Monday, May 6, 2024

పరవళ్ల గోదావరి..

తప్పక చదవండి
  • 45 అడుగులకు గోదావరి నీటిమట్టం.
  • రిజర్వాయర్ లోకి చేరిన గరిష్ట స్థాయి నీటిమట్టం.
  • తాలిపేరు ప్రాజెక్టు 23 గేట్లు ఎత్తి వేత.
  • కిన్నెరసాని జలాశయానికి పోటెత్తిన వరద .
  • భద్రాద్రి మాఢవీధుల్లోకి వరద..
  • ఖమ్మంలో ఉదృతంగా ప్రవహిస్తున్న మున్నేరు.
  • ఖమ్మం జిల్లాలో దంచికొట్టిన వర్షం.
  • పొంగి ప్రవహిస్తున్న వాగులు..
  • ముంపు గ్రామాలు జలదిగ్బంధం
  • 27 వేల టన్నుల బొగ్గుఉత్పత్తికి ఆటంకం.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు భద్రాచలం వద్ద గోదావరి పోటెత్తింది. భద్రాచలం వద్ద గోదావరికి మళ్లీ వరద ఉధృతి పెరిగింది. దీంతో 44.5 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. ఈ నేపథ్యంలో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద పొంగి రామాలయం చుట్టూ నీరు చేరింది. భద్రాచలం నుంచి 9.92 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రామాలయం పరిసర ప్రాంతాల్లోని మాఢవీధుల్లోకి నీరు చేరింది. ఉత్తర ద్వారం వైపు ఉన్న దుకాణాల్లోకి వరద ముంచెత్తింది. ఎగువప్రాంతం ఛతీస్ గడ్ లో కూడా వర్షాలు పడుతుండటంతో చర్ల వద్ద తాలిపేరు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో తాలిపేరు ప్రాజెక్టు 23 గేట్లు ఎత్తి 1లక్షా84, 023 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 74 మీటర్లు కాగా ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 73.44 మీటర్లుగా ఉంది. తాలిపేరు ప్రాజెక్టు1 లక్షా 53 వేల క్యూసెక్కులు వరద నీరు వచ్చి చేరుతోంది.

- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, కోయగూడెం ఓపెన్‌కాస్ట్‌ గనుల్లో నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. భారీ వర్షంతో కోయగూడెం ఓసీలలో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో 27 వేల టన్నుల బొగ్గుఉత్పత్తికి ఆటంకంగా మారింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ కిన్నెరసాని జలాశయానికి వరద నీరు పోటెత్తింది. 407 అడుగుల నీటినిల్వ సామర్థ్యం గల ప్రాజెక్టుకు మంగళవారం ఉదయం 1200 క్యూసెక్కుల వరద రావడంతో నీటిమట్టం 402.70 అడుగులకు పెరిగింది. దీంతో 2 గేట్లు ఎత్తి 10వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేసినట్లు డ్యామ్ అధికారులు తెలిపారు. నీటి విడుదలతో రాజాపురం, యానంబైల్ గ్రామాల మధ్య చప్టాపై ఉధృతంగా ప్రవహించగా 24 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.ఆలయ పరిసరాల్లోకి వరద చుట్టుముట్టడంతో బాహుబలి మోటర్లు పెట్టి నీటిని గోదావరిలోకి పంపిస్తున్నారు. గోదావరి ఉద్ధృతికి అటు పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది.. వర్షాల ప్రభావంతో చెరువులు, కుంటలలోకి వరదనీరు చేరుకుంటోంది. జిల్లాలోని పలు ప్రాంతాలలో చెరువులు అలుగులు పారుతున్నాయి. వైరా, పాలేరు జలాశయాలు ఇప్పటికే నిండిపోయాయి. పాలేరు జలాశయంలో మొన్నటి వరకు వెలవెలపోగా నేడు జలకళను సంతరించుకుంది.ఖమ్మం నగరంలోని మున్నేరు నది ఉదృతంగా ప్రవహిస్తూ ఉంది. మున్నేరు నది పూర్తి నీటి సామర్థ్యం 25 అడుగుల వరకు ఉండగా ఇప్పటికే వర్షపు నీరు వల్ల దాదాపు 23 అడుగులు పైగా చేరుకొని ఉదృతంగా ప్రవహిస్తుంది. ఆకేరువాగు పొంగడంతో ఖమ్మం రూరల్ మండలం తీర్థాల, మంగళగూడెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చెరువులు, కుంటలు, జలాశయాలు నిండిపోవడంతో ఆ ప్రాంతాల్లోని ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పాలేరు రిజర్వాయర్‌ :
పూర్తిస్థాయి నీటిమట్టం : 23 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం : 23.5
ఆయకట్టు పరిధి : 4.5 లక్షల ఎకరాలు
ఎగువన కురిసిన వర్షాలకు తోడు.. కృష్ణానది నీరు పాలేరుకు వస్తుంది. సాగర్‌ డ్యాం నుంచి ఎడమ కాలువకు విడుదలవుతున్న నీరు 3,500 క్యూసెక్కులు. అవుట్‌ ఫ్లో 2వేల క్యూసెక్కులు. ఇందులో పాలేరు పాత కాలువకు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

వైరా రిజర్వాయర్‌ :
పూర్తిస్థాయి నీటిమట్టం : 18.3 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం : 17.9
ఆయకట్టు పరిధి : అధికారికంగా 17,500 ఎకరాలు (అనధికారికంగా 25వేల ఎకరాలు)

ఎగువన కురుస్తున్న వానలకు ఈ రిజర్వాయర్‌ జలకళను సంతరించుకున్నది. పగిడేరు, పెద్దవాగు, ఇల్లెందు, కామేపల్లిలో కురిసిన వర్షాలకు వరద నీరు వచ్చి చేరుతున్నది.

బేతుపల్లి పెద్దచెరువు
పూర్తిస్థాయి నీటిమట్టం : 16 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం : 16.1
ఆయకట్టు పరిధి : 10వేల ఎకరాలు

పూర్తి వర్షాధారంతో ఈ చెరువు నిండింది. దమ్మపేట మండలం నాగుపల్లి, నాచారం, సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి, కాకర్లపల్లి తదితర గ్రామాల్లోని అటవీ ప్రాంతం ద్వారా వరదనీరు చెరువుల్లో చేరి, ఆ చెరువుల నుంచి బేతుపల్లి పెద్దచెరువులోకి వరదనీరు వచ్చి నిండింది. 5 రోజుల క్రితం బేతుపల్లి ప్రత్యామ్నాయ కాలువకు నీటిని విడుదల చేయగా సత్తుపల్లి, వేంసూరు మండలాల్లోని 54 చెరువులకు సాగునీరు అందుతున్నది. ప్రస్తుతం ప్రత్యామ్నాయ కాలువ ద్వారా 450 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది.

పెదవాగు ప్రాజెక్టు :
పూర్తిస్థాయి నీటిమట్టం : 19 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం : 11
ఆయకట్టు పరిధి : 16వేల ఎకరాలు (తెలంగాణ 3వేలు, ఏపీ 13 వేలు

అశ్వారావుపేట మండలంలోని ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వరద నీరు వచ్చి చేరుతోంది. కుడి, ఎడమ కాల్వల ద్వారా తెలంగాణ ప్రాంతంలో 3వేల ఎకరాలు, ఆంధ్రప్రదేశ్‌లో 13వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు.

కిన్నెరసాని రిజర్వాయర్‌ :
పూర్తిస్థాయి నీటిమట్టం : 407 అడుగులు (8.4 టీఎంసీలు)
ప్రస్తుత నీటిమట్టం : 402.2 అడుగులు (7.85 టీఎంసీలు)
ఆయకట్టు పరిధి : 10వేల ఎకరాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, కొత్తగూడెం, బూర్గంపాడు మండలాల్లోని 10వేల ఎకరాలకు కిన్నెరసాని ద్వారా నీరందుతుంది. కిన్నెరసానికి రెండు కాలువలు ఉన్నాయి. ఎడమ కాలువ ద్వారా 7వేల ఎకరాలు, ఎడమ కాలువ ద్వారా 3వేల ఎకరాలకు నీరందుతుంది.

తాలిపేరు ప్రాజెక్టు :
పూర్తిస్థాయి నీటిమట్టం : 74 మీటర్లు
ప్రస్తుత నీటిమట్టం : 72.11 మీటర్లు
ఆయకట్టు పరిధి : 25వేల ఎకరాలు

చర్ల రూరల్‌ మండంలోని తాలిపేరు ప్రాజెక్టుకు ఎగువన ఉన్న అటవీప్రాంత వాగువంకల నుంచి నీరు వస్తుంది. 23 గేట్లు ఎత్తి 1లక్షా84, 02316,343 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.

జాలిముడి ప్రాజెక్ట్‌ :
పూర్తిస్థాయి నీటిమట్టం : 15 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం : 16 అడుగులు
ఆయకట్టు పరిధి : 4,900 ఎకరాలు

మధిర మండలంలోని జాలిముడి ప్రాజెక్టు నీటి సామర్థ్యం 35 ఎంసీఎఫ్‌టీ (మిలియన్‌
క్యూబిక్‌ ఫీట్‌)లు. వర్షాలు, వైరా రిజర్వాయర్‌ ద్వారా వచ్చే నీటి ద్వారా నిండింది. కాలువలు పూర్తికాకపోవడం వల్ల ప్రస్తుతం 3వేల ఎకరాలు మాత్రమే సాగవుతుంది.

లంకాసాగర్‌ ప్రాజెక్ట్‌ :
పూర్తిస్థాయి నీటిమట్టం : 18 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం : 13 అడుగులు
ఆయకట్టు పరిధి : 8వేల ఎకరాలు

పెనుబల్లి మండలంలోని లంకాసాగర్‌ ప్రాజెక్టు ప్రస్తుత వర్షాలతో వరద నీరు వచ్చి చేరుతున్నది. లంకపల్లి, ఏరుగట్ల, శ్రీనివాసపురం, మండాలపాడు, చౌడవరం గ్రామ ప్రాంతాల నుంచి వరద నీరు ఈ ప్రాజెక్టులోకి వస్తుంది. పెనుబల్లి, వేంసూరు మండలాలకు సాగు నీరు అందిస్తున్నది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు