విద్యుత్తు ఆధారిత ద్విచక్ర వాహనాల ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో వాహనం ధర గరిష్ఠంగా రూ.22వేల వరకు పెరగడం గమనార్హం. ఇన్నాళ్లూ ఎలక్ట్రిక్ టూవీలర్స్ తయారీదారులకు ఇచ్చిన సబ్సిడీకి కేంద్ర ప్రభుత్వం కోత పెట్టడమే ఇందుకు కారణం. దేశంలో ప్రమాదకర స్థాయిలో పెరిగిన వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడం.. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించడంలో భాగంగా మోదీ సర్కారు విద్యుత్తు ఆధారిత వాహన అమ్మకాలను ప్రోత్సహిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి తెచ్చిన (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికిల్స్ (ఫేమ్) 2 పథకంలో ఇప్పుడు సవరణలు చేసింది. ఈ మార్పులు గురువారం నుంచే అమల్లోకి రాగా.. ఇప్పటిదాకా అందిన రాయితీలు భారీగా తగ్గిపోతున్నాయి. ఫలితంగా ఈ భారాన్ని ఆయా సంస్థలు వినియోగదారులపైనే మోపేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే టీవీఎస్ మోటర్ కంపెనీ, ఏథర్ ఎనర్జీ, ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలు తమ ఎలక్ట్రిక్ టూవీలర్ల ధరలను ఆ మేరకు పెంచేశాయి.