గతేడాదితో పోలిస్తే గత నెలలో కార్లతోపాటు టూ వీలర్స్ సేల్స్‌లో 10 శాతం గ్రోత్ నమోదైంది. 2022 జూన్‌లో 17,01,105 వాహనాలు అమ్ముడైతే, గత నెలలో 18,63,868 యూనిట్లు సేల్ అయ్యాయి. జూన్ వాహనాల విక్రయాలపై ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) నివేదిక విడుదల చేసింది. అయితే, ఈ ఏడాది మే నెలతో పోలిస్తే రిటైల్ వాహనాల విక్రయాలు ఎనిమిది శాతం తగ్గుముఖం పట్టాయి. సమీప భవిష్యత్‌లో స్వల్పకాలం వాహనాల విక్రయాలు తగ్గుతాయని సంకేతాలు కనిపిస్తున్నాయి. జూన్ నెలలో 2,95,299 కార్ల విక్రయాలు జరిగాయి. 2022 జూన్ లో 2,81,811 యూనిట్లతో పోలిస్తే ఐదు శాతం గ్రోత్. టూ వీలర్స్ సేల్స్ గతేడాది జూన్‌తో పోలిస్తే ఏడు శాతం పెరిగి 12, 27,149 యూనిట్ల నుంచి 13, 10,186 యూనిట్లకు చేరాయి.
అనూహ్యంగా త్రీ వీలర్స్ విక్రయాల్లో 75 శాతం గ్రోత్ రికార్డైంది. 2022 జూన్ నెలలో 49,299 యూనిట్లు విక్రయమైతే, ఈ ఏడాది 86,511 యూనిట్లకు చేరాయి. ట్రాక్టర్ల విక్రయాలు 45 శాతం గ్రోత్‌తో 98,660 యూనిట్లకు, కమర్షియల్ వాహనాలు 72,894 యూనిట్ల నుంచి స్వల్పంగా 73,212 యూనిట్లకు పెరిగాయి.
మారుతి సుజుకి కార్ల సేల్స్ 41.09 శాతం పెరిగితే, హ్యుండాయ్ 14.59 శాతం, టాటా మోటార్స్ 13.47 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 10.18, కియా మోటార్స్ 5.67 శాతం గ్రోత్ నమోదు చేశాయి.