Wednesday, April 24, 2024

అక్రమాల సామ్రాట్.. ‘ వరిటేక్స్ విరాట్ ‘

తప్పక చదవండి

  • కుంట ఎఫ్.టి.ఎల్. లో బహుళంతస్తుల నిర్మాణం..
  • రెవిన్యూ, నీటి పారుదల అధికారులు కన్నెత్తి చూడని వైనం..
  • జీ.హెచ్.ఎం.సి. టౌన్ ప్లానింగ్ అధికారుల విపరీత ధనదాహం..
  • 6 టవర్లు.. 30 అంతస్తులకు గుడ్డిగా అనుమతులు..
  • ఆదాబ్ కథనానికి తూతూ మంత్రంగా విచారణ..
  • జాడలేకుండా పోయిన రామసముద్రం కుంట..

‘ యద్భావం తత్ భవతి ‘ అన్నట్లుగా.. పెద్దలు నడిచిన బాటలోనే మిగతా అందరూ నడుస్తారు అన్నది సామెత.. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా..? అన్న చందంగా.. అవినీతి బురదలో కూరుకుపోయిన ప్రభుత్వ పెద్దల దారిలోనే కొందరు అధికారులు నడుస్తున్నారు.. వారి సహకారంతో యథేచ్ఛగా, తమ పనులు కానిచ్చేస్తున్నారు ఆక్రమార్కులు.. రక్షించాల్సిన వారే భక్షిస్తున్నారు.. రెవెన్యూ, నీటి పారుదల శాఖ అదికారుల కనుసన్నల్లోనే ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, నాలాలు అక్రమార్కుల చేతిలో చిక్కి అన్యాక్రాంతమవుతున్నాయి.. నీటి పారుదల శాఖ అధికారులు ఎన్.ఓ.సి. జారీ చేసిందే తడువుగా.. టి.ఎస్.బీ పాస్ ద్వారా జీ.హెచ్.ఎం.సి., హెచ్ఎండీఏ, డీటీసీపీ వంటి సంస్థల నుండి సులువుగా నిర్మాణ అనుమతులు పొందుతున్నారు. ఆయా టౌన్ ప్లానింగ్ విభాగాలలో పనిచేసే కొందరు కాసులకు కక్కుర్తి పడి టి.ఎస్. బి.పాస్ ద్వారా అనుమతుల కొరకు ఫైల్ రాగానే నిర్మాణదారులతో బేరసారాలు సాగించి.. క్షేత్ర స్థాయిలో పరిశీలించకుండానే గుడ్డిగా అనుమతులు జారీ చేస్తున్నారు.. దీనితో చెరువులు, కుంటలు, నాలాల ఆనవాళ్లే కరువై ఆయా ప్రాంతాల్లో బహుళ అంతస్థుల భవనాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి.. ఆ కోవకే చెందిన మీయాపూర్, మదీనాగూడ గ్రామంలో రామ సముద్రం కుంట ఎఫ్.టి.ఎల్. లో.. వరిటేక్స్ విరాట్ నిర్మాణ సంస్థ ఆరు టవర్లు, ముప్పై అంతస్థులతో భారీ బహుళ అంతస్థుల నిర్మాణాలను సాగిస్తోంది.

- Advertisement -

హైదరాబాద్, 30 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, మియాపూర్ మదీనాగూడ గ్రామ కేంద్రంగా వెరీటెక్స్ విరాట్ నిర్మాణ సంస్థ ఆక్రమాలకు అడ్డు లేకుండా పోయింది. ఈ నిర్మాణ సంస్థ రామ సముద్రం కుంటకు చెందిన సుమారు రెండెకరాలు ఆక్రమంచి నిర్మాణం సాగిస్తోందని స్థానికులు బహిరంగగానే ఆరోపిస్తున్నారు..జీహెచ్ఎంసి లేక్ నోటిఫైడ్ ప్రకారం కుంటలో 9 ఎకరాల 4 గుంటల విస్తీర్ణంలో రామ సముద్రం కుంట ఉన్నట్లు.. లేక్ మ్యాప్ రికార్డులు సృష్టం చేస్తున్నాయి.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయలో బాగంగా చెరువులు, కుంటలు కనుమరుగవుతున్న నేపద్యంలో వాటిని గుర్తించి, సుందరీకరణతో పాటు, వాకింగ్ ట్రాక్ వంటి కార్యక్రమాలకు కోట్ల రూపాయలను ఖర్చు పెడుతోంది.. ఇంటి దొంగలను ఈశ్వరుడు సైతం పట్టలేడు అనడానికి ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు అన్యాక్రాంతం కావటం నిలువెత్తు నిదర్శనంగా చెప్పవచ్చును.. అక్రమార్కులు విదిల్చే కాసులకు కక్కుర్తిపడి చరిత్ర పుటల్లో ఉన్న చెరువులు, కుంటలు మాయం కావడానికి రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు బహిరంగ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. వెరిటెక్స్ విరాట్ నిర్మాణ సంస్థ అర్ద, రాజకీయ బలంతో రామ సముద్రం కుంటలో సుమారు రెండు ఎకరాలను చెరబట్టడమే కాకుండా.. పక్కనే ఉన్న 210 సర్వే నెంబర్ లో 13 ఎకరాల 09 గుంటల ప్రభుత్వ భూమిలో మరి కొంత భాగాన్ని ఆక్రమించి నిర్మాణాలు సాగిస్తోంది.. ఈ నెల 29 న ఆదాబ్ ప్రచురించిన కథనానికి మొక్కుబడిగా.. రెవెన్యూ, నీటి పారుదల అధికారులు తూతూ మంత్రంగా విచారణ చేపట్టినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపి.. అన్యాక్రాంతం అవుతున్న రామ సముద్రం కుంట, ప్రభుత్వ భూమిని కాపాడి, అక్రమంగా ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని పలువురు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.. వెరి టెక్స్ విరాట్ నిర్మాణ సంస్థ చేస్తున్న అక్రమాలకు సంబంధించి మరిన్ని కథనాలను పూర్తి ఆధారాలతో సహా వెలుగులోకి తెనుంది.. ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘.. ‘ మా అక్షరం అవినీతిపై అస్రం ‘..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు