Sunday, December 10, 2023

ఆ భారం ఎవరి పైన..

తప్పక చదవండి

ప్రపంచంలోనే ఎంతో ప్రాముఖ్యత కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ఉందని బడి ఈడు రోజుల నుండి ఇప్పటివరకు వింటూనే వచ్చాం.ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన పరిపాలకుల చేతుల్లో మన దేశం నడుస్తుంది.స్వాతంత్రం అనంతరం రాజ్యాంగ రూపకల్పన ప్రకరణల (ఆర్టికల్) ప్రకారంగా భారతీయులంతా కొనసాగాలి. అయితే ఇది ఒకప్పుడు కొనసాగిందేమో గాని ప్రస్తుతం భారతీయులందరినీ నడిపించేది రాజ్యాంగమా?లేదా రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాము అన్నట్లుగానే ఉండి సొంత ఆలోచనను ప్రజలపై రుద్దుతున్న రాజకీయ నాయకులా? అన్న ప్రశ్న ప్రజల్లో పుట్టుకొచ్చేలా ప్రస్తుతం రాజకీయాలు ఉన్నాయని రాజకీయ నాయకులు మినహాయిస్తే మిగతా ప్రజలంతా ముక్తకంఠంతో ఒప్పుకుంటారు. ప్రజలు ఎలాగో తమకు ఓట్లు వేసి పటం కట్టబెట్టారు ఇక తమకు ఇష్టం వచ్చినట్లుగా పరిపాలన కొనసాగిద్దాం అన్న ఆలోచనతో ఆయా నాయకులు ఉంటారని ప్రజల గురించి ప్రజా సమస్యల పరిష్కారం గురించి పట్టించుకోవడం అంతంత మాత్రమే అని ఓటు వేసే ప్రతి ఓటరు కచ్చితంగా చెబుతారు.ఒక్కసారి ప్రజా ప్రతినిధిగా గెలిచిన రాజకీయ నాయకుడు ఎంతసేపు తమ భవిష్యత్తు గురించి తమ రాజకీయ ఎదుగుదల గురించి ఆలోచన చేస్తున్నాడని వారి ప్రవర్తన ప్రచార కార్యక్రమాలను బట్టి ప్రజలకు సులువుగా స్పష్టమవుతుంది.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుడికి అందనంతగా నిత్యవసర సరుకులు ధరలు పెంచి చేతులు దులుపుకుంటున్నాయి.ఇక ప్రతిపక్షాల వారు ధరలు పెరిగినప్పుడు ఒకటి రెండు రోజులు మొక్కుబడిగా నిరసన కార్యక్రమాలు చేపట్టి ఆ తర్వాత ఉద్యమాలను నీరుగార్చి ప్రజల పక్షంగా బలమైన శక్తులుగా నిలబడలేని చిత్తశుద్ధి లేని నాయకులుగా సమాజానికి తమను తామే కనబరచుకుంటున్నారు. పెరిగిన ధరలు తగ్గించే ఉద్యమాలు చేయడం పక్కన పెడితే అధికారంలో ఉన్న పార్టీల సభలు సమావేశాలకు అయ్యే విపరీత ఖర్చుల భారం చివరాఖరికి ఎవరి మీద మోపుతారు.బహిరంగ చర్చకు సిద్ధం చేస్తే ఏ నాయకుడు ఒప్పుకుంటాడు నిజానిజాలను. రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు కోటానుకోట్ల రూపాయల బినామీ పేర్లతో వెనకేసుకుంటున్నారని ఆరోపణలు లేని నాయకుని పేర్లు వేళ్ళ మీద లెక్కబెట్టొచ్చన్న ప్రశ్న ప్రజలను అడిగితే చెబుతారు.ఉంటారా? నిజమైన నికార్సైన నిజాయితీగల అసెంబ్లీ పార్లమెంట్లకు వెళ్లిన ప్రజాప్రతినిధులు.ఈనాడు ఎంతో మేధాశక్తి కలిగిన నూటికి 40 శాతం ప్రజలు ఇలాంటి నాయకులను ఎదురు తిరిగి ప్రశ్నిస్తే ఎంతమంది ఆ జాబితాలో నేను లేను అని నిక్కచ్చిగా నిలబడి ధైర్యంతో చెప్పగలరు.ప్రభుత్వ రాబడికి కన్నం పెట్టి అక్రమ దందలు,వ్యాపారాలు, మోసాలు చేసే వారి నుండి వసూళ్ల పర్వం కొనసాగించి తమ పబ్బం గడుపుకొనే నాయకులు దేశానికి ఏం మేలు చేయగలరని ప్రజలు మీడియా ముఖంగా ప్రశ్నించే రోజులు రావాలని బయటకు రాలేని రహస్య చైతన్యవంతులైన నిస్సహాయులు కోరుకుంటున్నారు. ప్రతిపక్షాలు,పాలకపక్షపు వాళ్లు, ఎవరైతే నేమి తమ రాజకీయ భవిష్యత్తు కోసమే ఆలోచన చేస్తున్నారు.నిజంగా నిరుపేద ప్రజలకు వారి నుండి ఒరిగింది ఏమిటి అని ప్రశ్న వేసి జవాబు వైపు చూస్తే సమాధానం చెప్పలేని జీరోగా తెల్ల మొఖం వేసుకొని కనిపించదా? భవిష్యత్తులో భారతీయం ఎటు వెళ్తోంది? ఏంగానుంది? మన పరిస్థితులు ఇలా ఉంటే ఇక మన భవిష్యత్తు తరాల వారి పరిస్థితి ఏమిటి? నిత్యవసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.సంపాదన శూన్యంగా మిగిలిపోతుంది.పేదోడు పేదోడిగా మిగిలిపోతున్నాడు.అక్రమార్జన చేసేవాడు అక్రమ సంపాదనకు అలవాటు పడ్డవాడు రాజకీయాల్లోకి వచ్చిన నూటికి 70 శాతం మంది శ్రీమంతులుగా 10 తరాలు కూర్చుని తిన్న తరగని ఆస్తిని సంపాదించుకుంటూ కనిపించని దేశద్రోహులుగా మారుతున్నారని ప్రజలు ఎవరికీ చెప్పుకోలేక తమ గుండెలు బాదుకుంటున్నారు.ఒకరిని చూసి ఒకరు తమ బలం ఏంటో తమ శక్తి ఏంటో చూపించుకోవాలని పోటాపోటీగా ప్రజల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా అధికార దాహం కలిగిన రాజకీయ నాయకులు ఏర్పాటు చేసుకునే పాదయాత్రలు సమావేశాలు సభలు పబ్లిసిటీ లాంటివన్నీ సామాన్య ప్రజలపై పన్ను రూపంలో భారం పడుతుందన్న జ్ఞానం లేని రాజకీయ స్వార్ధ నాయకుల నుండి భారతదేశం త్వరలోనే కోలుకోవాలని తేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం

కందుకూరి యాదగిరి, సీనియర్ పాత్రికేయులు,
సూర్యాపేట. 9640282050

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు