Wednesday, July 24, 2024

కొత్త డ్రైనేజీ పైప్ లైన్ రాకపోవడానికి కారణం మంత్రి తలసాని ఆదేశాలే : కొంతం దీపిక నరేష్

తప్పక చదవండి
  • సికింద్రాబాద్ మోండా డివిజన్ లో తాగునీటిలో మోరి నీళ్లు కలుస్తున్న వైనం..
  • కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ సమస్యను 2 నెలల క్రితం పరిశీలించిన స్థానిక కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్.
  • కలుషిత నీరు వల్ల గాంధీ ఆసుపత్రిలో చేరిన స్థానికుడు.
  • కొత్త పైపులు తెచ్చాం. కానీ, మంత్రి వచ్చాకే ప్రారంభిస్తాం : హెచ్.ఎం.డబ్ల్యు.ఎస్ సిబ్బంది
  • మంత్రి వచ్చేవరకు కలుషిత నీరుతో సర్దుకోవాలా.. ?: స్థానికులు
  • అధికారుల ఇంట్లో/ వీధిలో ఇలాంటి సమస్యే గనుక ఉంటే ఇలానే మంత్రి మీద నెట్టేసి ఊరుకునేవారా?
  • పన్ను కడుతున్నది ఇలాంటి ముష్టి నీళ్ళు తాగడానికా?
  • వాటర్ బోర్డ్స్ డైరెక్టర్ తో చర్చించాం : కార్పొరేటర్ దీపిక

హైదరాబాద్, 16 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : ప్రభుత్వం అందించే 20 వేల లీటర్ల ఉచిత నీటి సరఫరా అయితే ఎలాగూ లేదు. కనీసం కట్టిన పన్నుకు తగ్గ ప్రతిఫలం లేకపోవడం దురదృష్టకరం అని అంటున్నారు జనాలు. అక్కడి రోడ్లపై పొంగిపొర్లే డ్రైనేజీ ఓవర్ ఫ్లో చూస్తుంటే, చిన్నప్పుడు మనం పాఠ్యపుస్తకాల్లో చదువుకున్న “నరకంలో ఉండే వైతరణి నది” ని గుర్తుకు తెస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్న ఈ సమస్యను తక్షణమే పరిష్కరిస్తామని రెండు నెలల క్రితం కార్పొరేటర్ దీపిక హెచ్.ఎం.డబ్ల్యు.ఎస్. అధికారులతో సంప్రదించి హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం కావలసిన సమగ్ర సామాగ్రి, భూమి లోపల వేసే పైపులైన్లు అన్ని తెచ్చి సిద్ధంగా ఉంచామని ఆమె అన్నారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం దిశగా వెళ్లట్లేదు. ఇక్కడ దినదినం అధ్వానంగా తయారవుతున్న పరిస్థితిని అధికారులు మంత్రి దృష్టికి కూలంకషంగా తీసుకెళ్తున్నారా..? లేదా..? అని సికింద్రాబాద్ ప్రజలు సందేహం వ్యక్తపరుస్తున్నారు. ఒకవేళ నిజంగానే తీసుకెళ్తే, మరి మొన్నీమధ్యనే మోండా
మార్కెట్ వీధి వీధిలో పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేసిన మంత్రికి అధికారులు ఈ విషయాన్ని ఎందుకు వివరించలేదు అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదేం ఖర్మ :
మంత్రి వచ్చి ప్రారంభించే వరకు పనులు ముట్టమని చెబుతున్న అధికారులు, మరి అప్పటివరకు ఇలా మురికి నీళ్లు తాగుతూ, మురికివాడలో బ్రతుకుతూ ఉండమంటారా అని జనాలు అసహనం వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికే, మంచినీటి రుచిలో తేడా వచ్చిందని, అప్పుడప్పుడు శుద్ధంగా వచ్చే నీరు కాస్త తక్కువ సరఫర అవుతుందని, అలాంటి పరిస్థితుల్లో బయట నుండి తాగునీటిని కొనుక్కోవలసి వస్తుందని తమ బాధను వివరించారు. తక్షణమే అధికారులు చొరవ చూపి పనులు ప్రారంభమయ్యే దిశగా కార్యచరణ రూపొందించాలని ప్రజలు మరొక్కమారు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

ప్రధాన కారణం ఇదేనా?:
కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మరణించిన తర్వాత మంత్రి తలసాని నుండి అధికారులకు పలు ఆదేశాలు అందాయని, రెండు, మూడు లక్షల విలువైన అతి చిన్న ప్రాజెక్టులు మొదలుకొని ఎలాంటి పనైనా సరే తనకు చెప్పకుండా చేయవద్దని, తాను ప్రారంభోత్సవం చేసిన తర్వాతే పనులు మొదలు పెట్టాలని చెప్పారన్న ఒక సమాచారం ప్రచారంలో ఉన్నది. మొన్నటి వరకు కురిసిన వర్షాలకి డ్రైనేజీ వ్యవస్థ మరింతగా పాడైపోయి జనాలు ఇబ్బంది పడ్డారు. ఈ కలుషిత నీటి వల్ల కృష్ణ అనే వ్యక్తి గాంధీ హాస్పిటల్ లో చేరారు. మురికి నీళ్లు తాగునీటిలో కలుస్తున్నాయని ఎన్నో కుటుంబాలు తమ దృష్టికి తీసుకొచ్చిన వెంటనే తగు చర్యలు తీసుకున్నామని దీపిక చెబుతున్నారు. మంత్రి ఇప్పటికైనా తన బిజీ షెడ్యూల్ నుండి సమయం తీసుకుని తాను కోరుకున్నట్లుగా ప్రారంభోత్సవ కార్యక్రమం చేయడమో లేక అతను పెట్టిన షరతులను తీసేసి అధికారులకు పనిచేసుకునే స్వాతంత్రం ఇవ్వడమో ఏదో ఒకటి చేయాలని అన్నారు. అలా కాని పక్షంలో, ఈ యొక్క అధికార దుర్వినియోగాన్ని ప్రజల్లోకి మరింత చురుకుగా తీసుకెళ్తానని కార్పొరేటర్ దీపిక తన తదుపరి కార్యాచరణ ను వెల్లడించారు.

వాటర్ బోర్డ్స్ డైరెక్టర్ ని కలిసాం : కార్పొరేటర్ దీపిక..
మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, రాంగోపాల్ పేట్ డివిజన్ కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ లతో కలిసి ఖైరతాబాద్ వాటర్ వర్క్స్ హెడ్ ఆఫీస్ లో హెచ్.ఎం.డబ్ల్యూ.ఎస్.ఎస్.బి. డైరెక్టర్ కృష్ణని కలిసాము. సనత్ నగర్ నియోజకవర్గం తోపాటు మోండా డివిజన్లోని పలు సమస్యలను అతని దృష్టికి తీసుకెళ్లాము. రెజిమెంటల్ బజార్ లో ప్రతి గల్లీ వాసులు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యలను, గురుద్వార్ నుండి 31 బస్ స్టాప్ వరకు వేయవలసిన సివరెేజ్ లైన్ గురించి, సజ్జన్ లాల్ స్ట్రీట్ లో స్టార్మ్ వాటర్ డ్రెయిన్ సివరెేజ్ లైన్స్ లో కలిసి అవి పొంగి పొర్లడం వల్ల మోండా డివిజన్ వాసులు పడుతున్న ఇబ్బందుల గురించి చర్చించడం జరిగింది. అలాగే ఇతర డివిషన్ లో ఉన్న 100కు పైగా లాడ్జిలకు స్లిట్ చాంబర్లు లేవని, ఇదే విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అధికారులు మాత్రం ఇంకా నోటీసులు జారీ చేయకుండా నిర్లక్ష్యం వహించారని చెప్పడం జరిగింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు