Thursday, April 18, 2024

ఎలక్షన్ ఎఫెక్ట్..

తప్పక చదవండి
  • రూ.100 కోట్ల పరువు నష్టం కేసులో సమన్లు జారీ చేసిన పంజాబ్ కోర్టు..
  • కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోపై రాజుకున్న వివాదం..
  • భజరంగ్ దళ్ వంటి సంస్థలను నిషేధిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్..
  • సంగ్రూర్ కోర్టులో పిటిషన్ వేసిన హిందూ సురక్ష పరిషత్..

బెంగుళూరు, 15 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో.. భ‌జ‌రంగ్‌ద‌ళ్‌ను బ్యాన్ చేస్తామ‌ని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే ప్ర‌క‌టించిన విష‌యంలో పంజాబ్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఇటీవల కర్ణాటక ఎన్నికల సమయంలో భజరంగ్‌ దళ్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఖర్గేపై హిందూ సురక్షా పరిషత్ భజరంగ్ దళ్ హింద్ వ్యవస్థాపకుడు, సంగ్రూర్‌కు చెందిన హితేష్ భరద్వాజ్ రూ.100 కోట్లకు పరువు నష్టం కేసు దాఖలు చేశారు. సిమి, అల్-ఖైదా వంటి జాతి వ్యతిరేక సంస్థలతో భజరంగ్ దళ్‌ను కాంగ్రెస్ పార్టీ పోల్చినట్టు హితేష్ తన పిటిషన్‌లో ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే భజరంగ్ దళ్‌ను నిషేధిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న విషయం కూడా ప్రస్తావించారు.

‘‘కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పదో పేజీలో భజరంగ్ దళ్‌ను జాతి వ్యతిరేక సంస్థలతో పోల్చారు.. తాము ఎన్నికల్లో గెలిస్తే నిషేధిస్తామని కూడా హామీ ఇచ్చారు’’ అని హితేష్ భరద్వాజ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ‘బజరంగ్ దళ్ పేరును ప్రస్తావిస్తూ కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో మెజారిటీ లేదా మైనారిటీ వర్గాల మధ్య శత్రుత్వం, ద్వేషాన్ని ప్రోత్సహించే సంస్థలను నిషేధిస్తామని హామీ ఇచ్చింది’ అని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సంగ్రూర్ జిల్లా కోర్టు.. కాంగ్రెస్ అధ్యక్షుడికి సమన్లు జారీచేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే‘కులం లేదా మతం ఆధారంగా వర్గాల మధ్య ద్వేషాన్ని వ్యాప్తి చేసే వ్యక్తులు, సంస్థలపై కఠిన, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. మెజారిటీ లేదా మైనారిటీ వర్గాల మధ్య శత్రుత్వం లేదా ద్వేషాన్ని పెంపొందించే వ్యక్తులు, బజరంగ్ దళ్, పీఎఫ్ఐ వంటి సంస్థలను నిషేధిస్తాం.. చట్టం, రాజ్యాంగం పవిత్రమైనవని మేం విశ్వసిస్తాం’ మేనిఫెస్టోలో పేర్కొంది. మల్లేశ్వరం నియోజకవర్గం నుంచి విజయం సాధించిన మాజీ మంత్రి సీఎన్ అశ్వత్థనారాయణ్ ఫలితాల రోజున మాట్లాడుతూ.. భజరంగ్ దళ్‌ను నిషేధించాలని కాంగ్రెస్‌కు సవాలు విసిరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు