Wednesday, October 16, 2024
spot_img

బొగ్గు విశ్రాంత ఉద్యోగుల బాధలు తీర్చాలి.

తప్పక చదవండి

గత 22 నెలలుగా ఎదురుచుస్తున్నా బొగ్గు గని కార్మికులకు మే నెల 18,19 తేదీలల్లో కోల్ కత్తాలో జరిగిన కోల్ ఇండియా యాజమాన్యం తో 11 వ జాతీయ బొగ్గు వేతన ఒప్పందం జరిగింది. ఇట్టి వేతన ఒప్పంద సమావేశంలో ఐదు జాతీయ సంఘాలైన ఏఐటీయూసీ, సీఐటీయూ, బిఎమ్ఎస్, ఎచ్ ఎం ఎస్, ఐఎన్ టియుసి నాయకులు పాల్గొని కోల్ ఇండియా , సింగరేణి కార్మికులకు మినిమమం గ్యారంటీ బెనిఫిట్ బేసిక్ పై 19%, అల వెన్సుల పై 25% పెరుగుదల కై ఒప్పందం చేసుకోవడం జరిగింది. భారత దేశం లో ఏ ప్రభుత్వరంగ సంస్థలలో జరగని ఒప్పందం కేవలం బొగ్గు రంగ సంస్థల్లో జరిగిందని ప్రతి గని పై గజ్జెకట్టుకొని ప్రతి జాతీయ కార్మిక సంఘ నాయకులు చెబుతున్నారు.ఈ వేతన ఒప్పందం వలన చిన్న స్థాయి కార్మికునికి 6,000 రూపాయలు, సీనియర్ కార్మికునికి 20,000 రూపాయల వేతనం పెరుగుతుందని. 1-7-2021 నుంచి రావలసిన వేతన బకాయిల పట్టిక తయారు చేసి ఒక్కొరికి కనీసం లక్ష రూపాయలు తగ్గకుండా బకాయిలు వస్తాయని ఢంకా బజాయించి చెబుతున్నారు. ఇంతటి మహత్తర ఒప్పందాన్ని కార్మికులు స్వాగతిస్తున్నారు.
కోల్ ఇండియా యాజమాన్యంతో జరిగే చర్చల్లో విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పెన్షన్ పెంపుదల,మెడికల్ కార్డులపై వైద్య పరిమితి పెంచుతామని, పెన్షన్ ఫండ్ బలోపేతం కొరకు బొగ్గు సంస్థల యాజమాన్యాల నుంచి పెన్షన్ ఫండ్ వృద్ది కొరకు కృషి చేస్తామని చెప్పిన కార్మిక సంఘ నాయకులు చర్చించక పోవడంతో బొగ్గు విశ్రాంత ఉద్యోగులు నిరాశ, నిస్పృహ చెందుతున్నారు.1998 లో ప్రవేశ పెట్టిన కోల్ మైన్స్ పెన్షన్ స్కీం-1998 లో ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒక సారి పెన్షన్ పై సమీక్ష జరిపి సవరించాలనే నిబంధన ఉన్నప్పటికి ఇంతవరకు ఏ ఒక్క సమావేశం లో పెన్షన్ పెంపుదల కొరకు చర్చ జరుగలేదు. దేశ వ్యాప్తంగా దాదాపు ఐదున్నర లక్షల మంది బొగ్గు విశ్రాంత ఉద్యోగులు జీవిస్తున్నారు. వీరిలో కొంతమంది 1,000 రూపాయల లోపు పెన్షన్ తీసుకునేవారు జీవిస్తున్నారు. కొంతమంది పెన్షన్ పెరుగుతుందని ఆశతోనే చనిపోయిన వారు కూడా ఉన్నారు. విశ్రాంత ఉద్యోగులకు 2018 సంవత్సరంలో ప్రవేశపెట్టిన కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ స్కీం ప్రకారం 40,000 రూపాయలు చెల్లించిన విశ్రాంతీయులకు తెలుగు రాష్ట్రాల్లో సింగరేణి అనుబంధ ఆసుపత్రుల్లో విశ్రాంత ఉద్యోగుల దంపతులిద్దరికి జీవిత కాలంలో కేవలం ఎనిమిది లక్షల రూపాయల విలువగల వైద్య సౌకర్యం కల్పించడం జరిగింది. ఈ కార్డు ద్వారా ఔట్ పేషంట్ వైద్య సౌకర్యం లేదు.2018 సంవత్సరం లో ఉన్న మెడికల్ ఖర్చులు ప్రస్తుతం రెండింతలు పెరిగినవి.కానీ మెడికల్ కార్డ్ విలువ అంతే ఉండటం అమానుషం.పదవి విరమణ చెందిన కార్మికునికి రోజు రోజుకు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోనే పరిస్థితులు ఉన్నందువలన కాలానుగుణంగా పెరిగిన వైద్య ఖర్చుల స్థాయిలో మెడికల్ కార్డ్ పరిమితి పెరగలేదు. కాలానికి అనుగుణంగా అటు పెన్షన్ పెరగక, ఇటు వైద్య ఖర్చులు పెరుగుతున్నాయని తెలిసినను కార్మిక సంఘ నాయకులు కోల్ ఇండియా యాజమాన్యంతో చర్చించక పోవడం బాధాకరం. పని చేసే ఉద్యోగుల వేతన పెంపుదల, వారి సంక్షేమంపై ఉన్న ప్రేమ విశ్రాంతీయులపై కార్మిక సంఘ నాయకులకు ఎందుకు లేదు? పని చేసే కార్మికులతో పాటు, విశ్రాంత ఉద్యోగుల సాధక బాధలు కార్మిక సంఘ నాయకులకు తెలిసినను మాట్లాడక పోవడంతో కార్మిక సంఘ నాయకులపై విశ్వాసం సన్నగిల్లుతుంది. విశ్రాంత ఉద్యోగులు గత 25 సంవత్సరాల నుంచి కరువు భత్యం తో కూడిన పెన్షన్ పెంచాలని ఆందోళనలు, నిరసనలు, నిరహారదీక్షలు చేసి, కేంద్ర ప్రభుత్వ మంత్రులకు దాదాపు 100 మంది పార్లమెంట్ సభ్యులకు వినతి పత్రాలు సమర్పించినను ఫలితం శూన్యం.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కొరకై చేపట్టిన “సకల జనుల సమ్మె”లో ప్రప్రథమంగా పాల్గొన్న వారు సింగరేణి ఉద్యోగులే అని పాలకులు మరువ రాదు. కోల్ ఇండియా లేని సౌకర్యాలు సింగరేణి ఉద్యోగులు అనుభవిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటున్న శుభ సమయంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వృధ్యాప్య పెన్షన్ 2016 రూపాయలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, డబుల్ బెడ్ రూమ్, రైతు బంధు, దళిత బంధు లాంటి సంక్షేమ పథకాలు ప్రతి కుల సంఘాలకు ఆత్మీయ భవనాలు, అర్చకులకు 5,000 రూపాయల వేతనం ప్రకటించడం జరిగింది.చాలని పెన్షన్ తో బతుకు బండి లాగిస్తున్న సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు ,ప్రత్యేక పెన్షన్, ఉచితంగా అన్ని రకాల అపరిమిత వైద్య సౌకర్యాలు, స్వంత ఇండ్లు లేని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, తెల్ల రేషన్ కార్డులు ఇస్తే సూర్య చంద్రులు ఉన్నంత కాలం గౌరవ ముఖ్యమంత్రి కలువ కుంట్ల చంద్ర శేఖర్ రావు గారిని తెలుగు జాతి మరువదు.

  • ఆళ వందార్ వేణు మాధవ్..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు