Friday, July 19, 2024

అవినీతి భాగస్వాములుబీ.ఆర్.ఎస్., బీజేపీ నాయకులు..

తప్పక చదవండి
  • పెద్ద చెరువు, నటికన్ చెరువులోని ఎఫ్.టి.ఎల్., బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మాణాలు సాగించి, అమాయకులను మోసం చేసిన అరాచకీయం
  • చీర్యాల గ్రామంలో వెలుగు చూసిన శత్రువుల మితృత్వం..
  • ఒకరు బీ.ఆర్.ఎస్., మరొకరు బీజేపీ.. ఇద్దరూ కలిసి దర్జాగా కబ్జాలు
  • కీసర మండలం, చీర్యాల గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ ల ధనదాహం..
  • రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆశయాలను కాలరాస్తున్న కుటిల రాజకీయం..
  • జిల్లా కలెక్టర్ దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకుని గ్రామస్తులను కాపాలంటున్న స్థానికులు

రాజకీయ నాయకుడైతే చాలు వాళ్ళు ఏపార్టీ వాళ్ళన్నది ఇక్కడ సమస్య కాదు.. ముఖానికి రాజకీయంగానే రంగును పులుముకుని యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడవచ్చు అన్న కొత్త నానుడికి శ్రీకారం చుడుతున్నారు కొందరు సోకాల్డ్ రాజకీయ నాయకులు.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి తూట్లు పొడుస్తూ.. ఏకంగా చెరువులనే చెరబడుతున్న నాయకుల చరిత్ర ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.. క్షేత్ర స్థాయిలోని నాయకులే కుయుక్తులు పన్నుతూ.. స్థానిక ప్రజలను దోచుకుంటూ.. చట్టాలను లెక్కచేయకుండా వారిని అమాయకులను చేస్తూ.. మాయమాటలతో మభ్యపెడుతూ.. నీడ కల్పిస్తామని చెబుతూ.. చెరువులకు సంబంధించిన ఎఫ్.టి.ఎల్., బఫర్ జోన్లలో ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రోత్సాహం అందిస్తున్నారు.. వీరి మాటలు నమ్మిన అమాయక ప్రజలు లక్షల రూపాయలు వారి చేతుల్లో పోసి, అనుమతులు లేని చోట ఇండ్లు నిర్మించుకుంటూ కోరి కోరి సమస్యలు తెచ్చుకుంటున్నారు.. గ్రామ ప్రజల అవగాహనా రాహిత్యాన్ని ఆసరాగా చేసుకుంటూ లక్షలు వెనుకేసుకుంటున్నారు కుటిల రాజకీయ నాయకులు.. ఈ కోవలోకే వస్తారు చీర్యాల గ్రామ సర్పంచ్ బీ.ఆర్.ఎస్. స్థానిక నాయకులు తుంగ ధర్మేందర్, ఉప సర్పంచ్ బీజేపీ స్థానిక నాయకులు జిల్లాల తిరుమల రెడ్డి.. పేరులో ధర్మాన్ని, దేవుడిని నింపుకున్న ఈ నీచ రాజకీయ నాయకులు స్థానిక ప్రజలను దోచుకుంటూ వారిని అన్యాయంగా సమస్యల్లోకి నెట్టేస్తూ.. ప్రభుత్వ ఆశయాలకు గండి కొడుతూ అక్రమ సంపాదనతో ఊరేగుతుండటం శోచనీయం.. రాజకీయ పదవిని అనుభవిస్తూ.. ప్రజలకు సేవచేయాల్సిన వారే ప్రజల కంటకులుగా మారుతున్న వైనాన్ని మీ ముందుకు తీసుకుని వస్తోంది ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘..

- Advertisement -

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, కీసర మండలం, చీర్యాల గ్రామంలో పెద్ద చెరువు, నటికన్ చెరువులు కబ్జాకి గురవుతున్నాయని, రానున్న రోజుల్లో ప్రజలు ఇబ్బంది పడతారని ఆలోచనతో అడిషనల్ కలెక్టర్ అగస్త్య ని కలిసి చీరాలలో జరుగుతున్న సమస్యల గురించి వివరించి.. ఎఫ్.టి.ఎల్., బఫర్ జోన్ బౌండరీస్ ఫిక్స్ చేయమని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేయడం జరిగింది.

స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి 7 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా.. అడిషనల్ కలెక్టర్ నోటీసు పంపడం జరిగింది. కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు అడిషనల్ కలెక్టర్ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ కాలయాపన చేయడంతో.. తిరిగి వారు మేడ్చల్ జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకు రావడంతో.. కలెక్టర్ ఈ విషయంపై సీరియస్ అవుతూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎఫ్.టి.ఎల్., బఫర్ జోన్స్ ని ఫిక్స్ చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయితీ రాజ్ శాఖ అధికారులు సంయుక్తంగా గ్రామాన్ని సందర్శించి.. చిర్యాల గ్రామంలో కబ్జాకు గురైన పెద్ద చెరువు, నటికన్ చెరువులను పరిశీలించి.. చెరువుల పూర్తి విస్తీర్ణం.. ఎఫ్.టి.ఎల్., బఫర్ జోన్లను గుర్తించి హద్దులు చేయడం జరిగింది.. అధికారులు నిర్ణయించిన హద్దులే ప్రకారం పెద్దచెరువు ఎఫ్.టి.ఎల్.లో 15 బిల్డింగులు, బఫర్ జోన్ లో 9 బిల్డింగ్ లు నిర్మించినట్లు గుర్తించారు.. అదేవిధంగా నటికన్ చెరువులో 7 బిల్డింగులు, ఎం.ఎఫ్.ఎల్., బఫర్ జోన్ లో నిర్మించినట్లు గుర్తించారు.. అదీ కాక సుమారుగా 1. 82 ఎకరాల్లో రోడ్లు కూడా నిర్మించినట్లు తేల్చారు.. అక్కడ నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించడానికి ప్రయత్నం చేయగా స్థానిక రాజకీయ నాయకులు వారిని నిలువరించి వెనక్కి పంపించడం జరిగింది.. కాగా ఇదే వ్యవహారంపై సంబంధిత అధికారులు 15 మార్చి 2023 నాడు స్థానిక కీసర పోలీస్ స్టేషన్ లో.. కబ్జాలకు కారకులైన వారిమీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేయడం జరిగింది..

ఈ పూర్తి అవినీతి వ్యవహారానికి ముఖ్య సూత్రదారి చీర్యాల గ్రామ పంచాయితీ సర్పంచ్ బీ.ఆర్.ఎస్. నాయకుడు తుంగ ధర్మేందర్ అని తెలుస్తోంది.. ఇతనితో చేతులు కలిపి ఈ అవినీతి భాగోతంలో పాలుపంచుకున్నవారు ఉప సర్పంచ్, బీజేపీ నాయకుడు జిల్లాల తిరుమల్ రెడ్డి.. అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. వీరు అప్పటి గ్రామ కార్యదర్శితో ములాఖత్ అయ్యి, ఈ రెండు చెరువులలో అక్రమ నిర్మాణాలు చేసుకోవడానికి గ్రామస్తుల నుండి లక్షల్లో వసూలు చేసినట్లు తెలుస్తోంది.. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్వయంగా పూనుకుని జరిగిన అక్రమాలపై కొరడా ఝుళిపించి, ఇంతటి అవినీతికి పాల్పడిన స్థానిక బీ.ఆర్.ఎస్. సర్పంచ్, బీజేపీ ఉప సర్పంచ్ లపై, వారికి సహకరించిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుని ప్రభుత్వ ఆశయాలను సజీవంగా ఉంచాలని.. మోసపోయిన అమాయకులను కాపాడి వారికి న్యాయం జరిగేలా చూడాలని పలువురు కోరుతున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు