ఓక్లహామా: చేపల రకాన్ని బట్టి కొన్ని రకాల చేపల నోటిలో ముళ్ల లాంటి పళ్లు ఉంటాయి. మరికొన్ని రకాల చేపల నోటిలో అసలు పళ్లే ఉండవు. కానీ, తాజాగా అమెరికాలోని ఓక్లహామా రాష్ట్రంలో మాత్రం ఓ వింత చేప దర్శనమిచ్చింది. ఆ చేప నోటిలో మనిషి పళ్లను పోలిన పళ్లు ఉన్నాయి. దాంతో ఆ చేపకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
ఈ చేపను పట్టుకోవడం ద్వారా ఓక్లహామాకు చెందిన చార్లీ క్లింటన్ అనే యువకుడి పేరు ప్రపంచవ్యాప్తంగా పతాక శీర్షికల్లో నిలిచింది. వీకెండ్‌లో తన ఇంటి సమీపంలోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన చార్లీ క్లింటన్‌కు ఈ వింత చేప చిక్కింది. తన వలకు చిక్కిన ఆ చేపను ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేయగా అది అతని చేతిని కొరికింది.
మనిషి కొరికినట్లుగా కొరకడంతో అనుమానం వచ్చిన క్లింటన్ దాని నోటిని తెరిచి చూడగా మనిషి పళ్లను పోలిన పళ్లు ఉన్నాయి. దాంతో ఈ విషయాన్ని అతను ఓక్లహామా డిపార్టుమెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ వారి దృష్టికి తీసుకెళ్లారు. వాళ్లు ఆ చేపను పరిశీలించి అది పాకూ కుటుంబానికి చెందిన చేప అని తెలిపారు. అయితే, పాకూ కుటుంబంలోని ఏ జాతికి చెందిన చేప అనేది మాత్రం కచ్చితంగా చెప్పలేమన్నారు.
ఈ జాతి చేపలు దక్షిణ అమెరికా జలాల్లో ఉంటాయని, పదునైన పళ్లు కలిగిన పైరాన్‌హాస్ చేపలకు, ఈ చేపలకు మధ్య చాలా దగ్గరి సంబంధం ఉందని ODWC అధికారులు చెప్పారు. ఈ చేపకు సంబంధించిన ఫొటోలను వారు ఈ నెల 15న తమ అధికారిక ఇన్‌స్టా హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. మనిషిని పోలిన పళ్లను కలిగి ఉన్నప్పటికీ ఇవి మనుషులకు ఎలాంటి హాని తలపెట్టవని తెలిపారు.
ఈ చేప మూడున్నర అడుగుల వరకు పొడవు పెరుగుతుందని, గరిష్ఠంగా 40 కిలోల వరకు బరువు తూగూతుందని ODWC అధికారులు వెల్లడించారు. ఇలాంటి చేపలను కొందరు ఇళ్లలో పెంచుకుంటున్నారని, ఇళ్లలోని నీటి సంపుల్లో వీటి సంఖ్య ఎక్కువైనప్పుడు సమీపంలో చెరువులో వదిలేస్తున్నారని చెప్పారు. ఇలా చేయడం స్థానిక పర్యావరణ వ్యవస్థలు దెబ్బ తింటాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వీలైతే ఇలాంటి చేపలను చెరువుల నుంచి తొలగించడం మంచిదని అన్నారు.
తప్పక చదవండి
-Advertisement-