చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్‌పై పరిశ్రమ వర్గాల్లో హాట్ డిబేట్ సాగుతుండగా న్యూ టెక్నాలజీతో కొలువుల కోత తప్పదనే అంచనాలు నిజమవుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. గత కొద్ది నెలలుగా టెక్ జాబ్ మార్కెట్ ఒడిదుడుకులతో సాగుతుండగా చాట్‌జీపీటీ, బార్డ్, బింగ్ వంటి ఏఐ టూల్స్ లాంఛ్ అయిన అనంతరం పరిస్ధితి మరింత సంక్లిష్టంగా మారింది. మేలో ఏకంగా 4000 మంది టెకీలను ఏఐ రీప్లేస్ చేసిందనే లేటెస్ట్ రిపోర్ట్ ఉద్యోగుల్లో గుబులు రేపుతోంది. పలు కంపెనీలు ఏఐ టూల్స్‌ను వినియోగిస్తుండటంతో క్రమంగా కొలువుల కోత ముంచుకొస్తున్నది. గత నెలలో మొత్తం 80,000 మంది ఉద్యోగాలు కోల్పోయారని ఈ నివేదిక వెల్లడించింది. వీటిలో 4000 మంది ఉద్యోగులు ఏఐ కారణంగా కొలువులు కోల్పోయారని బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక తెలిపింది.
ఆర్ధిక అనిశ్చితి పరిస్ధితులతో పాటు పలు కంపెనీలు వ్యయ నియంత్రణ చర్యలకు పాల్పడుతుండటంతో ఎడాపెడా లేఆఫ్స్‌కు కంపెనీలు తెరలేపుతున్నాయి. ఏఐ విధ్వంసం కూడా దీనికి తోడవడంతో ఉద్యోగ భద్రత ప్రశ్నార్ధకమవుతోంది. ఇక ఈ ఏడాది జనవరి నుంచి మే వరకూ ఏకంగా 4 లక్షల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారని తాజా నివేదిక స్పష్టం చేసింది. కొన్ని అమెరికన్ కంపెనీలు వర్కర్ల స్ధానంలో చాట్‌జీపీటీని వాడటం ప్రారంభించాయని జాబ్ అడ్వైజ్ ప్లాట్‌ఫాం రెజ్యూమ్‌బిల్డర్.కాం నిర్వహించిన మరో అధ్యయనం ఇటీవల వెల్లడించింది.