- తెలంగాణ ఐఏఎస్ అధికారిపై భార్య సంచలన ఫిర్యాదు..
- ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న కోర్టు
- అదనపు కట్నం కోసం హింసిస్తున్నారని ఫిర్యాదు
- తెలంగాణ ఐటీ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న సందీప్‌కుమార్ ఝా
హైదరాబాద్ ; ఐఏఎస్ అధికారి అయిన భర్తపై ఆయన భార్య సంచలన ఆరోపణలు చేశారు. కట్నం కోసం వేధించడంతోపాటు అసహజ శృంగారానికి బలవంతం చేస్తున్నారంటూ కోర్టుకెక్కారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ ఐటీ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న సందీప్ కుమార్ ఝూపై గృహహింస, వరకట్న వేధింపుల ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెళ్లైన తర్వాత అధిక కట్నం తీసుకురావాలని తనను వేధింపులకు గురి చేశాడంటూ సందీప్ కుమార్ ఝూపై ఆయన భార్య కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులకు కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
సందీప్ కుమార్ ఝూ స్వస్థలం బీహార్‌లోని దర్భంగా జిల్లాలో ఉండగా.. ఆయన తెలంగాణ క్యాడర్‌కు చెందిన 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా ఉన్నారు. 2021లో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కోర్బా ప్రాంతానికి చెందిన ఓ యువతితో ఆయన పెళ్లి జరిగింది. యువతి కుటుంబసభ్యులు భారీగా కట్నకానుకలు అప్పగించారు. నగదుతో పాటు భారీగా బంగారు నగలు కట్నంగా ఇచ్చారు. కానీ పెళ్లైన తర్వాత కూడా అదనపు కట్నం కోసం తనను సందీప్ కుమార్ వేధించినట్లు భార్య ఆరోపిస్తోంది.
అలాగే అసహజ శృంగారానికి సహకరించాల్సిందిగా బలవంతం పెట్టేవాడని భార్య చెబుతోంది. సందీప్ కుమార్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా గతంలో కోర్బా ఎస్సీకి భార్య ఫిర్యాదు చేసింది. ఆయనపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరింది. కానీ పోలీసులు పట్టించుకోకపోవడంతో ఇటీవల కోర్బా కోర్టును భార్య ఆశ్రయించింది. సందీప్ కుమార్‌పై పోలీసులు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్బా కోర్టు.. తాజాగా కీలక తీర్పు ఇచ్చింది. ఐఏఎస్ ఆఫీసర్ సందీప్ కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని పోలీసులను ఆదేశించింది. పెళ్లి సమయంలో రూ.కోటి వరకు ఇచ్చామని, ఆ తర్వాత కూడా ఎక్కువ కట్నం తీసుకురావాలని తనను వేధించినట్లు భార్య ఆరోపిస్తోంది. పెళ్లికి ముందు కూడా కట్నం కోసం వేధించినట్లు ఆమె చెబుతున్నారు. కోర్టు ఆదేశాలపై సందీప్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె చేసిన ఆరోపణలు నిజమేనా? లేదా? అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నారు. ఒకవేళ నిజమని తేలితో ఆయనపై చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. ఒకవేళ పోలీసులు కేసు నమోదు చేస్తే సందీప్ కుమార్ సమస్యలను ఎదుర్కొనే అవకాశముంది. మరి పోలీసులు కేసు నమోదు చేస్తారా? లేదా? అనేది చూడాలి.