Saturday, April 20, 2024

బీసీ, ఎంబీసీ, సంచార కులాలను అభివృద్ధి పర్చడంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం..

తప్పక చదవండి
  • శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్, రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు
  • బీసీల, ఎంబీసీ ల, సంచార కులాల సంక్షేమాన్ని గాలికి వదిలేసి విమర్శించొద్దు అంటే ఎలా?
  • తెలంగాణ లో అమలులో ఉన్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడైనా ఉన్నాయా?
  • సంచార జాతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరి అప్రజాస్వామికమే.
  • దశాబ్దాలు ఉద్యమించి సాధించుకున్న హక్కులను, ప్రయోజనాలను కేంద్రం కాలరాస్తున్నది.
  • కుల గణనను చేయబోమని ప్రకటించడంలో ఉన్న ఆంతర్యమేమిటి?
  • సంవృద్ధిగా నిధులు కేటాయించకుండా, పథకాలు అమలు చేయకుండ దేశం అభివృద్ది చెందడం ఎలా సాధ్యపడుతుంది?

దేశంలోని మెజారిటీ ప్రజలైన బీసీ, ఎంబీసీ, సంచార, విముక్త, అర్థ సంచార కులాల, జాతుల అభివృద్ధిని, సంక్షేమాన్ని గాలికి వదిలేసి, దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని ప్రకటించుకోవడం మోడీ ప్రభుత్వానికే చెల్లిందని శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. బీసీలకు కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఉద్యమిస్తున్నప్పటికీ కేంద్రం పెడచెవిన పెట్టడం మంచిది కాదన్నారు. ప్రధానమంత్రి మోడీ బీసీ వర్గాలకు చెందిన వాడయినప్పటికీ, ఈ వర్గాల ప్రగతిని ఆశించక పోవడం పట్ల ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు. 75 ఏళ్ళ తర్వాత కూడా ప్రజలు రోడ్ల మీదికి వచ్చి కనీస అవసరాల నిమిత్తం పోరుబాట పట్టాల్సిన అగత్యం, కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కాక మరేమవుతుందని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణా బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు ప్రసంగిస్తూ… జాతీయ బీసీ కమిషన్ ను రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటు చేయడం అన్ని సమస్యలకు పరిష్కారం కాదని, ఆ కమిషన్ ద్వారా ఈ వర్గాలకు మేలు జరిగినపుడు మాత్రమే నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి అని అన్నారు. జాతీయ కమిషన్ కు ఒక ఛైర్మన్ ను మాత్రమే నియమించి, వైస్ ఛైర్మన్, ఇతర సభ్యులను నియమించకపోవడం వలన జాతీయ బీసీ కమిషన్ ఎవరికీ ఉపయోగపడని రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

శుక్రవారం నాడు విముక్త, సంచార, అర్థ సంచార జాతుల, కులాల జాతీయ సదస్సు ముగింపు సభ జరిగింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గత బుధవారం నుండి శుక్రవారం వరకు 3 రోజల పాటు వివిధ సెషన్లుగా సమావేశాలు నిర్వహించబడ్డాయి. శుక్రవారం ముగింపు సమావేశంలో డాక్టర్ బండా ప్రకాశ్, డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, రాజ్య సభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మన్, జాతీయ కాంగ్రెస్ నేత కొప్పుల రాజు (రిటైర్డ్ ఐఏఎస్), జాతీయ డీ.ఎన్.టి. కమిషన్ మాజీ ఛైర్మన్ బాలకృష్ణ రేనకే, సామాజిక వేత్తలు ప్రొఫెసర్ ఐ.తిరుమలి, ప్రొఫెసర్ చెన్న బసవయ్య, సంఘాల ప్రతినిధులు తిపిరిశెట్టి శ్రీనివాస్, పల్లవి రేనకే, పెండ్ర వీరన్న, వెన్నెల నాగరాజు, కర్నె ఉపేందర్, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర సంఘం అధ్యక్షుడు ఒంటెద్దుల నరేందర్ ముగింపు సభకు సభాధ్యక్షులుగా వ్యవహరించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో డాక్టర్ బండా ప్రకాశ్ ప్రసంగిస్తూ… దేశంలో ఎమర్జెన్సీని తలపించే విధంగా పాలన కొనసాగుతున్నదని అన్నారు. ఎస్.సి., ఎస్,టి., బీసీ, ఎంబీసీ, సంచార జాతులను, కులాలను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, నిరధారణకు గురిచేస్తున్నదన్నారు.. ఉద్దేశ పూర్వకంగానే అణిచివేస్తున్నదని ఆయన విమర్శించారు. సంచార జాతుల జీవన ప్రమాణాలను ప్రణాళిక బద్ధంగా మెరుగు పరచాల్సిన కేంద్రం ఆ భాధ్యత నుండి తప్పుకోవడం దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది “బండా ప్రకాశ్ ” అన్నారు. నిధులు కేటాయించడమే అతి తక్కువ, వాటిని ఖర్చు చేయకపోవడం అమానవీయం కాక మరేమి అవుతుందని డాక్టర్ బండా ప్రకాశ్ ప్రశ్నించారు. కేంద్రానికి చిత్త శుద్ధి ఉంటే తెలంగాణలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలను దేశ వ్యాప్తంగా వెంటనే అమలులోకి తేవడానికి ముందుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు.

సభలో మరొక అతిధిగా పాల్గొన్న రాజ్య సభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ ప్రసంగిస్తూ… తమ ప్రభుత్వం అనేక అభివృద్ధి పథకాలను బలహీన వర్గాల నిమిత్తం అమలు లోకి తెచ్చిందన్నారు. ఈ జాతీయ సదస్సులో తన దృష్టికి వచ్చిన అంశాలను కేంద్ర ప్రభుత్వంకు నివేదించి, పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని తెలిపారు.

డాక్టర్ వకుళాభరణం ప్రసంగిస్తూ… హైదరాబాద్ వేదికగా “సంచార జాతుల డిక్లరేషన్” జాతీయ మహా సభలు జరగడం శుభ పరిణామం అన్నారు. గతంలో దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి జాతీయ సదస్సులు జరుగలేదన్నారు. ఇలాంటివి దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ నిర్వహింపబడి జాతీయ స్థాయిలో బలంగా చర్చలు వెల్లి విరియాలి అన్నారు. ఈ వర్గాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, శాశ్వత ప్రతిపాదికన సలహా మండలి, ప్రత్యేకంగా నిధులు, పథకాలు, ప్రయోజనాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉండాలని సూచించారు.

జాతీయ కాంగ్రెస్ ఎస్.సి. విభాగం అధ్యక్షులు కొప్పుల రాజు (రిటైర్డ్ ఐఏఎస్) ప్రసంగిస్తూ… గతంలో యు.పి.ఎ. ప్రభుత్వం చేసిన కులగణనను కేంద్రం తొక్కిపెట్టిందని విమర్శించారు. “హైదరాబాద్ డిక్లరేషన్” ముసాయిదాలో ప్రవేశపెట్టిన ప్రతిపాదనకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన సంచార జాతుల, కులాల, సంఘాలకు చెందిన ప్రతినిధులు భారీ ఎత్తున పాల్గొని పలు అధ్యయన పత్రాలను సమర్పించారు. పలువురు నిర్దిష్టమైన ప్రతిపాదలను చేశారు. మూడు రోజులు పాటు జరిగిన ఈ జాతీయ సమావేశాలకు సమన్వయ కర్తలుగా ఒంటెద్దుల నరేందర్, తిపిరిశెట్టి శ్రీనివాస్, పల్లవి రేనకే, ప్రొఫెసర్ ఐ.తిరుమలి, ప్రొఫెసర్ చెన్న బసవయ్య, వన్నె నాగరాజు, ఆంధ్ర ప్రదేశ్ ఎంబీసీ కార్పొరేషన్ ఛైర్మన్ పెండ్ర వీరన్న, పూసల రవి తదితరులు వ్యవహరించారు. అనేక అంశాల పై సుదీర్ఘంగా చర్చలు జరపడం, మేధోమధనం నిర్వహించడం పట్ల నిర్వహకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు