- పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టుల పూర్తికి లైన్ క్లియర్
- రాబోయే సార్వత్రక ఎన్నికల దృష్ట్యా పలు కీలక నిర్ణయాలు
- ఏపీ, తెలంగాణల్లో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు లైన్ క్లియర్
- వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్
న్యూ ఢిల్లీ : వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న నేపథ్యంలో- కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఏపీ, తెలంగాణల్లో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులపై వరాల జల్లును కురిపించింది. వాటిని పూర్తి చేయడానికి, విస్తరణ పనులను చేపట్టడానికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.దేశవ్యాప్తంగా 35 జిల్లాల్లో ఎంపిక చేసిన ఏడు మార్గాల్లో పట్టాల ఆధునికీకరణ, డబ్లింగ్ పనులు చేపట్టడం, విద్యుదీకరణ.. వంటి పనులకు చేపట్టనుంది.. ఏపీ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లల్లో రైల్వే నెట్‌వర్క్‌ను మెరుగుపర్చనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు..ఈ ఏడు రాష్ట్రాల్లో 2వేల 339 కిలోమీటర్ల మేర పట్టాల ఆధునికీకరణ, డబ్లింగ్ పనులను చేపట్టనుంది కేంద్రం. దీనికోసం 32వేల 500 కోట్ల ఖర్చు చేయనుంది.. దేశవ్యాప్తంగా 7 రైలు మార్గాలను 2 నుంచి 4 వరుసల వరకు విస్తరిస్తారు. ఇందులో గుంటూరు- బీబీనగర్ సెక్షన్ మధ్య డబ్లింగ్ ప్రాజెక్ట్‌ను చేర్చింది. 272.69 కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులకు అయ్యే ఖర్చు 3వేల238 కోట్ల రూపాయలు.ఈ ప్రాజెక్టువల్ల చెన్నై-హైదరాబాద్ మధ్య 76 కిలోమీటర్లు, విజయవాడ-సికింద్రాబాద్ మధ్య 38 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. చెన్నై-విజయవాడ-హైదరాబాద్ మధ్య మరిన్ని రైలు సేవలు అందుబాటులోకి వస్తాయి. జగ్గయ్యపేట, జాన్‌పహాడ్‌లలో ఉన్న సిమెంట్ కర్మాగారాలకు, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని ధాన్యం మిల్లులకు దీనివల్ల మేలు జరుగుతుంది. 239 కి.మీ. ప్రాజెక్టులో 100 కి.మీ. ఏపీ పరిధిలోకి, 139 కి.మీ. తెలంగాణ పరిధిలోకి వస్తుంది. కృష్ణానదిపై 458 మీటర్ల పొడవైన వంతెన నిర్మిస్తారు’’ అని అశ్వినీ వైష్ణవ్ వివరించారు.
మహారాష్ట్రలోని ముద్ఖేడ్ నుంచి తెలంగాణలోని మేడ్చల్ వరకు, అలాగే తెలంగాణలోని మహబూబ్‌నగర్- ఏపీలోని డోన్ మధ్య మార్గాన్ని రూ.5,655 కోట్లతో డబ్లింగ్‌గా మారుస్తారు. ఇందులో 49 కి.మీ. పని మహారాష్ట్రలో, 295 కి.మీ. తెలంగాణలోని నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, వనపర్తి, జోగులాంబ గద్వాల, మేడ్చల్-మల్కాజిగిరి, మహబూబ్‌నగర్‌లలో, 74 కి.మీ. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, డోన్ వరకు సాగుతుంది. ఈ పనులతో సికింద్రాబాద్-బెంగళూరు మధ్య రైళ్ల రాకపోకలు విస్తరిస్తాయి. రెండింటి మధ్య దూరం 50 కిలోమీటర్లు తగ్గుతుంది. . రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్‌ల నుంచి దక్షిణాదికి రావడానికి 3-4 గంటల సమయం తగ్గుతుంది’’ అని వైష్ణవ్ వెల్లడించారు.