Friday, May 17, 2024

అమ్మ పదానికి అపవాదు..

తప్పక చదవండి

( బీ.ఎస్.డీ. డీఎవీ పబ్లిక్ స్కూల్ వ్యవహారంపై విజ్ఞత కోల్పోయిన మహిళా మణులు..)

  • గుర్తింపు రద్దుచేసి పాఠశాల ఎలా నడుస్తోంది..
  • విద్యాశాఖ ఆదేశాలు కూడా పట్టించుకోరా..?
  • 2023-24 విద్యా సంవత్సరంలో తిరిగి
    కొనసాగుతున్న బీ.ఎస్.డీ. డీఎవీ పబ్లిక్ స్కూల్..
  • పాఠశాల తిరిగి ప్రారంభమైనా అధికారులు ఏమి చేస్తున్నారు..?
  • దోషి అయిన డ్రైవర్ పై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన తీర్పును
    గౌరవించే సాంప్రదాయం లేదా..?
  • జరిగిన సంఘటనతో భయంతో బిక్కచచ్చిపోయిన తల్లిదండ్రులు
    ఇప్పుడు ఇదే స్కూల్లో తమ పిల్లలను ఎలా చదివించగలరు..?
  • మంచి మనసున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే
    స్పందించాలని వెల్లువెత్తుతున్న విజ్ఞప్తులు..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ బీ.ఎస్.డీ. డీఎవీ పబ్లిక్ స్కూల్ వ్యవహారం అందరికీ తెలిసిందే.. ముక్కుపచ్చలారని ఒక పసిబిడ్డని అత్యంత కిరాతకంగా హింసించి, సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన స్కూల్ వెహికల్ డ్రైవర్ అకృత్యానికి స్పందించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు అతనిని విచారించి తప్పు చేసినట్లు నిర్ధారించి శిక్షను ఖరారు చేసింది.. అదే విధంగా కోర్టు తీర్పుననుసరించి తల్లి, దండ్రులకు ధైర్యం కలిగించే విధంగా సదరు స్కూలు గుర్తింపు రద్దు చేస్తూ.. అక్కడ చదివే పిల్లలకు వేరే స్కూల్ అలాట్ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది.. అప్పటి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన చొరవచూపి ప్రభుత్వపరంగా ఆ ఆదేశాలను సదరు స్కూల్ యాజమాన్యానికి జారీ చేయడం కూడా జరిగింది.. ఈ ఆ,అమానుష కాండ జరగడం వెనుక స్కూల్ ప్రిన్సిపాల్ నిర్లక్ష్యవైఖరి కూడా కారణభూతం అయ్యిందని తేలింది.. ఇంతవరకూ బాగానే ఉంది.. అభంశుభం తెలియని పసికందును చిదిమేసి, రక్తస్రావం వచ్చేంత దుర్మార్గానికి ఒడిగట్టిన డ్రైవర్ ని ఎన్ కౌంటర్ చేయాలనే డిమాండ్స్ కూడా అప్పట్లో వెల్లువెత్తాయి.. ప్రజాగ్రహాన్ని స్వయంగా గ్రహించిన ముఖ్యమంత్రి దీనికి పరిష్కారం చూపించాలనే సదుద్దేశ్యంతో.. మరోమారు వేరెవరూ ఇలాంటి చర్యలకు పాలుపడకూడని ఫాస్ట్ ట్రాక్ కోర్టుద్వారా విచారణ జరిపించి, నిందితుడికి శిక్ష పడేలా చేయగలిగారు.. ఈ క్రమంలోనే సదరు బీ.ఎస్.డీ. డీఎవీ పబ్లిక్ స్కూల్ గుర్తింపును రద్దుచేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.. కానీ ఇప్పుడు జరుగుతున్నదేంటి..?

- Advertisement -

డీఏవి పబ్లిక్ స్కూల్, బంజారాహిల్స్ రోడ్ 14, పాఠశాల యజమాన్యం, ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్ల ఓ దుర్మార్గుడైన డ్రైవర్ చేసిన అరాచకంపై, జరిగిన సంఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. కాగా తప్పిదం చేసిన నీచునికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు కఠినంగా శిక్షించే విధంగా తీర్పును ఇవ్వడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి.. అప్పట్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ వెంటనే స్పందించి.. సదరు పాఠశాలలో నర్సరీ నుంచి ఐదవ తరగతి వరకు గుర్తింపును రద్దు చేయడం జరిగింది. 2022-23 విద్యా సంవత్సరానికి విద్యార్థుల తల్లి, దండ్రులకు ఇబ్బంది కలగకుండా తీసుకున్న ఈ నిర్ణయం సమంజసమే… కానీ 2023- 2024 విద్యా సంవత్సరానికి యధావిధిగా బీ.ఎస్.డీ. డీఎవీ పబ్లిక్ స్కూల్ కొనసాగడం ఆందోళన కలిగిస్తున్న విషయం.. ఇది అత్యంత శోచనీయం. గతంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గుర్తింపును రద్దు చేసిన అధికారులు.. తిరిగి బీ.ఎస్.డీ. డీఎవీ పబ్లిక్ స్కూల్ కొనసాగించడానికి జరుగుతున్న ప్రక్రియ ( ఆర్.సి. నెంబర్ : ఎస్.పీ.ఎల్. / ఏ 7/ హైదరాబాద్ / 2022.. తేదీ : 14 మార్చి 2023 ) అత్యంత బాధాకరం. ఓ ప్రక్క న్యాయస్థానం పాఠశాలలో జరిగిన సంఘటన వాస్తవమే, ఆ దుర్మార్గునికి దోషిగా ప్రకటిస్తూ శిక్షను ఖరారు చేస్తే.. అదే పాఠశాలలో యధావిధిగా కొనసాగించే విధంగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆలోచించడం ఎంతవరకు న్యాయం? హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి.. ఇదే విషయమై పాఠశాల కమిషనర్ దేవసేన ఆదేశాల ప్రకారమే బీ.ఎస్.డీ. డీఎవీ పబ్లిక్ స్కూల్ 2023-24 విద్యా సంవత్సరానికి గాను స్కూల్ యాజమాన్యం స్కూల్ నడిపే ప్రక్రియ జరుపుతున్నందున.. ఈ వ్యవహారాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించి నివేదికను కమిషనర్ కి పంపించడం జరిగిందని చెప్పడం శోచనీయం.. ఈ విషయంపై విద్యాశాఖ కమిషనర్ వెంటనే స్పందించి తమ వివరణ తెలపాలని ఆదాబ్ హైదరాబాద్ కోరగా ఆమె స్పందించకపోవడం గమనార్హం..

ఒక మాయని మచ్చని మూటగట్టుకున్న బీ.ఎస్.డీ. డీఎవీ పబ్లిక్ స్కూల్.. నిబంధనలకు విరుద్ధంగా 2023-24 సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగిస్తూ.. అటు ప్రభుత్వాన్ని, ఇటు న్యాయస్థానాన్ని కూడా పట్టించుకోకుండా పాఠశాల నడపడం ఎంతవరకు సమంజసం.. దీనికి తోడు మాతృమూర్తి స్థానంలో వున్న విద్యాశాఖ కమిషనర్ దేవసేన నిస్సిగ్గుగా వత్తాసు పలకడం అత్యంత హేయమైన చర్య.. ఒక మహిళ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తుండటం.. మరో మహిళ కమిషనర్ గా ఉండటం.. హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి కూడా ఒక మహిళా కావడం, రీజనల్ జాయింట్ డైరెక్టర్ కూడా మహిళా కావడం.. అయినా సరే ఒక చిన్నారి బాలికకు తీరని అన్యాయం జరిగితే.. వారి మనసు కరుగపోవడం దుర్మార్గం కాక మరేమవుతుంది..? పైగా స్వయానా మంత్రి పిల్లల తల్లి దండ్రులకు ధైర్యం చెబుతూ చేసిన వాగ్దానాలు ఏమయ్యాయి.. ఈ రోజు ఎలాంటి భయం లేకుండా, నిస్సిగ్గుగా బీ.ఎస్.డీ. డీఎవీ పబ్లిక్ స్కూల్ వారు తమ స్కూల్ వ్యవహారాలను పబ్లిక్ గా నడుపుతుంటే.. వీరంతా ఏమి చేస్తున్నారు..? డబ్బులకు అమ్ముడుపోవడమే వీరి నీతా..? అని మేధావులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.. ఏ ఒక్క మహిళకు అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోమని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో ఇలాంటి సంఘటనలు జరగడం దేనికి సంకేతం..? కనీసం ముఖ్యమంత్రి ఈ బీ.ఎస్.డీ. డీఎవీ పబ్లిక్ స్కూల్ వ్యవహారంపై దృష్టిపెట్టి, ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చిన ప్రకారం బీ.ఎస్.డీ. డీఎవీ పబ్లిక్ స్కూల్ గుర్తింపును రద్దును కొనసాగించాలని.. రాష్ట్రంలోని పసిబిడ్డల తల్లి దండ్రులకు ధైర్యం కలిగించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు