అగ్ర కథానాయకుడు బాలకృష్ణ ప్రస్తుతం తన 108వ చిత్రం ‘భగవంత్ కేసరి’ లో నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. నేడు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ‘భగవంత్ కేసరి’ నుంచి ఫస్ట్ టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. టీజర్‌లో భగవంత్ కేసరి పాత్రలో బాలకృష్ణ పవర్ ఫుల్ క్యారెక్టర్‌ని చూపించారు. పాలకుడి అహంకారానికి, మొండివాడికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బాలకృష్ణ వివరించడంతో టీజర్ ప్రారంభమవుతుంది. టీజర్ ప్రారంభంలో అర్జున్ రాంపాల్‌ను పాలకుడిగా పరిచయం చేయగా.. బాలకృష్ణ తనను తాను మొండి వాడిగా పరిచయం చేసుకుంటారు. ఇక ‘అడవి బిడ్డ .. నేలకొండ భగవంత్ కేసరి. ఈ పేరు చానా ఏళ్లు యాదుంటది’ అంటూ తెలంగాణ యాసలో బాలయ్య అదరగొట్టారు. ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు తిరుగులేని రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో బాలయ్య సరికొత్త లుక్‌లో కనిపించడంతో నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ఫాదర్ డాటర్ సెంటిమెంట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో శ్రీలీల బాలయ్యకు కూతురుగా కనిపించనుంది. బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ‘అఖండ’ వంటి భారీ విజయం తర్వాత బాలకృష్ణ నుంచి రాబోతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాల్ని పెట్టుకున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని దసరాకు రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.