Tuesday, June 18, 2024

‘దళిత బందు’ను మేసిన రాబందులు..పార్ట్ – 2

తప్పక చదవండి

తుంగతుర్తి నియోజకవర్గం, తిరుమలగిరి ‘దళిత బంధు’ పథకంలో దగా పడ్డ దళిత జనం..
జీఎస్టీ పేరుతో ఒక్కో లబ్ధిదారుడి నుండి రూ. 1,78,200 దోపిడీ చేసి, కోట్లు కొట్టేసిన ఏజెన్సీలు
ఒక్క నకిలీ లైసెన్స్ పేరుతో మూడు ఏజెన్సీలు.. 223 కొటేషన్లు… వెరసి 2 కోట్ల 4 లక్షల 40 వేలు దిగమింగిన వ్యాపారి..
‘దళిత బంధు’ పథకంతో బికారి వ్యాపారులంతా తిరుమలగిరిలో కోటీశ్వరులుగా మారిన వైనం.!
అమాయక బుడిగ జంగాలు, డక్కలి, చిందోళ్ళ రక్తం తాగిన ఏజెన్సీలు..

పెరుమాళ్ళ నర్సింహారావు,
ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక ప్రతినిధి

- Advertisement -

తుంగతుర్తి నియోజకవర్గం, తిరుమలగిరి మండలంలో అమలు జరిగిన ‘దళిత బందు’ పైలెట్ ప్రాజెక్టు పథకంలో అంతులేనంత అవినీతి జరిగిందని చెప్పేందుకు “ఆదాబ్” సమాచార హక్కు చట్టమే అస్త్రంగా, అన్ని ఆధారాలను సేకరించి ప్రజల ముందు ఉంచుతోంది. ఈ క్రింద పేర్కొన్న గణాంక వివరాల్లో (రాబందుల జాబితా -1) లక్ష రూపాయలు అటు ఇటుగా ఉండవచ్చు కానీ, మిగిలినదంతా అక్షర సత్యం. తిరుమలగిరి మండలం ‘దళిత బంధు’ పథకంలో అసలు అవినీతి జరగలేదని, తామంతా సుద్ధపూసలమని జబ్బలు చరుచుకుని విర్రవీగుతున్న కొంతమంది బానిస రాజకీయ నాయకులకు ఈ వార్త చెంపపెట్టు. ఎస్సీ కార్పొరేషన్ మొదలు, రాష్ట్ర కమర్షియల్ టాక్స్ అధికారుల చాంబర్ల చుట్టూ తిరిగి తిరిగి సేకరించిన సమాచారాన్ని “ఆదాబ్” ప్రత్యేక కథనం గా అందిస్తోంది.

ఓ పీడిత ప్రజలారా..! రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీ కోసం కన్న కల కల్లలైంది. వ్యాపారులు మీ వద్ద అధికారికంగా 18 శాతం జీఎస్టీ వసూలు చేసిందంతా వాళ్ల వద్దనే దాగి ఉంది. ప్రభుత్వానికి ఒక్క రూపాయి పన్ను కూడా చెల్లించకుండా, మీ డబ్బుతో అనేకమంది వ్యాపారులు ఇక్కడ కోట్లకు పడగలెత్తారు. వీలైతే మీ సొమ్మును మీరు రికవరీ చేసుకోండి.! లేదా ప్రభుత్వానికి చెల్లించిన 18 శాతం జీఎస్టీ వివరాల ఇన్వాయిస్ లు ఇవ్వమని డిమాండ్ చేయండి.!! సూర్యాపేట జిల్లా ఎస్సీ కార్పొరేషన్ మరియు కమర్షియల్ టాక్స్ అధికారులారా ఇకనైనా కళ్ళు తెరవండి.! ఈ పన్ను ఎగవేత దొంగల భరతం పట్టండి.!! జీఎస్టీ చట్టాన్ని పరిరక్షించండి! ప్రభుత్వ ఖజానాను కాపాడండి!!

ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. తిరుమలగిరి మండల కేంద్రంలో అమలు జరిగిన ‘దళిత బంధు’ పథకంలో స్థానిక మున్సిపాలిటీ, మండల అధికారుల పనితీరును, లంచగొండి దిగజారుడుతనాన్ని పసిగట్టిన కొంత మంది వ్యాపారులు కేవలం ఈ పథకంలోని యూనిట్లకు కొటేషన్లు ఇచ్చి, కోట్లు సంపాదించాలనే ప్రయత్నంలో భాగంగా రాత్రికి రాత్రే జిఎస్టి లైసెన్సులు తెచ్చుకున్నారు. జీఎస్టీ అన్న పదానికి అర్థం తెలియని దద్దమ్మలు సైతం వ్యాపారులుగా అవతారం ఎత్తారు. కొటేషన్ కు, ట్యాక్స్ ఇన్వాయిస్ కు ఎంత తేడా ఉంటుందో తెలియని వాజమ్మలంతా ఇక్కడ వ్యాపారులుగా చలామణిలో ఉన్నారు. దళితుల్లో నిరుపేద ఉపకులాలైన బుడిగే జంగాలు, డక్కలి, చిందోళ్ళ లాంటి అమాయకుల మీద కూడా ఈ సో కాల్డ్ వ్యాపారులు కనీసం కనికరం కూడా చూపలేదు.

ప్రభుత్వ పథకానికి తాము కొటేషన్లు ఇస్తున్నందున సంబంధిత లబ్ధిదారుల నుండి వీరంతా సుమారు 18% జిఎస్టి పేరుతో ఒక్కో లబ్ధిదారుడి నుండి తాము అధికారికంగా కట్ చేసిన రూ. 1,78,200 ప్రభుత్వానికి చెల్లించకుంటే, ప్రభుత్వం క్రిమినల్ కేసులు పెట్టి మరి వడ్డీతో సహా వసూలు చేస్తోందని తెలిసి కూడా, స్థానిక తిరుమలగిరిలో ఉన్న ఏజెన్సీల్లో ఒక్కడు కూడా జిఎస్టి కట్టకుండా పీడత ప్రజల సొమ్మును దోచి, దాచిపెట్టుకుని బంగాళాలు, భూములు, కార్లు కొని దర్జాగా ఖద్దరు అంగీలు వేసుకొని తిరుగుతున్నారు. నిన్న మొన్నటి వరకు బికారి వ్యాపారులుగా తిరిగిన వీరంతా నేడు మండల కేంద్రంలో కోటీశ్వరులుగా మారారు.

స్థానిక తిరుమలగిరి ఎక్స్ రోడ్ నందు ఉన్న ‘సంధ్యా లేడీస్ కార్నర్’ అనే దుకాణం దారుడు గడచిన సంవత్సరం మే 5వ తేదీన కాంపోజిషన్ అనే స్కీం క్రింద జిఎస్టి లైసెన్స్ పొందాడు (లైసెన్స్ నెం.36BEDPM7882L1ZT). ఈ స్కీం నందు లైసెన్సు కలిగిన ఏ వ్యాపారైనా తాను సంవత్సర మొత్తం రిటైల్ చేస్తున్న వ్యాపార మొత్తంపై కేవలం 1% జీఎస్టీ మాత్రమే చెల్లించగలననే నిబంధనతో ఈ లైసెన్స్ పొందుతారు. ఈ రకం కాంపొజిషన్ స్కీమ్ లో లైసెన్స్ పొందిన ఏ వ్యాపార సంస్థ అయినా వ్యాపార కొటేషన్లు కానీ, టాక్స్ ఇన్వాయిస్ లు జారీ చేసే అధికారం లేదని జిఎస్టి చట్టం – 2017, సెక్షన్ 10(5)లో స్పష్టం చేయబడింది. ఈ రకం లైసెన్సులు పొందిన సంస్థలు తాము జారీ చేస్తున్న ప్రతి బిల్లుపై తాము ఎలాంటి జీఎస్టీ పన్నులు వసూలు చేయబోమని, ప్రింట్ రూపంలో స్పష్టం చేయాలని చట్టంలో పేర్కొన్నారు. లేనియెడల ఇలాంటి వారిపై సెక్షన్ 73, 74 ప్రకారం భారీ జరిమానాలు, క్రిమినల్ కేసులు నమోదు చేయవచ్చని చట్టం స్పష్టం చేస్తుంది.

ఇదిలా ఉంటే చట్ట వ్యతిరేకంగా ఈ దుకాణం దారుడు తనకున్న ఈ చెల్లని నకిలీ లైసెన్స్ అడ్డుపెట్టుకొని, అవంతి ట్రేడర్స్, సందీప్ కిరాణం అండ్ జనరల్ స్టోర్, సంధ్య లేడీస్ కార్నర్ అనే ఈ మూడు ఏజెన్సీలకు ఒకే లైసెన్స్ నెంబర్ తగిలించి, ‘దళిత బంధు’ యూనిట్ల కొరకు సుమారు 223 కొటేషన్లు ఇవ్వగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తనకొచ్చిన మొత్తం టర్నోవర్ 11 కోట్ల 35 లక్షల 60 వేలు గా తెలుస్తోంది. కాగా లబ్ధిదారుల నుండి 18 శాతం వసూలు చేసిన జీఎస్టీ సుమారుగా 2 కోట్ల 4 లక్షల 40 వేల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి గాను ఈ సంస్థ యజమాని అయిన సందీప్ చంద్ర మహేశ్వరం 2022 -23 సంవత్సరానికి గాను ప్రభుత్వ కమర్షియల్ ట్యాక్స్ విభాగానికి కేవలం 75 లక్షల టర్నోవర్ చూపించి, 1% కాంపోజిషన్ స్కీమ్ జీఎస్టీ కింద రూ. 75,000/- మాత్రమే చెల్లించి, చేతులు దులుపు కున్నట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి.

ఇదే తిరుమలగిరి లోని 1) ధనలక్ష్మి కిరాణం అండ్ జనరల్ ఏజెన్సీకి చెందిన రుద్రంగి నాగరాజు అనే వ్యాపారికి ఈ పథకం కింద 4 కోట్ల 55 లక్షల 40 వేలు టర్నోవర్ కాగా, 2022 – 23 ఆర్థిక సంవత్సరానికి మొత్తం తన టర్నోవర్ కేవలం 30 లక్షలు మాత్రమేనని కమర్షియల్ టాక్స్ విభాగానికి చూపించారు. 2) ప్రగతి నగర్ లోని పరమేశ్వర ఇంజనీరింగ్ ఆగ్రో ఇండస్ట్రీస్ సంస్థకు చెందిన లెంకల సునీత, నాగయ్య అనే వ్యాపారి 1 కోటి 55 లక్షల 10 వేలు టర్నోవర్ కాగా, కేవలం 62 లక్షల 13 వేలు చూపించారు. 3) మల్లికార్జున ఐరన్ హార్డ్వేర్ అండ్ సిమెంట్ అనే దుకాణం దారుడు మొత్తం టర్నోవర్ 2 కోట్ల 17 లక్షల 80 వేలు కాగా, కేవలం 85 లక్షల 82 వేలు చూపించారు. 4) బాలాజీ కిరాణం అండ్ జనరల్ స్టోర్ టర్నోవర్ ఒక కోటి 95 లక్షల 80 వేలు కాగా, 85 లక్షల 82 వేలు మాత్రమే చూపించారు. 5) సందీప్ కిరాణం అండ్ జనరల్, 6) అవంతి ట్రేడర్స్, 7) సంధ్యా లేడీస్ కార్నర్ కు చెందిన ఏజెన్సీల తంతు తెలిసిందే. 8) శివ స్టీల్ అండ్ ఫర్నిచర్ మొత్తం టర్నోవర్ 3 కోట్ల 96 లక్షలు కాగా, ప్రభుత్వానికి చూపించింది జీరో.. (నిల్). అంటే నయాపైసా టర్నోవర్ లేదు.. నయాపైసా కూడా ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించలేదని అర్థం! 9) కమల్ స్టీల్ అండ్ ఫర్నిచర్ అనే ఏజెన్సీ టర్నోవర్ 3 కోట్ల 96 లక్షలు కాగా, ప్రభుత్వానికి చూపించింది 2 కోట్ల 65 లక్షలు మాత్రమే. 10) జనప్రియ హవాయి అనే చెప్పుల దుకాణం యజమాని అయిన వంగరి రాజు మొత్తం టర్నోవర్ 4 కోట్ల 75 లక్షల 20 వేలు కాగా, ప్రభుత్వానికి చూపింది కేవలం 14 లక్షలు
మాత్రమేనని తెలుస్తోంది.

ప్రభుత్వ కమర్షియల్ టాక్స్ విభాగానికి తమ నిజమైన టర్నోవర్ చూపిస్తే, దానికి తగిన టాక్స్ సదరు విభాగం వారు వసూలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇటు దళితులను దగా చేయడమే కాకుండా అటు ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపించి తప్పించుక తిరుగుతున్నారు. అధికార పార్టీ నాయకులకు, అధికారులకు అడిగినంత ముట్ట జెప్పాం..! కాబట్టి అన్ని వాళ్లే చూసుకుంటారు అనే భ్రమలో ఏజెన్సీలు ఉన్నాయి. ఇక తేల్చాల్సింది సూర్యాపేట జిల్లా ఎస్సీ కార్పొరేషన్, జిల్లా కమర్షియల్ టాక్స్ అధికారులు.. తేల్చుకోవాల్సింది ‘దళిత బంధు’ లబ్ధిదారులు…

“అన్యాయమే చట్టం అయినప్పుడు
ఎదిరించడమే నీ బాధ్యత కావాలి”

  • చేగువేరా ‘దళిత బంధు’ను మేసిన
    మరో ‘రాబందుల’ ముఠా..!
    (పార్ట్ -3)
    త్వరలో.. మీ ఆదాబ్ లో

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు