Tuesday, June 25, 2024

అక్రమ నిర్మాణాలతో సవాల్ విసురుతున్న ఆదిత్రి నిర్మాణ సంస్థ..

తప్పక చదవండి
 • ఎన్.జీ.టి. హెచ్చరించినా అమీన్ పూర్ లో అగని అక్రమ నిర్మాణాలు..
 • సర్వే అనంతరం మాయమైన కింగ్ ఫిషర్ చెరువు.. కనిపించని పరివాహక ప్రాంతం..
 • తూములు మూసివేతతో పొంచి ఉన్న భారీ ప్రమాదం..
 • ఆదిత్రికి అమ్ముడుపోయి ఎన్.ఓ.సి జారీ చేసిన సంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ అధికారులు..
 • ఫ్రీ లాంచ్ పేరుతో అదిత్రి అమ్మకాలకు అధికారులు అడ్డుకట్ట వేయాలి..
 • అదిత్రి పేరుతో జరుగుతున్న అక్రమాలపై చీఫ్ సెక్రటరీ దృష్టి సారించాలి..
 • దేశంలో మొట్ట మొదటగా బయోడైవర్సిటి హెరిటేజ్ లేక్ గా
  గుర్తింపు పొందిన చెరువును రక్షించేది ఎవరు..?
 • ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిపెట్టకపోతే రాబోయే
  దారుణ పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలి..

దేశంలోనే మొట్టమొదటి బయోడైవర్సిటీ హెరిటేజ్ లేక్ గా ప్రఖ్యాతిగాంచిన చెరువుపై కన్నేసిన కబ్జాకోరులు.. కొందరు అధికారులను డబ్భుతో కొనేశారు.. ఇంకేముంది వారికి కావలసిన ఎన్.ఓ.సి. జారీ అయ్యింది.. ప్రమాదకరమని తెలిసినా తూములను మూసేసి మరీ అక్రమంగా కట్టడాలకు తెరలేపారు.. ఏకంగా కింగ్ ఫిషర్ చెరువునే కనుమరుగు చేసేసింది.. అక్రమ నిర్మాణాలనే తమ ఆదాయ వనరులుగా మార్చుకుంది ఆ నిర్మాణ సంస్థ.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను సైతం కాలరాసి కొందరు అవినీతి అధికారులు తమకు అండగా నిలబడటంతో రెచ్చిపోతున్నారు అక్రమ నిర్మాణదారులు.. ఆదిత్రి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే నిర్మాణ సంస్థ బరితెగింపును ఆధారాలతో వెలుగులోకి తీసుకుని వస్తోంది ‘ఆదాబ్’..

సంగారెడ్డి జిల్లా, అమీన్ పూర్ మండలం, మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పెద్ద చెరువుకు గ్రహణం పట్టింది.. దేశంలోనే మొట్ట మొదటి సారిగా బయోడైవర్సిటి హెరిటేజ్ లేక్ గా గుర్తింపు పొందిన పెద్ద చెరువునే కనుమరుగు చేసేందుకు అధికారులు కంకణం కట్టుకున్నారు.. అమీన్ పూర్ మండలంలో సుమారు 14 నీటి పరివాహక ప్రాంతాలలో 11 చెరువులు, కుంటలు కబ్జాలకు గురైయ్యాయని.. సుమారు 835 నోటీసులు ఇచ్చినట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు తెలంగాణ చీఫ్ సెక్రెటరీ తేది : 27-05-2021 లో సమర్పించిన నివేదిక తేట తెల్లం చేస్తుంది.. వాల్టా చట్టం 2002 నిబంధనలు తుంగలో తొక్కి అక్రమంగా ఎఫ్.టి.ఎల్. , బఫర్ జోన్లలో కబ్జా చేసి నిర్మించిన నిర్మాణాలను సర్వేచేసి కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది.. ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులతో కూడిన రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపాల్టి, హెచ్.ఎం.డీ.ఏ., పోలీస్ అధికారులతో కూడిన లేక్ ప్రొటెక్షన్ కమిటీని సైతం ఏర్పాటు చేసింది.. అందుకు గాను చెరువుల పరిరక్షణ కొరకు జీ.ఓ.అర్.టి. నెం. 226 తేది : 18-06-2021 గల ఉత్తర్వుల్లో 64.40 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.. ఒక వైపు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని తెలిపినప్పటికి ఆ దిశగా నేటికీ చర్యలు అమలు కాలేదు.. గతంలో ప్రభుత్వం చూపించిన నిర్మాణాల కంటే నూతనంగా మూడు రెట్లు అధికంగా అక్రమ నిర్మాణాలు జరగడమే కాకుండా ఆదిత్రి అనే బడా నిర్మాణ సంస్థ ఏకంగా తూములను మూసివేసి నీటి పరివాహక ప్రాంతంలో భారీ భవనాలు నిర్మించుటకు శ్రీకారం చుట్టి.. ఫ్రీ లాంచ్ పేరుతో అమాయక ప్రజల వద్ద నుండి కోట్లు గడించే ఎత్తుగడను అమలు చేస్తుంది.. నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడానికి వీలులేని నిషేధిత ప్రాంతంలో ఆదిత్రి నిర్మాణ సంస్థకు అధికారులు ఎన్.ఓ.సి. జారీ చేయడం వెనుక భారీ ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు తెలుస్తోంది.. అక్రమ నిర్మాణాలే ఆదాయ వనరులుగా చేసుకున్న ఆదిత్రి నిర్మాణ సంస్థ.. కింగ్ ఫిషర్ చెరువును కనుమరుగు చేసింది.. ఆదిత్రి పేరుతో జరుగుతున్న అక్రమాలపై చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారి దృష్టి సారించి.. ఫ్రీ లాంచ్ పేరుతో చేస్తున్న అక్రమాలను కట్టడి చేసి, నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసి.. తూములను మూసి వేసిన నిర్మాణ సంస్థపై విచారణ చేపట్టి.. క్రిమినల్ చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు బేఖాతర్ చేస్తూ అక్రమాలను ప్రోత్సహిస్తున్న అధికారులపై తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.. పెద్ద చెరువు పరివాహక ప్రాంతంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై మరో కథనం ద్వారా మరిన్ని అక్రమాలను వెలుగులోకి తెనుంది ‘ఆదాబ్ హైదరాబాద్’..’మా అక్షరం అవినీతిపై అస్రం’..
ముఖ్యమంత్రి స్పందించకపోతే జరుగబోయే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలి :
హెచ్చరిస్తున్న పర్యావరణ మేధావులు..

- Advertisement -

అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జరుగుతున్న అక్రమాలపై దృష్టి పెట్టాలని పలువురు విశ్లేషకులు సూచిస్తున్నారు.. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను సైతం త్రోసి పుచ్చుతూ.. కొందరు సంబంధిత అధికారులు.. కబ్జా దారులకు కొమ్ము కాస్తుండటం ఆందోళన కలిగించే విషయం.. అసలు ప్రభుత్వ యంత్రంగం పనిచేస్తోందా..? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.. లేకపోతే జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ హెచ్చరించినా ప్రకృతిని కాపాడాలనే సోయి లేకపోవడం ఏమిటి.. ? అమీన్ పూర్ లో చోటుచేసుకుంటున్న అక్రమ వ్యవహారాల వెనుక ప్రభుత్వ పెద్దల అండతో బాటు.. అధికార పార్టీ నాయకుల ప్రోద్బలం వుందన్నది నిర్విదాంశం.. పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. భవిష్యత్ లో పచ్చదనం అన్నది కనుమరుగయ్యే పెను ప్రమాదం ఏర్పడుతుంది.. ఇప్పటికే ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములు, పట్టా భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్ బోర్డు భూములు యథేచ్ఛగా కబ్జాలకు గురౌతున్నాయి.. ఇది జగమెరిగిన సత్యం.. కాగా ఇప్పుడు ఇబ్బడి ముబ్బడిగా చెరువులు, కుంటలు కూడా కబ్జాలకు గురవుతుండటం ఆందోళన కలిగించే విషయం.. తాగు నీటితో బాటు, సాగునీరు కూడా కరువైపోయి.. రాష్ట్రంలో క్షామం ఏర్పడి, ఆకలి చావులు ఊహకు అందని విధంగా జరిగే అవకాశం లేకపోలేదు.. చెరువులను, కుంటలను కాపాడే ఉద్దేశ్యంతో ఎన్నెన్నో బృహత్తర కార్యక్రమాలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళముందు జరుగుతున్న కబ్జాలు కనిపించడం లేదా..? లేక కనిపించించినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందా..? తన వారికి లబ్ది చేకూర్చే క్రమంలో ప్రకృతిని నాశనం చేయడం సమంజసమేనా..? నీటి వనరుల కోసం.. భావి తరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించిన చెరువులు, కుంటలు కళ్ళముందే మటుమాయమై పోతుంటే.. నిద్రావస్థలో ప్రభుత్వం ఉండిపోవడం భవిష్యత్ తరాలవారికి శాపంగా పరిణమిస్తుంది.. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. నీటి నిల్వలైన చెరువులు, కుంటల పరిరక్షణకోసం నడుం బిగించకపోతే జరుగబోయే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాల్సి వస్తుందని పర్యావరణ మేధావులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు