కెనడాలోని టొరంటోలో భారత రాయబార కార్యాలయం ఎదుట ఖలిస్థాన్ అనుకూల వాదులు శనివారం ర్యాలీ చేపట్టారు. జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ అధిపతి, ఎస్‌ఎఫ్‌జే నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై నిరసనకు దిగారు. ఆయన హత్య వెనుక భారత్ హస్తం ఉందని ఆరోపించారు. భారత జాతీయ జెండాను అవమానించేందుకు ప్రయత్నించారు. అయితే టొరంటోలోని ప్రవాస భారతీయులు కూడా పోటీగా ప్రదర్శన చేపట్టారు. భారతీయ జెండాలను చేతపట్టారు. ‘జై భారత్ మాతా’, ‘వందేమాతరం’ వంటి నినాదాలు చేశారు. ఖలిస్థాన్ ర్యాలీని ప్రతిఘటించారు. ‘ఖలిస్థానీలు సిక్కులు కాదు’, ‘ఉగ్రవాదులు’ అన్న ఫ్లకార్డులను ప్రదర్శించారు. టొరంటోలోని భారత కాన్సులేట్ వద్ద రోడ్డుకు ఇరువైపులా ఒకవైపు ఖలిస్థానీలు, మరోవైపు కెనడాలోని ప్రవాస భారతీయులు పోటాపోటీగా ర్యాలీలు చేపట్టారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కెనడా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.
కాగా, కెనడాలోని ఒంటారియోలో బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయం వద్ద ‘యుద్ధ ప్రాంతం’గా పేర్కొంటూ ఒక బ్యానర్‌ను ఖలిస్థానీలు ఏర్పాటు చేశారు. కెనడాలోని అగ్రశ్రేణి భారతీయ దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకున్నారు. షాహీద్ నిజ్జర్ హత్యకు కారకులైన ముఖాలని అందులో పేర్కొన్నారు.
మరోవైపు లండన్‌లోని భారత హైకమిషన్ వెలుపల కూడా శనివారం ఖలిస్థానీ గ్రూపులు నిరసనకు పిలుపునిచ్చాయి. అయితే చాలా కొంత మంది మాత్రమే నిరసనలో పాల్గొన్నారు. అలాగే చాలా త్వరగానే నిరసన ప్రదర్శనను ముగించారు. టొరంటో, లండన్‌లో జరిగిన నిరసనలకు సంబంధించిన వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.