లెక్కజేయకుండా దేశ సరిహద్దులో సుదీర్ఘకాలం పాటు సేవలందించినందుకు గాను ప్రభుత్వం వారి సేవలను గుర్తించి ఇంటి నిర్మాణం కోసం ఒక్కొక్క సైనికుడికి 100 గజాల చొప్పున ఇంటి స్థలం కేటాయిస్తే ఆ స్థలాలను పరిరక్షించాల్సింది పోయి, గుంట నక్కల్లా కాపుకాసి ఆక్రమణకు తెగబడుతున్నారు..

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా, గండిపేట మండలం నార్సింగి మున్సిపాలిటీ 6వ వార్డులో గల సర్వే నెంబర్ 205/1 లో 1 ఎకరా 33 గుంటల స్థలాన్ని ఎక్స్ ఆర్మీ సైనికులకు ఒక్కొక్కరికీ వంద గజాల చొప్పున 45 మందికి 45 ప్లాట్లు 12-10-2001లో ఆనాటి ప్రభుత్వం కేటాయించింది.. అయితే 16 వార్డు కౌన్సిలర్ జీ. వెంకటేష్ యాదవ్ రాత్రికి రాత్రే షెడ్లు నిర్మించి అడ్డదారిలో ఇంటి నెంబర్లు సైతం పొందినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.. మా స్థలాల్లోకి వెళితే దౌర్జన్యం చేస్తూ చంపుతామంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. అధికార పార్టీ ముసుగులో తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఒక ఎకరం 33 గుంటల స్థలం ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో సుమారు రూ. 80 కోట్లు పైమాటే ఉంటుందని వారు అభిప్రాయం పడుతున్నారు.. మా స్థలాలు మాకు దక్కేంత వరకు పోరాటం చేస్తామని, ఆమేరకే స్థానిక పోలీస్ స్టేషన్లో 30-12-2022 న ఫిర్యాదు చేయగా 31-12-2022 ఎఫ్.ఐ.ఆర్. నెంబర్ 1582/2022 ఇండియన్ పీనల్ కోడ్ 447, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వారు వెల్లడించారు.. మా స్థలాలు కబ్జాకు గురైన నేపథ్యంలో ప్రస్తుతం నిర్మాణాలు చేస్తున్న వాటికి ఇంటి నెంబర్లు జారీ చేయవద్దని 25-5-2023 న మున్సిపల్ కమీషనర్ సత్యబాబుకు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు.. 45 ప్లాట్లకు ఇంటి నెంబర్లు ఎలా జారీ అయ్యాయి..? ప్రభుత్వ భూమిలో రిటైర్డ్ ఆర్మీ సైనికులకు జారీ చేసిన ఇంటి స్థలంలో వారి ప్రమేయం లేకుండా ఇంటి నెంబర్లు ఎలా జారీ చేశారన్నది వెయ్యి డాలర్ల ప్రశ్నగా మిగిలింది.. ఇంటి నెంబర్ల జారీ వెనుక ఎవరి హస్తం ఉందో ఉన్నతాధికారులే తేల్చాలి.. రెవెన్యూ అధికారుల కళ్లుగప్పి ఏకంగా 45 ప్లాట్లలో షెడ్లు నిర్మించడం స్థానికులకు, మరికొందరు ప్రతిపక్షం, మిత్రపక్షం నాయకులను ఆశ్చర్యాన్ని గురి చేస్తోంది.. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా నిర్మించిన షెడ్లను కూలగొట్టి, జారీ చేసిన ఇంటి నెంబర్లను రద్దు చేయాలని వారు ముక్త కంఠంతో కోరుతున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు