మద్యం బాటిళ్లలో కరిగించిన కొకైన్‌ను అక్రమంగా రవాణా చేస్తున్న ఓ విదేశీ మహిళను ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 25 ఏండ్ల కెన్యా యువతి.. ఇథియోపియాలోని అడిస్ అబాబా నుంచి ఢిల్లీకి చేరుకున్నది. చెకింగ్ వద్ద తనిఖీలు చేస్తున్న కస్టమ్స్ అధికారులు.. ఆ కెన్యా యువతిని అడ్డుకున్నారు. పూర్తిగా తనిఖీలు చేయడంతో ఆమె వద్ద గల రెండు విస్కీ బాటిళ్లలో కరిగించిన కొకైన్ ఉన్నట్లు, దానిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ కొకైన్ విలువ రూ.13 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు చెప్పారు.
కెన్యాలోని నైరోబీ విమానాశ్రయంలో ఈ రెండు సీసాలు ఆమె వద్దకు చేరాయి. వాటిని ఢిల్లీలోని ఒక వ్యక్తికి ఆమె అంద చేయాల్సి ఉందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేశామని చెప్పారు. మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు.