Monday, September 9, 2024
spot_img

గోవధ నిషేధ చట్టం కఠినంగా అమలు చేయాలి : వీ.హెచ్.పీ.

తప్పక చదవండి
  • బక్రీద్ సందర్భంగా గోవులను వధించడం మానుకోవాలి..
  • హిందువుల పవిత్ర దైవం గోవు.. గోవును వధించడం మహా పాపం
  • నామ మాత్రంగా చెక్ పోస్టులు నిర్వహిస్తే.. బజరంగ్ దళ్ ఆందోళనకు సిద్ధం
  • గోవధ నిషేధ చట్టం కఠినంగా అమలు చేయాలని ఈనెల 14న ఇందిరాపార్క్ దగ్గర మహా ధర్నా
  • రాజకీయ పార్టీలకు అతీతంగా హిందువులు కదలి రావాలి

హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో గోహత్య నిషేధ చట్టాలు కఠినంగా అమలు చేయాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. పాడి పరిశ్రమకు, వ్యవసాయానికి, గ్రామీణ జీవన విధానానికి వెన్నెముకగా ఉన్న పశువులను చట్ట వ్యతిరేకంగా హత్యలు చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేసింది. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్, గోరక్ష దక్షిణ భారత ప్రముఖ్ యాదగిరి రావు, గోరక్ష తెలంగాణ రాష్ట్ర సహా ప్రముఖ్ జి రమేష్, వీ.హెచ్.పీ. ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివ రాములు విలేకరులతో మాట్లాడారు. ముక్కోటి దేవతలకు నిలయమైన గోవు.. హిందువుల పరమ పవిత్ర దైవమన్నారు. గోవును వధిస్తే మహా పాపమని పేర్కొన్నారు. ప్రతి ఏడాది బక్రీద్ సందర్భంగా రాష్ట్రంలో విచ్చలవిడిగా గో హత్యలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి పనికి వచ్చే పశువులను క్రూరంగా వధించడం చట్టరీత్యా నేరమైనప్పటికీ, హత్యలను ఆపడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుందని ఆరోపించారు. బక్రీద్ పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం గోవులను, పశువులను రవాణా చేసే సందర్భంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారని.. అవి నామమాత్రంగా కొనసాగుతున్నాయని విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆవులను వధిస్తున్న కూడా ఎటువంటి కేసులు నమోదు చేయకపోవడం దుర్మార్గమన్నారు. బక్రీదు సందర్భంగా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బజరంగ్ దళ్ బరిలోకి దిగుతుందని హెచ్చరించారు. బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సొంతంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకొని గో అక్రమ రవాణాను నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఈనెల 14వ తేదీన ఇందిరాపార్కు దగ్గర మహా ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. ఎట్టి పరిస్థితులలో ఒక్క గోవును కూడా అక్రమంగా వధించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఇందిరాపార్క్ దగ్గర బుధవారం నిర్వహించే ధర్నా కార్యక్రమానికి ప్రతి హిందువు కదలి రావాలని వారు పిలుపునిచ్చారు. ధర్నా అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం మంత్రి గారికి అందజేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇందిరాపార్క్ దగ్గర నిర్వహించే ధర్నా గోడపత్రికలను విడుదల చేశారు.

మన రాష్ట్రంలో 1977 గోవదనిషేధ చట్టం అమల్లో ఉంది. 1977 చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం ఆవు, దూడ, గేదెలను వధించకూడదు. సెక్షన్ 6 ప్రకారము 14 సంవత్సరాల లోపు ఉన్న ఎద్దులను దున్నపోతులను కూడా వధించకూడదు. కానీ చట్ట విరుద్ధంగా రాష్ట్రంలో విచ్చలవిడిగా గో వధ జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బలిష్టంగా ఉన్న జంతువులను కూడా వధిస్తున్నారని.. ముఖ్యంగా బక్రీద్ సందర్భంగా గోవధ విచ్చలవిడిగా రెట్టింపు స్థాయిలో సాగుతుందని వివరించారు. చట్టాన్ని అమలు చేయవలసిన ప్రభుత్వ యంత్రాంగం.. పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరించడం చట్ట విరుద్ధమని చెప్పారు. గో ప్రేమికులు, హిందూ సంస్థలు, విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ అనేక సందర్భాలలో ఉద్యమాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి గో వధ నిషేధ చట్టం కఠినంగా అమలు చేయాలని విశ్వహిందూ పరిషత్ నేతలు డిమాండ్ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు