Monday, May 6, 2024

ఉధృత గోదారి..

తప్పక చదవండి
  • 45 అడుగులకు చేరిన గోదారమ్మ..?
  • మొదటి ప్రమాద హెచ్చరిక జారీ .
  • తాలిపేరు 24 గేట్లు ఎత్తివేత.
  • 50వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం .
  • వరద ముంపుకు గురవుతున్న గ్రామాలు.
  • ఏజెన్సీ ప్రాంతాల్లో రాకపోకలు బంద్.
  • ప్రాజెక్టులకు భారీగా చేరుతున్న వరద నీరు.
  • కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది.. క్రమక్రమంగా వరద ప్రవాహం పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గురువారం మధ్యాహ్నం వరకు 43 అడుగులకు వరద చేరడంతో ఈ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గురువారం అర్ధరాత్రి వరకు భద్రాచలం వద్ద గోదావరి వరద 45 అడుగులకు చేరే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

జిల్లా కలెక్టర్ డా ప్రియాంక అలా గోదావరి నుంచి 9,32,228 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. వర్షాల వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భద్రాచలం పట్టణం నుంచి వచ్చిన వర్షపు నీరంతా రామాలయం ఏరియా వద్ద గల కరకట్ట వద్ద ఉన్న స్లూయిజ్ ల నుంచి గోదావరి లోనికి కలుస్తోంది. గోదావరి వరద పెరగడంతో అధికారులు స్లుయిజులను మూసివేశారు. భద్రాచలం పట్టణం నుంచి వచ్చిన వర్షపు నీటిని మోటార్ల ద్వారా బయటకు తోడుతున్నారు. సరైన మోటార్లు ఏర్పాటు చేయకపోవడం వల్లనే వర్షపు నీరంతా దుకాణాల వద్దకు చేరి దుకాణాలన్నీ మునిగిపోయాయని దుకాణాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

ప్రాజెక్టులకు వరద పోటు :
భారీ వర్షాల కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రాజెక్టులకు వరద పోటు క్రమక్రమంగా పెరుగుతుంది. ఉమ్మడి జిల్లాలోని కిన్నెరసాని , తాలి పేరు ,పాలేరు, వైరా, లంక సాగర్, బేతుపల్లి ముఖమామిడి తదితర ప్రాజెక్టులకు వరద నీరు భారీగా చేరుకుంది. ప్రధానంగా అల్లూరి జిల్లా కూనవరం శబరి గోదావరి సంగమం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం కూనవరం వద్ద 43 అడుగులకు వరద నీరు చేరుకుంది. కూనవరం, వీఆర్ పురం పునరావాస కేంద్రాలను అక్కడి అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మిశ్రా సందర్శించారు. తాలిపేరు మధ్య తరహా ప్రాజెక్టుకు వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తి 99,237 క్యూసెక్కుల నీటిని దిగువకు అధికారులు వదులుతున్నారు. అదేవిధంగా కిన్నెరసానికి వరద పెరగడంతో ప్రాజెక్టు నీటిమట్టం 397అడుగులకు చేరుకొంది.ఈ జలాశయం పూర్తిసామర్థ్యం 407అడుగులుగా ఉంది. కిన్నెరసాని, మొర్రెడు, దున్నపోతులవాగు, పొంగి ప్రవహిస్తుండడంతో పరిసర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల కారణంగా కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు ఏరియాల్లోని ఓపెనకాస్ట్‌ బొగ్గు గణుల్లో నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సుమారు 50వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలకు దుమ్ముగూడెం మండలంలోని చిననల్లబల్లి వద్ద చర్ల-భద్రాచలం రహదారిపై భారీ వృక్షం నేలకొరగడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఎగువన భారీ వర్షాలకు చినగుబ్బలమంగి ప్రాజెక్టు నిండి అలుగు పారింది. అలాగే గంగోలు చెరువు సైతం అలుగు పారింది. పర్ణశాల స్నానఘట్టాల వద్దకు వరదనీరు చేరింది. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని చత్తీస్ ఘడ్ సరిహద్దు ప్రాంతమైన టేకులగూడెం గ్రామం వద్ద 163వ జాతీయ రహదారిపైకి గోదావరి వరద నీరు చేరడంతో జాతీయ రహదారి నీట మునిగి అంతరాష్ట్ర రాకపోకలకు అంతరాయం కలిగింది. సత్తుపల్లిలో ఎడతెరిపి లేని వర్షాలకు బేతుపల్లి చెరువుకు వరద ప్రవాహం పెరిగింది.

కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు :
గోదావరి నదికి వరద పోటెత్తిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రియాంక.. ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. 24 గంటలు పని చేసేలా కలెక్టరేట్‌తో పాటు కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీవో కార్యాలయాలు, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు