కవిగా, విప్లవకారుడిగా, గాయకుడిగా కోట్లాదిమంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ఉద్యమ కెరటం, ప్రజాయుద్ధనౌక గద్దర్. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 2011లో తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఎన్ శంకర్ డైరెక్ట్ చేసిన చిత్రం జై బోలో తెలంగాణ.. ఈ సినిమాలో గద్దర్ రాసిన పొడుస్తున్న పొద్దు మీద పొద్దు మీద నడుస్తున్న కాలమా అంటూ సాగే పాట కోట్లాది మందిలో ఉత్తేజాన్ని నింపింది. గద్దర్ ఈ పాటను పాడటమే కాకుండా నటించారు కూడా. గద్దర్ మృతి పట్ల ఎన్ శంకర్ మీడియాతో మాట్లాడుతూ.. గద్దరన్న లేరన్న వార్త చూసి షాకయ్యానన్నారు. మూడు రోజుల క్రితం సర్జరీ బాగా జరిగిందని తెలిసి సంతోషించాను. కానీ ఇప్పుడు ఆయన లేరన్న వార్త విని షాకయ్యా. 1983లో నేను స్టూడెంట్‌గా ఉన్నప్పటి నుంచి మా ఇద్దరి మధ్య పరిచయం ఉంది. ఆ తర్వాత మా కాలేజీలో ఓ కార్యక్రమానికి గద్దరన్నను తీసుకెళ్లా. అటు నుంచి నేను సినిమాల్లోకి వెళ్లా. అనంతరం వీలైనప్పుడల్లా కలిసేవాళ్లం. ఎన్‌కౌంటర్, శ్రీరాములయ్య సినిమాల టైంలో ఆయన ఫీడ్ బ్యాక్ ఇచ్చేవారు.
మహాత్మా జ్యోతిరావు పూలే కాన్సెప్ట్‌ను తీసుకుని జయం మనదేరా సినిమా చేస్తున్నానని తెలుసుకుని, ఇంతవరకు ఈ దేశంలో ఎవరూ చెప్పే ప్రయత్నం చేయలేదని చాలా సంతోషించారు. జై బోలో తెలంగాణ చిత్రంలో ఓ కీలక సన్నివేశంలో పాట కావాలి, మీరు పాడితే బాగుంటదని అడిగినప్పుడు.. ఆయనే పాట రాసి, పాడి, నటించి సినిమాకు, తెలంగాణ ఉద్యమానికి, ప్రేక్షకులకు ఉద్యమం పట్ల ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చిన గద్దరన్న మన మధ్య లేకపోవడం చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్ శంకర్.