మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ పెళ్లిపై గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. హీరోయిన్ లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ టాలీవుడ్, సోషల్ మీడియా, పలు వెబ్‌సైట్లలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై అటు వరుణ్ కానీ, లావణ్య గానీ ఇప్పటి వరకూ స్పందించలేదు. తాజా సమాచారం ప్రకారం.. మెగా ప్రిన్స్ వరుణ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. జూన్ 9వ తేదీన హీరోయిన్ లావణ్యతో వరుణ్ ఎంగేజ్మెంట్ జరగనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇండియా టుడే తన కథనంలో వెల్లడించింది. ఈ విషయాన్ని మెగా కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వ్యక్తులు వెల్లడించినట్లు పేర్కొంది. హైదరాబాద్‌లోని నివాసంలో లేదా ఓ ఫంక్షన్ హాలులో వీరి నిశ్చితార్థ వేడుక జరగనున్నట్లు తెలిపింది. ఈ ఏడాదిలోనే వీరి వివాహం కూడా ఉంటుందని పేర్కొంది.
ఈ వేడుకకు చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, ఉపాసన, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్, సుష్మిత, శ్రీజ సహా కొణిదెల కుటుంబం అంతా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ కుటుంబం కూడా ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.
ప్రస్తుతం వరుణ్ తేజ్ హాలిడే ట్రిప్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటలీలోని రోమ్‌లో ఉన్నట్లు కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. లావణ్య కూడా ట్రావెలింగ్ చేస్తున్నట్లు పోస్టు చేసింది. దీంతో ప్రస్తుతం ఈ జంట హాలిడే డ్రిప్‌లో ఉన్నారని నెటిజన్లు భావిస్తున్నారు. ట్రిప్ నుంచి తిరిగొచ్చిన తర్వాత తమ ఎంగేజ్మెంట్ గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వరుణ్ పెళ్లిపై ఆయన తండ్రి, మెగా బ్రదర్ నాగబాబు ఓ హింట్ ఇచ్చాడు. తొందరలోనే వరుణ్ తేజ్ పెళ్లి ఉంటుందని స్పష్టం చేశాడు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నట్టు వస్తున్న వార్తలపై అడగ్గా.. ఇప్పుడే తానేమీ చెప్పలేనని బదులిచ్చాడు. అయితే తొందరలోనే వరుణ్ తేజ్ పెళ్లి ఉంటుందని స్పష్టం చేశాడు. పెళ్లి విషయాన్ని వరుణ్ తేజ్‌నే ప్రకటిస్తాడని తెలిపారు. అమ్మాయి ఎవరనేది కూడా అతనే చెబుతాడని స్పష్టం చేశాడు. పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ వేరే ఇంట్లో ఉంటాడని.. మేం వేరే ఉంటామని నాగబాబు చెప్పాడు. తన బిడ్డలకు ప్రైవసీ ఇవ్వడం అలవాటు అని.. అందుకే పెళ్లి తర్వాత వేర్వేరు ఇళ్లలో ఉంటామని తెలిపాడు. వేర్వేరు ఇళ్లలో ఉన్నప్పటికీ తమ మధ్య బాండింగ్ మాత్రం ఎప్పుడూ బలంగానే ఉంటుందని స్పష్టం చేశాడు.