Wednesday, May 22, 2024

నేడు ఆవిష్కృతం కానున్న నూతన పార్లమెంట్‌ భవనం..

తప్పక చదవండి

  • ప్రధాని చేతులమీదుగా అట్టహాసంగా ప్రారంభం కానుంది..
  • విపక్షాల బహిష్కరణ పిలుపులో అర్ధం లేదు : కమలహాసన్‌
  • ఎవరు ప్రారంభిస్తారన్నది సమస్య కాదు : గులాంనబీ ఆజాద్‌
  • రాష్ట్రపతి ముర్ముపై చేసిన వ్యాఖ్యలకు కేజ్రీవాల్‌, ఖర్గేలపై కేసు..

న్యూ ఢిల్లీ, 27 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవం నేడు అట్టహాసంగా జరుగనుంది.. కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా అంగరంగ వైభవంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. వీటిలో భాగంగా లోక్‌సభ సభాపతి ఆసనం వద్ద రాజదండాన్ని ప్రతిష్ఠిస్తారు. కాంగ్రెస్‌ సహా దాదాపు 20 ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరి స్తుండగా, తెదేప, వైకాపా, ఎస్‌ఏడీ, బీజేడీ వంటి ఎన్డీయేయేతర పార్టీలు హాజరవుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని బహిష్కరించడం తగదని నటుడు కమలహాసన్‌ విపక్షాలను కోరారు. ఇది జాతీయ ఆనందానికి ప్రతీకగా గుర్తించాలన్నారు. తక్కువ సమయంలో పార్లమెంటు భవనాన్ని సిద్ధం చేయడం తేలికైన విషయం కాదని మాజీమంత్రి గులాం నబీ ఆజాద్‌ అన్నారు. ఈ నూతన భవనాన్ని ప్రధాన మంత్రి ప్రారంభించారా? రాష్ట్రపతి ప్రారంభించారా? అనేది ముఖ్యమైన విషయం కాదన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును బీజేపీ ఎన్నుకోలేదని కాదని, ప్రతిపక్షాలు ద్రౌపది ముర్ముకు అంత అనుకూలం అయితే, ఆమెకు వ్యతిరేకంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎందుకు పోటీ పెట్టారని ప్రశ్నించారు. ఇకపోతే ఈ వివాదంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర నేతలపై ఫిర్యాదు నమోదైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కులాన్ని ప్రస్తావిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న కారణంగా వీరిపై ఈ ఫిర్యాదు నమోదైంది. వీరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వివిధ కమ్యూనిటీల మధ్య శత్రుత్వాన్ని పెంపెందించేందుకు, భారత ప్రభుత్వంపై అపనమ్మకాన్ని సృష్టించేందుకు ప్రయత్నించారని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. దీంతో ఐపీసీ సెక్షన్‌ 121,153ం,505,34 కింద వీరిపై ఫిర్యాదు నమోదైంది. కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించకపోవడంపై బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ, ఇతర విపక్షాలు లక్ష్యంగా చేసుకున్నాయి. కాంగ్రెస్‌, ఆప్‌, తృణమూల్‌ సహా 20కి పైగా పార్టీలు తాము కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవంలో పాల్గొనడం లేదని ప్రకటించాయి. ఈ మేరకు సంయుక్త ప్రకటన కూడా విడుదల చేశాయి. మరోవైపు నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాలను బహిష్కరించాలని నిర్ణయించిన ప్రతిపక్షాలకు ప్రముఖ నటుడు, మక్కల్‌ నీధి మయ్యమ్‌ పార్టీ చీఫ్‌ కమల్‌ హాసన్‌ ఓ సలహా ఇచ్చారు. రాజకీయ విభేదాలకు ఓ రోజు విరామం ప్రకటించాలని, ఈ కార్యక్రమాలను బహిష్కరించాలనే నిర్ణయాన్ని పునఃపరిశీలించి, జాతీయ ఐకమత్య సంబరంగా దీనిని మార్చాలని కోరారు. అదే సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఓ ప్రశ్నను సంధించారు. నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాలకు రాష్ట్రపతి ఎందుకు హాజరు కాకూడదో చెప్పాలని నిలదీశారు. అలాగే నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడం దేశానికి గర్వకారణమని తెలిపారు. అయితే ఇది రాజకీయంగా విభజనకు దారితీసిందని పేర్కొన్నారు. నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ఎందుకు హాజరుకాకూడదో దేశానికి చెప్పాలని డిమాండ్‌ చేశారు. దేశానికి అధిపతి అయిన రాష్ట్రపతి ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో భాగస్వామి కాకపోవడానికి ఎటువంటి కారణం తనకు కనిపించడం లేదన్నారు. ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన ప్రతిపక్ష పార్టీలకు కూడా కమల్‌ హాసన్‌ హితవు పలికారు. రాజకీయ విభేదాలకు ఓ రోజు విరామం ఇవ్వవచ్చునన్నారు. ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని తీసుకున్న నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కోరారు. దేశ ఐకమత్యాన్ని చాటే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మార్చాలని కోరారు. భారత దేశ నూతన గృహంలో కుటుంబ సభ్యులంతా నివసించాలన్నారు. భాగస్వామ్య ప్రజాస్వామ్యాన్ని తాను నమ్ముతానని తెలిపారు. అందుకే ఈ కార్యక్రమాన్ని బహిష్కరించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతున్నానని చెప్పారు. ఈ కార్యక్రమం పట్ల ఏమైనా అభ్యంతరాలు ఉంటే బహిరంగ వేదికలపై కానీ, నూతన పార్లమెంటులో కానీ లేవనెత్తవచ్చునని తెలిపారు. మనల్ని విభజించేవాటి కన్నా కలిపి ఉంచేవి ఎక్కువగా ఉన్నాయని గుర్తుంచుకోవాలని కోరారు. యావత్తు దేశం ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తోందన్నారు. ప్రపంచం దృష్టి మనపై ఉందన్నారు. నూతన పార్లమెంటు భవనాన్ని మే 28న ప్రారంభించడం యావత్తు దేశానికి సంబరాలు చేసుకునే సందర్భమని తెలిపారు. ఈ చరిత్రాత్మక విజయానికి భారత ప్రభుత్వాన్ని అభినందించారు. దేశ ప్రయోజనాల కోసం తాను అందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని సంబరంగా జరుపుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇది తనకు అత్యంత గర్వకారణమైన విషయమని తెలిపారు. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడం పట్ల, ఈ కార్యక్రమంలో ప్రతిపక్షాలను భాగస్వాములను చేయకపోవడం పట్ల తన అసమ్మతిని కొనసాగిస్తానని చెప్పారు. పార్లమెంటు ఆమోదించిన బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపితేనే చట్టాలుగా మారుతాయన్నారు. పార్లమెంటు ఉభయ సభలను సమావేశపరచడానికి, వాయిదా వేయడానికి రాష్ట్రపతికే అధికారం ఉందన్నారు. పార్లమెంటు కార్యకలాపాల్లో రాష్ట్రపతి అంతర్భాగమని తెలిపారు. రాజీ ధోరణిని ప్రదర్శిస్తూ, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని మోదీని కోరారు. నూతన పార్లమెంటు అనేది కేవలం ఓ సాధారణ భవనం కాదని, చిరకాలం భారత దేశ ప్రజాస్వామ్య నిలయమని తెలిపారు. ఈ ఏమరుపాటు చరిత్రలో తీవ్ర తప్పిదంగా నమోదవుతుందని, దీనిని సరిదిద్దుకోవాలని మోదీని కోరారు. దీనిని సరిదిద్దుకుంటే రాజకీయ నాయకత్వంలో ఓ గొప్ప మైలురాయిగా నిలుస్తుందన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు