Monday, April 29, 2024

బీసీ కులాల్లో రాజకీయ చైతన్యంతెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ప్రాధాన్యం

తప్పక చదవండి

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల్లో కదలిక వచ్చినట్లే బీసీ వర్గాల్లో కూడా చైతన్యం మొదలైంది. ఎన్నికలొస్తే రాజకీయ పార్టీలు బీసీల జపం చేయడం అలవాటైపోయింది. కులవృత్తులు చేసుకునే జనసమూహమే బీసీ వర్గాలైనందున జనాభాలో వారు అత్యధికంగా అంటే 50 శాతానికి పైగా ఉంటారు. దాంతో రాజకీయ పార్టీలు కూడా వారి ప్రాధాన్యతను గుర్తిస్తుంటాయి. అయితే, అనాదిగా వారిని ఓటు బ్యాంకుగా చూడటమే ఈ ప్రాతీయ పార్టీలకు అలవాటైపోయింది. దానికి తోడు శాసనసభ, లోక్ సభలలో ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు వీరికి లేకపోవడం వల్ల కూడా వీరు తీవ్రంగా నష్టపోతున్నారు. సమతౌల్యంపేరుతో కొన్ని సీట్లు ఇచ్చినా, గెలిచినవారికి ప్రాధాన్యం తక్కువే. మంత్రి పదవులు కూడా లెక్కకే ఇస్తారు. అధికారం ఏమీ ఉండదు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నచోట బీసీ నేతలు మంత్రులైనా వారి చేతిలో అధికారం నేతిబీరకాయ చందంగా ఉంటుంది. రాజకీయ అధికారం లేకుండా బీసీ వర్గాల అభివృద్ధి సాధ్యంకాదనేది బీసీ కులాలు తెలుసుకున్నాయి. జనాభాలో 50 శాతానికి పైగా తామున్నప్పటికీ తగిన ప్రాధాన్యత లేదన్న బాధ, వేదన వారిలో తీవ్రస్థాయిలో నెలకొంది. తమలో ఐకమత్యంలేకపోవడం వల్లే పరిస్థితి ఇలా ఉందని వారికి స్పష్టమైంది. రాజకీయ భాగస్వామ్యం కోసం వారు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు.

బీసీ వర్గాలలోని ఉత్సాహవంతులైన యువత రాజకీయంగా ఎందగడానికి చేయవలసిన ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజికంగా అన్ని విధాల వెనుకబడిన తాము ఏకం కాకపోతే మరో వందేళ్లైనా తమ బతుకుల్లో మార్పు రాదని వారికి అర్ధమైంది. ముఖ్యంగా బీసీ వర్గాలలోని మేథావులు, ఉద్యోగులు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. అయితే, బీసీ కులాలన్నీ ఏకం కావడానికి అనేక అడ్డంకులు ఉన్నాయి. వాటిని అధిగమించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీసీలలో నాయకత్వ కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ముందు దానిని అదిగమించే ప్రయత్నంలో అన్ని జిల్లాల్లో యువతను ప్రోత్సహిస్తున్నారు. బీసీలలో ఎవరి కులాలు వారివి, ఎవరి వాదాలు, ఎవరి ఆలోచనలు, ఎవరి అభిప్రాయాలు వారివి. విభిన్న దృక్పధాలతో ఉన్న వారందరినీ కలపడానికి బీసీ అనే భావనతో ముందుకు వెళ్లడానికి మేథావి వర్గం ప్రయత్నిస్తోంది. ఆయా కుల సంఘాలు తమ ఉనికిని చాటుకుంటూనే, బీసీ వర్గాలుగా ఏకమవడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.
ఈ అంశాలను దృష్టిలోపెట్టుకుని ఈ నెల 11న హైదరాబాద్ లో పెద్ద ఎత్తున బీసీ డిక్లరేషన్-2023 మహాభ నిర్వహించారు. జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో బీసీలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్, జస్టిస్ వి.ఈశ్వరయ్య, ప్రొఫెసర్ మురళీమనోహర్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి
జస్టిస్ వి.చంద్రకుమార్, బీపీ మండల్ మనవడు ప్రొఫెసర్ సూరజ్ యాదవ్ మండల్, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు చౌదరి వికాస్ పటేల్, ప్రొఫెసర్ ఇనుకొండ తిరుమలి తదితరులు పాల్గొన్నారు. బీసీ ఉద్యమానికి మరింత ఊపునిచ్చేవిధంగా తెలంగాణలో బీసీ జర్నలిస్టులు కూడా రాజకీయంగా ఏకమయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో బీసీలకు ప్రధాన్యత ఇస్తున్నట్లు బీఆర్ఎస్ చెప్పడమేగాక బీసీలకు రూ.లక్ష సహాయం పథకం కూడా ప్రకటించింది. బీజేపీ ఏకంగా పలు అంశాలతో బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. కాంగ్రెస్ కూడా బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తామని తెలిపింది.
ఈ నేపథ్యంలో బీసీ ముఖ్య నేతలు ఎండలను కూడా లెక్కచేయకుండా పట్టుదలతో తెలంగాణ, ఏపీలలో అన్ని జిల్లాలలో పర్యటిస్తూ సభలు, సమావేశాలు నిర్వహిస్తూ, బీసీలను ఒక్కతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో బీసీ సంక్షేమసంఘం జాతీయ నేతలు గుజ్జ కృష్ణ, డాక్టర్ నందకిషోర్, మల్లేశ్ తదితరులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఏపీలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు, ఆ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, యువజన విభాగం అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్ యాదవ్, కన్నా మాస్టర్, అన్నవరపు నాగమల్లేశ్వరరావు, మరోవైపు బీసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు సొంటి నాగరాజు, రాష్ట్ర కోఆర్డినేటర్ పరసా రంగనాథ్, మీనిగ ఆంజనేయులు, షేక్ ఆసిఫ్ పాషా, ఏలూరి విజయలక్ష్మి, తాతా కృష్ణారావు తదితరులు పర్యటిస్తూ బీసీలలో ఐక్యత పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఆగస్టు 7న తిరుపతిలో భారీ స్థాయిలో ఓబీసీ మహాసభ నిర్వహించనున్నట్లు కేసన శంకరరావు ప్రకటించారు. ఏపీలో ఇటు వైసీపీ, అటు టీడీపీ బీసీల జపం చేస్తున్నాయి. వైఎస్ జగన్ సీఎం కాగానే మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులు బీసీలకు బాగా ఇచ్చారు. గతంలో ఇవ్వని కులాలకు కూడా కొన్ని పదవులు ఇచ్చారు. ఈ పదవుల వల్ల వారికి ఒరిగింది ఏమీలేదు. ఏవిధమైన అధికారంలేదు. అయినా, గుర్తించి పదవులు ఇచ్చారనే సంతృప్తి వారిలో కనిపిస్తోంది. టీడీపీ మొదటి నుంచి బీసీల పార్టీగా గుర్తింపు పొందింది. వాస్తవానికి ఎన్నో ఏళ్లపాటు తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడింది బీసీలే. అయితే, గత ప్రభుత్వంలో పదవులు ఇవ్వడంలో న్యాయం చేయలేదన్న విమర్శ ఉంది. ముఖ్యంగా నామినేటెడ్ పదవులు చివరి వరకు భర్తీచేయకుండా బీసీలకు అన్యాయం చేశారన్న భావన ఉంది. అయితే, పార్టీలో ఈ విషయమై చర్చ జరిగిందని, ఇక ముందు అలా జరగదని ఆ పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. ఏదిఏమైనా ఈసారి ఇరు పార్టీలు పోటీపడి బీసీలకు టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. దానిని సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచనలో బీసీ నేతలు ఉన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా బీసీలు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా వారికి మద్దతు ఇచ్చి గెలిపించాలని బీసీ నేతలు ఊరూరా తిరిగి ప్రచారం చేస్తున్నారు. పోటీ పడే అభ్యర్థులందరూ బీసీలయితే ఏకాభిప్రాయంతో ఎవరో ఒకరికి మద్దతు ఇవ్వాలని, అలా సాధ్యం కానిపక్షంలో తటస్థంగా ఉండటం మంచిదన్న ఆలోచన కూడా వారిలో ఉంది. ఆర్థికంగా స్థితిమంతులు, విద్యావంతులైన బీసీ యువతను రాజకీయాల్లోకి ఆహ్వానించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కుల వ్యవస్థ వేళ్లూనుకుపోయిన మన సమాజంలో ఇతర కులాల సహాయ, సహకారంలేకుండా రాజకీయంగా ఎదగడం ఎవరికీ సాధ్యం కాదు. అందువల్ల రాజకీయంగా అన్ని కులాలతో సఖ్యతగా ఉండాలన్న నిర్ణయంతో ఉన్నారు. అలాగే, ఆయా కులాల పెద్దలను కలిసి అన్ని బీసీ కుల, ఉద్యోగ, వృత్తి సంఘాలను కలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్థికంగా కూడా తగిన స్థాయిలో తమ వర్గానికి చెందిన వ్యాపారులు, ఉద్యోగుల నుంచి నిధులు సేకరించడానికి ప్రణాళికలు రూపొందించుకున్నారు. ప్రతి జిల్లాలో భారీ స్థాయిలో బీసీ సభలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. బీసీల బలం నిరూపించే ప్రయత్నాలు కూడా ముమ్మరంగా చేస్తున్నారు.

- Advertisement -

టీడీపీకి ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలను తమవైపు తిప్పుకునేందుకు వైసీపీ అధికారంలోకి వచ్చాక తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బీసీల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారు. పది మందికి పైగా మంత్రి పదవులు ఇచ్చారు. అసెంబ్లీ స్పీకర్ కూడా బీసీనే. 56 కార్పొరేషన్లను బీసీలకు కట్టబెట్టారు. పలు కార్పొరేషన్ల డైరెక్టర్లుగా బీసీలకు పెద్దఎత్తున అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్సీలుగా కూడా వైసీసీ బీసీలకు అవకాశం ఇచ్చింది. రాజ్యసభ సభ్యులుగా బీసీలైన ఆర్.కృష్ణయ్య, పిల్లి సుభాశ్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు తదితరులను ఎంపిక చేశారు. బీసీలంటే మొదట గుర్తొచ్చేది కృష్ణయ్యే. అలాంటి కృష్ణయ్యను రాజ్యసభకు పంపడం ద్వారా తామే నిజమైన బీసీ పక్షపాతి అని చెప్పే ప్రయత్నం చేసింది వైసీపీ. అయితే, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడు కావడంతో ఉద్యమ ఊపు తగ్గింది. పదవిని అలంకరించినవారు ఉద్యమానికి క్రమక్రమంగా దూరం కావడం సహజం. అటువంటివారు జనం నమ్మకం కూడా కోల్పోతారు. ఇప్పుడు టీడీపీ కూడా బీసీలకు ప్రధాన్యం ఇస్తామని చెబుతూ పంచుమర్తి అనురాధను ఎమ్మెల్సీగా గెలిపించుకుంది. బీసీలు ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ వైపే ఉంటారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే, ఆచరణలో అది కనిపించడంలేదన్న విమర్శ ఉంది. వ్యవసాయ రంగం తర్వాత అత్యధికమంది ఆధారపడే బీసీ వర్గానికి చెందిన చేనేతను టీడీపీ గుర్తించినట్లు కనిపించడంలేదని అంటున్నారు. ఆ వర్గాల్లో తీవ్ర నిరాశ, నిస్పృహ కనిపిస్తోంది. టీడీపీలో అన్ని విభాగాలకు కార్యవర్గాలను నియమించారు. చేనేత విభాగానికి మాత్రం ఇప్పటి వరకు కార్యవర్గాన్ని నియమించలేదు. శాసనసభ ఎన్నికల్లో మంగళగిరి, చీరాల, పెడన, వెంకటగిరి, తాడిపర్తి, కర్నూలు … వంటి 45 స్థానాలను ప్రభావితం చేయగలిగిన స్థాయిలో చేనేత వర్గం ఉంది. ఒక పక్క మంగళగిరిలో టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావుకు ఆ పార్టీ ఎమ్మెల్సీని చేసింది. మంగళగిరికే చెందిన మరో నేత, మునిసిపల్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవి వైసీపీలో చేరిన వెంటనే ఆ పార్టీ చేనేత విభాగం అధ్యక్ష పదవి అప్పగించింది. ఆ తరువాత అతనికే ఆప్కో చైర్మన్ పదవి కూడా ఇచ్చింది. ఓవైపు వైసీపీ మంగళగిరిలో చేనేత వర్గానికి అంతటి ప్రాధాన్యం ఇస్తుంటే, టీడీపీ మాత్రం పట్టించుకున్నట్లు కనిపించడంలేదు. మంగళగిరికి చెందిన చేనేత నాయకుడు, టీడీపీ పుట్టినప్పటి నుంచి ఆ పార్టీలోనే నమ్ముకుని, అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ నేత గుత్తికొండ ధనుంజయకు ప్రాధాన్యత కలిగిన పదవి ఇవ్వలేదని ఆ వర్గం వారు విమర్శిస్తున్నారు. గంజి చిరంజీవికి కుడిభుజంగా ఉన్న ధనుంజయ చిరంజీవి పార్టీ మారినా, తను మారకుండా ఉన్నాడు. చేనేత విభాగం కార్యవర్గం ఏర్పాటు చేసి, ఆయనకు అధ్యక్ష పదవి ఇస్తారని చేనేత వర్గాల వారు చాలా కాలంగా భావిస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గత ఎన్నికల్లో మంగళగిరి నుంచే పోటీచేసి ఓడిపోయారు. మళ్లీ ఇక్కడే పోటీ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో దాదాపు 36 శాతం మంది చేనేత వర్గాల ఓటర్లు ఉన్నా వారికి తగిన గుర్తింపు ఇవ్వకపోవడం వెనుక మతలబు ఏమిటో అర్థంకావడంలేదు. టీడీపీ మాటలకు, చేతలకు పొంతనలేదన్న విమర్శ సర్వత్రా వినవస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను దగ్గర చేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ, లోకేష్ పోటీ చేసే నియోజకవర్గంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం విస్మయం కలిగిస్తోందని పరిశీలకులు అంటున్నారు.
– శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ – 9440222914

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు