- వచ్చే వారం ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం
- ఇప్పటి వరకు 50 మంది అరెస్ట్
- డీఈ పూల రమేశ్ అరెస్టుతో కీలక మలుపు
హైదరాబాద్
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు వరంగల్ జిల్లాకు చెందిన డీఈ పూల రమేశ్ అరెస్టుతో కీలక మలుపు తిరిగింది. ఇప్పటి వరకు ఈ కేసులో సిట్ 50 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా ఇందులో 15 మంది బెయిల్ పై బయటికి వచ్చారు. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ జైల్లోనే ఉన్నారు. ఈ కేసులో 37 మంది పేర్లతో చార్జి షీట్‌ను ప్రిపేర్ చేసే పనిలో సిట్ నిమగ్నమైంది. ఏఈ ప్రశ్నపత్రాలను లీక్ చేసిన ఎన్పీడీసీఎల్ డీఈ పూల రమేశ్ అరెస్టు తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది. తన భార్య పేరిట హైదరాబాద్ లో కోచింగ్ సెంటర్ నడుపుతున్న రమేశ్ ఏకంగా 80 మందికి ఏఈ ప్రశ్నపత్రం అమ్మినట్టు సిట్ భావిస్తున్నది. ఆ 80 మంది ఎవరు..? వారి వివరాలేంటి..? ఎవరెవరు ఎంతకు క్వశ్చన్ పేపర్ కొనుగోలు చేశారు..? అనే కోణంలో సిట్ దర్యాప్తు చేస్తున్నది. వాళ్లెవరో తేలితే అరెస్టు చేసేందుకు సిట్ రెడీ అవుతున్నది. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అభియోగపత్రం సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. పూల రమేశ్ నుంచి ప్రశ్నపత్రం కొనుగోలు చేసిన వారి పేర్లతో తర్వాత అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది.