Friday, April 19, 2024

అమ్మాయిలు @ సివిల్స్

తప్పక చదవండి
  • దేశంలోనే 3 ర్యాంక్ సాధించిన ఉమా హారతి..
  • మొదటి, రెండవ స్థానాల్లో ఇషితా, గరిమా..
  • ఇరు తెలుగు రాష్ట్రాల్లో పలువురికి ర్యాంక్స్..
  • మొదటి నాలుగు ర్యాంక్స్ లో యువతులదే హవా..

న్యూ ఢిల్లీ, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ – 2022 తుది ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఇందులో గ్రేటర్ నోయిడాకు చెందిన ఇషితా కిశోర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించింది. తొలి రెండు ప్రయత్నాల్లో కనీసం ప్రిలిమ్స్ కూడా పాసవ్వని ఇషితా.. మూడోసారి సివిల్స్ కు అర్హత సాధించడమే గాక.. ఏకంగా టాపర్ గా నిలవడం విశేషం. అదే సమయంలో బిహార్‌కు చెందిన గరిమా లోహియా రెండో స్థానంలో నిలిచింది. ఇక తెలంగాణకు చెందిన ఎన్ ఉమా హారతి మూడో స్థానం కైవసం చేసుకుంది. యూపీకి చెందిన స్మృతి మిశ్రా నాలుగో స్థానంలో నిలవగా.. అసోంకి చెందిన మయూర్ హజారికా ఐదో స్థానం, కొట్టాయంకు చెందిన గెహనా నవ్య జేమ్స్ ఆరోస్థానం దక్కించుకున్నారు.

సివిల్స్ టాపర్‌గా నిలవడంపై ఇషిత కిషోర్ తన ఆనందాన్ని ట్విటర్ వేదికగా వ్యక్తం చేశారు. ఇషిత కిషోర్ ఢిల్లీ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ కళాశాలలో ఎకనామిక్స్‌లో 2017లో డిగ్రీ పూర్తిచేశారు. ఆ తర్వాత ఎర్నెస్ట్ అండ్ యంగ్ అనే సంస్థలో రిస్క్ అడ్వైజర్‌గా ఎకనామిక్స్ విభాగంలో పనిచేశారు. తాను టాపర్‌గా నిలిచేందుకు చేసిన ప్రయాణంలో వెంట ఉన్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా తన తల్లిదండ్రులు పూర్తి సహకరం అందించారని చెప్పారు. స్నేహితులు తనను గైడ్ చేశారని పేర్కొన్నారు. యూపీఎస్సీ పరీక్షలో తాను క్వాలిఫై అవుతానని పూర్తి నమ్మకం ఉండేదని.. అయితే తొలి ర్యాంకు సాధించడం కొంత ఆశ్చర్యానికి గురిచేసిందని ట్వీట్ చేశారు. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్‌లో చేరి దేశానికి సేవ చేయాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

- Advertisement -

సివిల్ సర్వీసెస్‌లో టాపర్‌గా నిలిచిన ఇషిత కిషోర్ చదువులోనే కాదు.. ఆటల్లోనూ మేటిగా ఉండేది. పాఠశాల స్థాయి నుంచే క్రీడల్లో చురుగ్గా పాల్గొనేదీ. 2017లో దుబాయ్‌లో జరిగిన మిలీనియం వరల్డ్ సమ్మిట్‌లో ఇండో-చైనా యూత్ డెలిగేట్‌గా ఇషిత పాల్గొన్నారు.

నారాయణపేట ఎస్పీ కూతురికి మూడో ర్యాంకు :
యూపీఎస్సీ- 2022 ఫలితాల్లో తెలుగు అభ్యర్థులు సత్తా చాటారు. అందులో నారాయణపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు కూతురు ఉమా హారతి మూడో ర్యాంకు సాధించటం విశేషం. 2022 సంవత్సరానికి గానూ మొత్తం 933 మంది ఎంపిక కాగా.. అందులో మొదటి నాలుగు ర్యాంకులు అమ్మాయిలే కైవసం చేసుకున్నారు. యూపీకి చెందిన ఇషితా కిశోర్‌.. ఫస్ట్‌ ర్యాంకు సాధించగా.. బీహార్‌కు చెందిన గరిమ లోహియా రెండో ర్యాంకు, తెలంగాణకు చెందిన ఉమా హారతి నూకల మూడో ర్యాంకు, యూపీకి చెందిన స్మృతి మిశ్రా నాలుగో ర్యాంకులు సాధించారు. అయితే.. సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్ సీతారాంనగర్ కాలనీకి చెందిన ఉమాహారతికి.. ఈ విజయం ఆమెకు అంత ఈజీగా రాలేదు. ఇంట్లో ఐపీఎస్ నాన్న ఉన్నాడు.. ఇంకేంటీ.. సులువుగానే క్రాక్ చేసింది అనుకుంటే పొరపాటే. ఆమె కూడా చాలా కష్టపడి ఈ ర్యాంకును సాధించినట్టు చెప్పొకొచ్చారు. ఐఐటీ హైదరాబాద్‌లో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఉమా హారతి.. చిన్నప్పటి నుంచి తాను పెట్టుకున్న ఐఏఎస్ లక్ష్యాన్ని ఛేదించేందుకు.. ఎలాంటి జాబ్‌కు వెళ్లకుండా.. పూర్తి సమయాన్ని ప్రిపరేషన్‌కే కేటాయించారు.

ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత.. మొదటి సంవత్సరం నుంచే యూపీఎస్సీ పరీక్షలను రాయటం మొదలు పెట్టారు ఉమా హారతి. ఇలా ప్రిపరేషన్‌కు సిద్ధమైనప్పుడే.. వచ్చే వరకు పోరాడాలని నిశ్చయించుకునే దిగారు. ఇలా ఏకంగా ఐదు సార్లు అటెంప్ట్ చేశారు. నాలుగు సార్లు ఫెయిల్ అవుతూ వచ్చి ఐదో సారికి ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ కొట్టేశారు. అయితే.. ఈ క్రమంలో.. ఎలాంటి కుంగుబాటుకు లోనవకుండా.. పడిన ప్రతీసారి మరింత గట్టిగా పైకి లేచి ఇప్పుడు అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. అయితే.. దానికి కారణం తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఇచ్చిన సపోర్టేనని చెప్పుకొచ్చారు. కంటెంట్, నాలెడ్జ్ కోసం ఎన్నో బుక్స్, మెటీరియల్స్, కోచింగ్ సెంటర్స్ ఉన్నాయని.. కానీ ఎమోషనల్ సపోర్ట్ మాత్రం కేవలం ఫ్యామిలీ నుంచే దొరకుతుందన్నారు. తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తనకు సపోర్ట్ చేయటం వల్లే తాను ఈరోజు ఈ ర్యాంకు సాధించగలిగానని చెప్పుకొచ్చారు. తాను ప్రిపేర్ అయ్యే ఈ ఐదేళ్లల్లో.. ఇంకెన్ని రోజులు చదువుతావని ఒక్కసారి కూడా తన ఫ్యామిలీ అడగలేదని ఉమా హారతి పేర్కొన్నారు. అలా తాను ఫీలైన ప్రతీ సారి తన ఫ్యామిలీనే ధైర్యం చెప్పి.. ఎమోషన్ సపోర్ట్ ఇచ్చారని తెలిపారు. తన మీద తన కంటే.. తన కుటుంబానికే తన మీద నమ్మకమెక్కువగా ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో తాను చాలా ఫెయిల్యూర్స్ చూశానని చెప్పుకొచ్చారు. సివిల్స్ క్రాక్ చేసిన తన ఫ్రెండ్స్ ఇన్‌పుట్స్ తీసుకుని.. ప్రిపేరయ్యానని తెలిపారు. రోజుకు ఎనిమిది నుంచి 10 గంటలు ఒ స్ట్రాటజీతో చదివినట్టు పేర్కొన్నారు. అయితే.. తాను పడిన కష్టానికి ర్యాంకు లిస్ట్‌లో తన పేరు ఉంటే చాలని అనుకున్నానని.. కానీ.. ఇలా మూడో ర్యాంకు వస్తుందని అనుకోలేదని చెప్పుకొచ్చారు.

సివిల్స్ లో సత్తా చాటిన తెలుగు తేజాలు :
ఈసారి సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి అభ్యర్థులు మెరుగైన ర్యాంకులు సాధించి సత్తా చాటారు. నూకల ఉమా హారతి మూడో ర్యాంకు సాధించగా.. తిరుపతికి చెందిన జీవీఎస్ పవన్ దత్తాకు 22వ ర్యాంకు వచ్చింది. అజ్మీరా సంకేత్ కుమార్ 35వ ర్యాంకు, శాఖమూరి శ్రీసాయి ఆశ్రిత్కు 40వ ర్యాంకు దక్కగా..
సాయిప్రణవ్ 60, ఆవుల సాయికృష్ణ 94, నిధి పాయ్ 110, అనుగు శివమారుతీరెడ్డి 132, రాళ్లపల్లి వసంతకుమార్ 157, కమతం మహేశ్ కుమార్ 200, రావుల జయసింహారెడ్డి 217, విశాఖ వాసి సాహిత్య 243, అంకుర్ కుమార్ 257, బి. ఉమామహేశ్వర్ రెడ్డి 270, చల్లా కల్యాణి 285, పి. విష్ణువర్దన్ రెడ్డి 292, సాయికృష్ణ 293, లక్ష్మీ సుజిత 311, ఎన్. చేతనా రెడ్డి 346, యారగట్టి శ్రుతి 362, సోనియా కటారియా 376, షాద్నగర్కు చెందిన యప్పలపల్లి సుష్మిత 384, రేవయ్య 410, సీహెచ్. శ్రావణ ్కుమార్ రెడ్డి 426, బొల్లిపల్లి వినూత్న 462, దామెర హిమ వంశీ 548, రేపూడి నవీన్ చక్రవర్తి 550, కొట్టె రుత్విక్ సాయి 558, తమ్మదడ్డి పద్మన్న 566, ఎర్రంశెట్టి రమణి 583, భవిరి సంతోష్ కుమార్ 607, తుమ్మల సాయికృష్ణారెడ్డి 640, పసులూరి రవికిరణ్ 694, రెడ్డి భార్గవ్ 772, నాగుల కృపాకర్ 866 ర్యాంకులు సాధించి ఈ ఏడాది సివిల్స్ లో మెరిశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు