ఇవాళ్టితో ఐపీఎల్ సీజన్ 16 ముగియనుంది. ఆఖరి మ్యాచ్‌లో హర్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ జట్టు, మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడనున్నాయి. గత సీజన్ టైటిల్ ఎగరేసుకుపోయిన గుజరాత్ టైటాన్సే మళ్లి గెలుస్తుందా.. లేదంటే చెన్నై సూపర్ కింగ్స్ ఐదో ఐపీఎల్ టైటిల్ నెగ్గి ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేస్తుందా..? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లలో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ ఎవరనే అంశం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఆ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ బ్యాటర్ సురేశ్ రైనా పేరిట ఉన్నట్లు తేలింది. ఐపీఎల్ ఫైనల్స్‌లో మొత్తం 8 ఇన్నింగ్స్ ఆడిన సురేశ్ రైనా 249 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత 4 ఇన్నింగ్స్‌లో 236 పరుగులతో షేన్ వాట్సన్, 6 ఇన్నింగ్స్‌లో 183 పరుగులతో రోహిత్ శర్మ, 4 ఇన్నింగ్స్‌లో 181 పరుగులతో మురళీ విజయ్, 8 ఇన్నింగ్స్‌లో 180 పరుగులతో మహేంద్రసింగ్ ధోని వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.