దేశవ్యాప్తంగా వాహన అమ్మకాలు టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాయి. రోజుకొక కారు విడుదలవుతున్నప్పటికీ కొనుగోలు చేసేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. నూతన ఫీచర్లను కోరుకుంటున్న కస్టమర్లకు నచ్చిన వాహనం కోసం ఎంతకాలమైన వేచి చూస్తున్నారు. ఇటీవల మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన మహీంద్రా 700 వాహనం కోసం ఏడు నెలల వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఈ అంతరాన్ని తగ్గించడానికి అన్ని ఆటోమొబైల్ సంస్థలు తమ ప్లాంట్ల సామర్థ్యాన్ని భారీగా పెంచుకుంటున్నాయి. ఇందుకోసం లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టబోతున్నాయి.
సెమికండక్టర్ల కొరత తగ్గుముఖం పట్టడం, ఎగుమతులు నీరసించినప్పటికీ దేశీయంగా డిమాండ్ నెలకొనడంతో కార్ల తయారీ సంస్థలు రూ.1.2 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టబోతున్నాయని క్రిసిల్ తాజాగా వెల్లడించింది. కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ, టాటా మోటర్స్, మహీంద్రాఅండ్‌మహీంద్రాలు వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యాయి. ప్యాసింజర్ వాహన విక్రయాలు 40 లక్షలకు చేరుకుంటుందన్న అంచనాతో ఆటోమొబైల్ సంస్థలు ఉత్పత్తి కెపాసిటీని భారీగా పెంజుకుంటున్నాయని క్రిసిల్ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పీవీల అమ్మకాలు 9-10 శాతం పెరిగి 50 లక్షల యూనిట్లకు చేరుకుంటుందన్న అంచనా.