Thursday, September 12, 2024
spot_img

టిల్లు స్క్వేర్‌.. ఆరంభం అదిరిపోలా ..!

తప్పక చదవండి

సిద్ధు జొన్నలగడ్డ అనే కుర్రాడు ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా ఉన్నాడు. దశాబ్దం కిందట్నుంచే చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చాడు. కానీ అతడి పేరు అందరికీ తెలిసింది ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’తో అయితే.. తన పేరు మార్మోగింది ‘డీజే టిల్లు’తోనే. ఆ సినిమాతో అతను యూత్‌కు మామూలు కిక్‌ ఇవ్వలేదు. కేవలం ఒక ట్రైలర్‌తో ఆ సినిమాకు క్రేజ్‌ తీసుకొచ్చాడు. సినిమాకు యావరేజ్‌ టాకే వచ్చినప్పటికీ.. టిల్లు పాత్రకు యూత్‌ విపరీతంగా కనెక్ట్‌ అయిపోవడంతో ఆ సినిమా ఎవ్వరూ ఊహించనంత పెద్ద హిట్‌ అయింది. సినిమా థియేట్రకల్‌ రన్‌ ముగిశాక టిల్లు పాత్ర రీల్స్‌, షార్ట్స్‌ ద్వారా మరింతగా జనాల్లోకి వెళ్లింది. ఓటీటీలో సినిమా ఇంకా పెద్ద హిట్టయింది. కొన్ని నెలల పాటు టిల్లు క్యారెక్టర్‌ మేనియా కొనసాగింది. ఈ సినిమా తర్వాత సిద్ధు జొన్నలగడ్డకు వేరే ఆఫర్లు వచ్చినా అంగీకరించలేదు. తన ఫోకస్‌ అంతా ‘డీజే టిల్లు’ సీక్వెల్‌ మీదే పెట్టాడు. చాలా టైం తీసుకుని ‘టిల్లు స్క్వేర్‌’ను పట్టాలెక్కించాడు. మామూలుగానే ఈ సినిమాకు మంచి హైప్‌ ఉండగా.. తాజాగా రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ సింగిల్‌ ప్రోమో చూశాక హైప్‌ ఇంకా పెరిగిందనడంలో సందేహం లేదు. ఈ సినిమాకు ఎలాంటి ఆరంభం దక్కాలో అలాంటిదే ఇచ్చింది ప్రోమో. హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ను ఇప్పటిదాకా ప్రేక్షకులు చూస్తూ వచ్చిన కోణం వేరు. ఈ సినిమాతో ఆమెను చూసే కోణం వేరు అన్నట్లుగా ఉంది ప్రోమో చూస్తే. ఆమె ఇంత గ్లామరస్‌గా, ఇంత కవ్వించేలా మరే సినిమాలోనూ నటించలేదంటే అతిశయోక్తి కాదు. ఫస్ట్‌ సింగిల్‌ ప్రోమోలో అలా కనిపించి కుర్రాళ్లకు కిక్కు ఇచ్చింది. ఇక టిల్లు క్యారెక్టర్‌ గురించి చెప్పలేదు. ‘డీజే టిల్లు’ ఫ్లేవర్‌, ఎంటర్టైన్మెంట్‌ను కొనసాగిస్తూ.. సీక్వెల్లోనూ ప్రేక్షకులు కోరుకునే వినోదం ఉంటుందని సంకేతాలిస్తూ సాగింది ఈ పాత్ర. అంత జరిగినా టిల్లుకి బుద్ధి రాలేదంటూ వేరే పాత్రతో చెప్పించడం.. ‘డీజే టిల్లు’లో ఏం జరిగిందో ప్రేక్షకులు రివైండ్‌ చేసుకునేలా చేసింది. మొత్తంగా చిన్న ప్రోమోతో ‘టిల్లు స్క్వేర్‌’ గురించి అందరూ చర్చించుకునేలా చేయడంలో సిద్ధు అండ్‌ కో విజయవంతం అయింది. సీక్వెల్‌కు ఇంతకంటే మంచి ఆరంభం మరొకటి ఉండదు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు