- పట్టపగలే 19 యేళ్ల అమ్మాయిని కిడ్నాప్ చేసిన దుండగులు…
- పెట్రోల్ బంకు సమీపంలో ఘటన.. వైరల్ అవుతున్న వీడియో
భోపాల్ : పట్టపగలు.. జనాలంతా చూస్తుండగా.. ఓ 19 యేళ్ల ఆడపిల్లను బైక్‌పై వచ్చి ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. పెట్రోల్ బంకు వద్ద ఉన్న సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది. ఈ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ సంఘటన జరిగింది. సోమవారం స్థానిక పెట్రోల్ బంకు వద్దకు ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చారు. అక్కడ ఉన్న 19 ఏళ్ల యువతిని బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. స్థానికులు స్పందించేలోపు బైక్‌పై అక్కడి నుంచి పారిపోయారు. ఒక వ్యక్తి తలకు హెల్మెట్ పెట్టుకోగా, మరో వ్యక్తి ముఖానికి క్లాత్ చుట్టుకున్నాడు. కిడ్నాప్ అయిన యువతి బింధ్ జిల్లాకు చెందినట్లు పోలీసులు తెలిపారు. బీఏ చదువుతున్న ఆమె కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి జరుపుకునేందుకు బింధ్ వెళ్లినట్లు చెప్పారు. సోమవారం బస్సు దిగిన ఆ యువతి సోదరుడి కోసం పెట్రోల్ బంకు వద్ద వేచి ఉండగా ఆమెను కిడ్నాప్ చేసినట్లు తెలిసిందన్నారు. కేసు నమోదు చేసి యువతి, కిడ్నాపర్ల కోసం వెతుకుతున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఆ పెట్రోల్ బంకు వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.