- పార్లమెంట్ మాట్లాడే దమ్ము పీఎం మోడీకి లేదు..
పార్లమెంట్‌లో మణిపూర్ అల్లర్లపై మోదీ సర్కార్ లక్ష్యంగా విపక్షం విరుచుకుపడుతోంది. సభా కార్యక్రమాలను రద్దు చేసి మణిపూర్ వ్యవహారంపై చర్చ జరపాలని, ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేయడంతో పార్లమెంట్‌లో గందరగోళం కొనసాగుతోంది. ఇక మణిపూర్ అంశంపై విపక్షాలు ప్రభుత్వాన్ని సమర్ధంగా ఎండగడుతున్న తీరుపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ సోనియా గాంధీ ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను ప్రశంసించారు. పార్లమెంట్‌లో తనను కలిసిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విపక్ష కూటమి ఇండియా మణిపూర్ హింసకు వ్యతిరేకంగా పోరాడుతున్న తీరును ప్రశంసిస్తూ మీకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారని సంజయ్ సింగ్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. మణిపూర్ వ్యవహరంపై విపక్షాల నిరసనల నేపధ్యంలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను రాజ్యసభ నుంచి ఈ సమావేశాలు ముగిసేవరకూ సస్పెండ్ చేశారు.
మణిపూర్ హింసాకాండపై ప్రభుత్వ తీరును ఎండగడుతూ భారీ వర్షాల్లోనూ రెండో రోజు నిరసన చేపట్టామని, మణిపూర్ పరిస్ధితిపై దేవుడు సైతం బోరున విలపిస్తున్నాడు…మణిపూర్‌పై ఇప్పుడు ఒకటే ప్రశ్న మెదులుతోంది…పార్లమెంట్‌లో ఈ విషయంపై మోదీజీ ఎప్పుడు మాట్లాడతారు..? అని ఆప్ ఎంపీ సింగ్ అంతకుముందు ట్వీట్ చేశారు.