Thursday, May 23, 2024

ప్రకృతి ప్రేమికుడు … పర్యావరణ అంబాసిడర్ .!

తప్పక చదవండి

తెలంగాణ రాష్ట్రాన్ని హరితనిలయంగా పచ్చటి పూదోటగా మార్చేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. పర్యావరణ విధ్వంసంలో భాగంగా అడవుల నరికివేత భారీ ఎత్తున జరిగింది. దీంతో పచ్చదనం కనుచూపుమేరలో కనబడకుండా పోయింది. ‘హరితహారం’ పేరిట ఏటా కోట్లాది మొక్కలు నాటే మహోద్యమానికి ఒడిగట్టారు. అదే సమయంలో యువ ఎంపీ, జోగినపల్లి సంతోష్ కుమార్ “గ్రీన్ ఇండియా చాలెంజ్” వినూత్న ఆలోచనతో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. పర్యావరణ హితం కోసం ఆయన చేపట్టిన ఈ కార్యక్రమం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్న స్ఫూర్తిని రగిలించింది. సామాజిక మాధ్యమంలో అంతకు ముందు చాలా చాలేంజ్ లు వచ్చాయి. అయితే అవేవీ సమాజానికి, సహాజహితానికి, సమాజ శ్రేయస్సుకూ పెద్దగా దోహద పడినవికావు. కేసీఆర్ తలపెట్టిన హరితహారం స్ఫూర్తిని ఎంపీ సంతోష్, అన్ని వర్గాల వారిలోనూ హరిత బావజాల వ్యాప్తి రగల్చడానికి నేను మొక్కలు నాటి మీకు సవాల్ విసురుతున్నాను, స్వీకరించి మీరు మరొకరికి సవాల్ విసురండి అన్న పిలుపుతో… హరితహారానికే ఓ కొత్త ఊపు, అంతకుముందు ఏన్నడులేని ఓ జోష్ ను తీసుకువచ్చారు. పర్యావరణ సమతుల్యతను సాధించి, సతతం తెలంగాణ హరితం… సేదను తీరే ‘సంతోష’ నిలయంగా మార్చేందుకు కృషి చేసినారు. పుట్టిన రోజులకు స్వీట్లు పంచే బదులు మొక్కలు పంచె సంప్రదాయం హరిత ప్రేమికుని వల్లే సాధ్యం అయ్యింది. దివ్యజ్ఞానంతో రూపోందించిన ‘వృక్షవేదం’ ఛాయలు భారతీయుల హృదయాలను కదిలించిందని, ప్రధాని నరేంద్ర మోడీ ఎంపీ సంతోష్ ను హరిత సంతోష్ గా ప్రశంసలతో ముంచెత్తినారు.

సమాజాన్ని తీర్చిదిద్దడంలో ప్రకృతి, పర్యావరణం నిత్యం మమేకమవుతున్నది.మానవ మనుగడ కోసం పెనవేసుకుంటున్నది. కాలక్రమేణా కొంత మంది స్వార్థపరుల వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. స్వార్థ మానవాళి చేస్తున్న వికృత చేష్టలు ప్రకృతికి చేటు కలిగిస్తున్నాయి. స్మగ్లర్ల దెబ్బకు కీకరారణ్యాలు సైతం కాంక్రీట్ జంగిల్స్ మారుతున్న పరిస్థితి దాపరించింది. దాని వల్ల సహజవనరులు జీవరాశులు అంతరించి పోయినాయి. ప్రకృతికి ప్రణమిల్లుతూ సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. మానవ శ్రేయస్సు మరియు అడవుల దీర్ఘకాలిక పరిరక్షణ, అవి కొనసాగించే పర్యావరణ వ్యవస్థలు మరియు ఈ కీలకమైన సహజ వ్యవస్థలతో మరింత స్థిరమైన సంబంధాన్ని నెలకొల్పడానికి దోహదపడే సాంప్రదాయ పద్ధతులు, జ్ఞానం యొక్క విలువను ప్రోత్సహిస్తాయి. ఒకప్పుడు పక్షుల కిలాకిలారాగాలు.. జంతువుల అరుపులతో అడవులు కళకళలాడాయి. ఇప్పుడు అరుదైన వృక్ష, జంతు, పక్షి జాతులు కనుమరుగవుతున్నాయి. అందుకే తెలంగాణ ప్రభుత్వం వాటి రక్షణ కోసం నడుం బిగించింది. మన పర్యావరణం కాపాడుకోవాల్సిన భాద్యత మనకుందని ‘వనజీవి రామయ్య’ లా జ్ఞాన బోధ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి వృక్షార్చన చేసి, స్వాభిమానంతో పాటు మొక్కలపై ఉన్న తన అభిమానం చాటి చరిత్ర సృష్టించారు. పల్లెలు ,పట్టణాలు ఇప్పటికే హరితశోభితను సంతరించుకుంది.

- Advertisement -

దేశంలో పచ్చదనంలో తెలంగాణ ఒక ప్రత్యేకతను చాటు కోవాలన్న దృఢ సంకల్పంతో గ్రామస్థాయి వార్డుమెంబర్ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు సామాజిక బాధ్యతగా అడవులు రక్షించుకోనట్లైతే కాలుష్యం వల్ల, పీల్చే గాలి పాడై ఆక్సిజన్ కూడా ఖరీదు చేసే పరిస్థితి దాపరిస్తుందని, పీల్చే గాలికోసం మంచి నివాస యోగ్యం కల్పించడంలో అందరం బాగస్వాములు కావాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలా సాగుతున్న హరితహారంలో ఎనిమిది విడతలుగా 268.66 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. 2023-24 తొమ్మిదో విడత హరితహారంలో 26 శాఖల భాగస్వామ్యంతో 20.02 కోట్ల మొక్కలు వర్షాలు పడేనాటికి స్థానిక నర్సరీలు సిద్ధం చేసుకున్నారు. కేసీఆర్ మానస పుత్రిక ‘హరితహారం’ లో పెద్ద ఎత్తున ‘హెచ్ఎండీఏ’ పరిధిలో ఏడున్నర కోట్ల మొక్కలు నాటాలని తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. నాడు అశోక చక్రవర్తిని మరిపించే విదంగా మొత్తం పచ్చ దనంతో, దట్టమైన అడవి సంపదను మనమే నిర్మంచుకోవాలన్న కేసీఆర్ తీసుకున్న సాహసోపితమైన నిర్ణయం 24శాతం నుంచి 28 శాతం వరకు అడవులు పెరగడానికి కారణం అయింది. పల్లె ప్రగతిలో ప్రతి తల్లి చంటి బిడ్డను కాపాడినట్లే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి, వాటిని సంరక్షించడం వల్ల గ్రామాల్లో 80 శాతం బతికి, అరణ్యాలుగా మారి ప్రకృతి పరవశించిపోయి పచ్చని చెట్లతో, నెల పచ్చని తోరణాలను కప్పుకున్నట్లుగా కనువిందు చేస్తున్నాయి. హరితహారం మొదటి విడుతలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి చిట్టడవిగా మారి పక్షులు, కీటకాలు చేసే హమ్మింగ్ శబ్దాలతో, అందమైన ప్రకృతిని పర్యాటకులకు ఏంతో అద్భుతమైన అనుభూతినిస్తున్నాయి.

పుడమితల్లి నిత్యం పచ్చదనంతో పరిఢవిల్లే విధంగా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను ఆకుపచ్చ హబ్ (గ్రీన్ హబ్) గా మార్చే మహాయజ్ణంలో పర్యావరణ స్నేహితుడు ఎంపీ, జోగినపల్లి సంతోష్ కుమార్ …చంద్రుడికో నూలుపోగులాగా అయన వెన్నంటి ఉంటూ వేల ఎకరాలను దత్తత తీసుకోని అభయారణ్యాలుగా తీర్చిదిద్దడం తనకు వ్యసనంగా మారింది. ప్రకృతి పరిరక్షణ కోసం బంట్రోతు నుండి చీఫ్ సెక్రెటరీ వరకు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రజాప్రతినిధులు యజ్ఞంలో పాల్గొని విరివిగా మొక్కలు నాటి పుడమి తల్లికి పచ్చలహారం వేసేందుకు దేశ,విదేశాల్లో మంచి ఊపు వచ్చింది. హరిత ప్రేమికుడు ఎంపీ, సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ గ్లోబల్ వార్మింగ్ తగ్గించడంలో కీలకపాత్ర పోషించింది.పర్యావరణ ప్రేమికులు భాగస్వామ్యులు కావడానికి జనం తహ, తహలాడుతున్నారు. పచ్చని పర్యావరణం కోసం అలుపెరుగని కృషి చేస్తూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు సినీ,రాజకీయ, క్రీడ, వ్యాపార రంగాల్లోని ప్రముఖులంతా పాల్గొనేలా దేశవ్యాప్తంగా పచ్చదనం పెంపుపై అవగాహన కల్పిస్తున్న పర్యావరణ ప్రేమికుడు ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ సృష్టికర్తను గ్రీన్ రిబ్బన్ చాంపియన్ గా గుర్తిస్తూ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ నెట్ వర్క్-18 గ్రూప్ అవార్డును అందజేసింది. మదర్ ఆఫ్ ట్రీస్ సాలు మారడ తిమ్మక్క స్పూర్తితో తెలంగాణ పర్యావరణం అంబాసిడర్ గా లేత ఆకుపచ్చ కండువాతో రాష్ట్రం నలుచెరుగుల పచ్చదనముతో కళ కళాలాడేందుకు శ్రమిస్తున్న వనజీవి జోగినపల్లి తెలంగాణకు ఆక్సీజన్. ప్రకృతిని కాపాడే ఈ క్రతువులో అందరమూ భాగం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

(దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 18వ రోజు ‘హరితహారం’ )

డా.సంగని మల్లేశ్వర్
విభాగాధిపతి, జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వవిద్యాయం, వరంగల్,
సెల్-9866255355.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు