Monday, May 6, 2024

మహోగ్ర రూపం దాల్చిన యమునమ్మ..

తప్పక చదవండి
  • ప్రమాద స్థాయిని దాటేసిన యమునా నది..
  • 205.75 మీటర్లకు చేరుకున్న నీటిమట్టం..
  • ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు..
  • హత్నికుండ్ బ్యారేజీ నుంచి 2 లక్షల క్యూసెక్కులకు పైగా నీటీ విడుదల
  • ముప్పు ముంగిట్లో ఢిల్లీతో సహా పలు ప్రాంతాలు..
    న్యూ ఢిల్లీ : యమునా నది మరోమారు డేంజర్ మార్కును దాటేసింది. ఢిల్లీలోని పాత రైల్వే వంతెన వద్ద 206.26 మీటర్ల స్థాయికి చేరుకుంది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాల కారణంగా హత్నికుండ్ బ్యారేజీ నుంచి యమునా నదికి నీటి విడుదల పెరగడం నది నీటి మట్టం పెరగడానికి కారణం. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నదిలో 206.26 మీటర్ల మేర ప్రవహిస్తోంది సాయంత్రానికి మరింత పెరిగింది.. హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి 2 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేయడంతో యమునా నది నీటిమట్టం పెరుగుతుండడంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. శనివారం రాత్రి 10 గంటలకు 205.02 మీటర్లుగా ఉన్న నీటిమట్టం ఆదివారం ఉదయం 9 గంటలకు 205.96 మీటర్లకు పెరిగిందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) గణాంకాలు చెబుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల సమయానికి 206.26 మీటర్లకు చేరుకుంది. హత్నికుండ్ బ్యారేజీ నుంచి నదిలోకి 2 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, నీటి మట్టం 206.7 మీటర్లకు పెరిగితే యమునా ఖాదర్ (వరద మైదానాలు)లోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని రెవెన్యూ మంత్రి అతిషి తెలిపారు. మరోవైపు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. హిందాన్ నది నీటి మట్టం పెరగడంతో ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో పలు ఇళ్లు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు గత వారం రోజులుగా ఇంకా నీటి ముంపులోనే ఉన్నాయి. ఈ నెల 13న 208.66 మీటర్లకు చేరుకున్న యమునా నది నీటిమట్టం 1978 సెప్టెంబరులో నమోదైన 207.49 మీటర్ల రికార్డును తుడిచిపెట్టేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో 27 వేల మందికిపైగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు