Monday, June 17, 2024

డోజర్ ట్రాక్టర్ నడుపుతుండగా పేలిన సెల్ ఫోన్.

తప్పక చదవండి

ట్రాక్టర్ బోల్తాపడి, డ్రైవర్‌‌కు తీవ్ర గాయాలు.
సెల్ ఫోన్ పేలడానికి కారణం ఏంటి?

సెల్ ఫోన్ అకస్మాత్తుగా పేలడంతో డోజర్ ట్రాక్టర్ బోల్తాపడింది. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అనంతారంలో బుధవారం (జూన్ 14) మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సాధ్య తండాకు చెందిన గగులోతు రవి తన యజమాని ఆదేశాలతో డోజర్ ట్రాక్టర్‌ను రిపేర్ చేయించేందుకు వరంగల్ నగరానికి తీసుకెళ్తున్నాడు. అనంతారం క్రాస్ రోడ్డు వద్దకు రాగానే, అతడి చేతిలో ఉన్న సెల్‌ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. ఆ హఠాత్పరిణామంతో అతడు ఆందోళనకు గురికావడంతో వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో డోజర్ ట్రాక్టర్ బోల్తాపడింది. డ్రైవర్ రవి తీవ్రంగా గాయపడ్డాడు.

- Advertisement -

గాయాలతో రక్తమోడుతూ విలవిల్లాడుతున్న రవిని స్థానికులు గమనించి పక్కకు తీసుకెళ్లి సపర్యలు చేశారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతారం క్రాస్ రోడ్డు వద్దకు రాగానే.. అతడి సెల్‌ఫోన్ మోగిందని, ఫోన్ మాట్లాడుతుండగా.. చేతిలోనే పేలిపోయిందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. సెల్ ఫోన్ పేలడానికి కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది.

రైతు చేతిలోనే పేలిన సెల్‌ఫోన్..
సెల్ ఫోన్ పేలడంతో రైతు గాయపడిన ఘటన వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో ఏప్రిల్ నెలలో చోటుచేసుకుంది. ఫోన్ మాట్లాడుతుండగా పేలిపోయింది. మహబూబాబాద్ జిల్లా పెద్ద గూడురుకు చెందిన ఆంగోతు రవి అనే రైతు తన మిర్చీ పంటను అమ్మేందుకు ఎనుమాముల మిర్చి యార్డుకు వచ్చాడు. ఇంతలో బంధువు ఒకరు ఫోన్ చేయడంతో మాట్లాడుతుండగా.. ఫోన్ ఒక్కసారిగా అతడి చేతిలోనే పేలిపోయింది.

అప్రమత్తమై రైతు రవి సెల్ ఫోన్‌ను వెంటనే కింద పడేశాడు. ఈ ఘటనలో అతడి చేతికి గాయాలయ్యాయి. పెను ప్రమాదమైతే తప్పింది. బ్యాటరీ వేడెక్కడం వల్లే ఫోన్ పేలిపోయి ఉంటుందని బాధితుడు తెలిపాడు.

సెల్ ఫోన్లు ఎందుకు పేలుతాయి?
సెల్‌ఫోన్ పేలడానికి బ్యాటరీ లోపాలు ఎక్కువ శాతం కారణం అవుతాయి. కొన్నిసార్లు సెల్ ఫోన్ తయారీలో లోపాలు కూడా కారణమవుతాయి. సాధారణంగా ఛార్జింగ్ పెట్టినప్పుడు బ్యాటరీలు కాస్త హీటెక్కుతాయి. చాలా మంది ఫోన్ ఛార్జింగ్ పెట్టి అలాగే వదిలేస్తారు. ఇది చాలా ప్రమాదకరం. 95 శాతం ఛార్జింగ్ అవగానే డిస్‌కనెక్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక బ్యాటరీ కాస్త ఉబ్బినట్లు కనిపిస్తే, వెంటనే మార్చుకోవడం ఉత్తమం. లేకపోతే, పేలిపోయే ప్రమాదం ఉంటుంది.

కంపెనీ ఛార్జర్లు కాకుండా ఇతర ఫోన్ల ఛార్జర్లు వాడటం కూడా బ్యాటరీలు పాడయ్యేందుకు కారణం అవుతాయి. ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేయడం ఉత్తమ పద్ధతి. కొంత మంది ఛార్జింగ్‌లో ఉండగానే.. ఫోన్ మాట్లాడుతుంటారు. యూట్యూబ్ వీడియోలు చూస్తుంటారు. ఇలా చేస్తే బ్యాటరీపై అదనపు ఒత్తిడి పడుతుంది. పేలిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు కనీసం ఇంటర్నెట్ అయినా ఆఫ్ చేయడం ఉత్తమ పద్ధతి. ఫోన్ మాట్లాడటం, ఇంటర్నెట్ వినియోగించడం లాంటివి మాత్రం అస్సలు చేయొద్దని నిపుణులు చెబుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు