వర్తమానంలో జరుగుతున్న వాస్తవ సంఘటనలు మానవ అస్థిత్వానికే పెనుముప్పుగా పరిణమిస్తున్నాయి.సమిష్టితత్వం అదృశ్యమై పోతున్నది. ఎవరికి వారు గిరిగీసుకుని, బ్రతకడానికే ఇష్టపడుతున్నారు.సమిష్ఠి జీవన సౌందర్యాన్ని ఆస్వాదించలేక పోతున్నారు. పాశ్చాత్య నాగరికతా ప్రవాహంలో కొట్టుకు పోతూ,విలువలను విధ్వంసం చేస్తున్నాం.కాలం వర్తమానంలో ఎదురవుతున్న సంఘటనలను విశ్లేషిస్తే “గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్…”అనే భావన కలగక మారదు.గతకాలపు జీవన సౌందర్యం మిథ్యగా మారిన నేపథ్యంలో బంధాలన్నీ భారంగా మారిపోయాయి.మానవ జీవనం యాంత్రిక రూపం సంతరించుకున్నది.గతం చెరిగింది.వర్తమానం అవలక్షణాల హారంగా సమాజం మెడలో కత్తిలా వేలాడుతుంది.జాతికి జవసత్వాలు కల్పించిన సంస్కర్తలు చరిత్రగర్భంలోకి ఒదిగి పోయారు.వారి ఆశయాలు,ఆదర్శాలు వారితో పాటు అంతమై పోయాయి.విలువలతో నిర్మించిన నైతిక సౌధాలు పునాదులతో సహా పెకలించబడ్డాయి. మేడి పండు లాంటి వ్యవస్థలు బయలు దేరాయి.నేతి బీరకాయ లాంటి సమాజం ఆవిర్భవించింది. గురివింద గింజలాంటి నీతి సూత్రాలు వల్లించబడుతున్నాయి.ఇది నాటి తరం ఆశించని నేటి నీతిలేని నేతిబీరకాయ సమాజం.శాంతి,అహింస,సహనం వంటి మౌలిక సిద్ధాంతాలు కాలవాహినిలో కలసిపోయాయి.”అహింసో పరమో ధర్మః” అన్న నాటి మాటలు నీతి ప్రవచనాలు వల్లెవేయడానికే పనికొస్తున్నాయి.మానవత్వం మంటగలిసింది.హింసాప్రవృత్తితో,అవినీతితో,స్వార్ధంతో ఆర్ధికంగా ఎదిగే వారే నేటి సమాజంలో అధికం. ఆర్ధికంగా చితికిన బ్రతుకుల గతుకుల్లో అస్తవ్యస్థం గా మారిన సగటు జీవుల జీవనయానం వర్ణింపశక్యంకాదు.అవిద్య,నిరుద్యోగం,ఆర్ధికఅంతరాలు,అవినీతి,అరాచకాల మధ్య ఏ ఎండకాగొడుగు పడితే కాని బ్రతకలేని అవకాశవాదపు దాష్ఠీకాలు నేటి సమాజంలో అడుగడుగునా తారసపడుతున్నాయి.అరకొర ఆదాయంతో సగటుజీవికి తెల్లారితే భయం.అనారోగ్యం దాపురిస్తే మరీ దుర్భరం.మధ్యతరగతి జీవులకు ఎండావాన, రేయిపగలూ రెండూ సమానమే.చావలేక, బ్రతకలేక చస్తూ బ్రతకడమేనా సగటుజీవి నుదుటి రాత? ఇది విధిలిఖితమా? విధివైపరీత్యమా?మానవ కల్పిత వైఫల్యమా? ఇది అర్థం కాని మనోవేదన.పైకి డాంభికం-లోలోపల రోదన, భరింపశక్యంగాని వేదనలతో అనేకమంది నేటి సమాజంలో “పరువు” అనే పరదాలో బ్రతుకుతూ పొంగి పొర్లుతున్న కన్నీటిని దాచేస్తూ బ్రతికేస్తున్నారు.ఈ కన్నీళ్ళ పర్వానికి ముగింపు లేదా? కక్కలేక,మింగలేక మానసిక క్షోభ అనుభవించే నిజ జీవితపు కథలవెతలు ఊహాతీతం-వర్ణనాతీతం. కడుపు నిండితే కవిత్వం-కడుపు కాలితే వైరాగ్యం…ఇదీ సమకాలీన సమాజంలో కానవస్తున్న వైరుధ్యం. ఆర్ధిక అంతరాల మధ్య ఆర్ధికలేమితో కృంగిపోతున్న సగటు జీవి అంతరంగాన్ని మదించాలి.అవగతం చేసుకోవాలి. కష్టాల సంద్రాన్ని ఈదలేక మనోనిబ్బరం కోల్పోతున్న మధ్యతరగతి మనుషుల ఆక్రందనలు కవి కలానికి అందని విషాదపు గేయాలు.ఒకవైపు సగటు జీవి ఆవేదనాస్వరం ఇలా ఉంటే మరోవైపు మానవత్వం కానరాని మనుషులతో పోరాటం మానసిక సంఘర్షణ కు దారితీస్తున్నది.స్వార్ధపు సంకెళ్ళలో చిక్కిశల్యమై మానవీయకోణమే అదృశ్యమైపోతున్నది. అవకాశవాదపు ధోరణులు మానవత్వాన్నే వెక్కిరిస్తున్నాయి. “బ్రతుకు-బ్రతికనివ్వు” అనే కనీస స్ఫృహ అంతర్ధానమౌతున్నది. మనిషిని మనిషే కబళించుకుతినే అనాగరికపు ఆటవిక సంస్కృతి శరవేగంగా దూసుకువస్తున్నది.మానవత్వం మంటగలిసి దానవత్వం జడలువిప్పి నర్తించే నరజీవనయానంలో “మంచి-చెడు” అనే విచక్షణ నామమాత్రమైనా కానరాదు.”బహిర్ముఖం-అంతర్ముఖం” ఈ రెంటినడుమ వ్యత్యాసం హస్తిమశకాంతం. లోపల రాక్షసత్వం-బయట గాంధీతత్వం.ఇదే నేటి మానవనైజం. భిన్న వైరుధ్యాల మధ్య నడయాడే మానవ జీవన కాల చక్రంలో నటనపాలు అధికమై,నిజస్వభావం ‘నటన’ అనే తెరచాటున కనుమరుగై మానవత్వాన్ని వెక్కిరిస్తుంటే మంచికి దారి ఎక్కడ? ఊహకందని అడ్డదారుల్లో విడ్డూరాల నడుమ వయ్యారాలు పోయే మానవ జీవనగమ్యంలో మనిషి పెరిగి,మనసు తరిగి మానవత్వం కృశించింది. మానవత్వం మాయమైన మనిషిలో సత్యం నాస్తి-అహం జాస్తి. ఇదే నేటి మానవ జీవన ముఖచిత్రం. మాయమైపోతున్న మనిషి యొక్క గత కాలపు జీవన అవశేషాలే చరిత్ర పుస్తక పుటల్లో నిలిచిపోతున్న సువర్ణభరిత అధ్యాయాలు. గత కాలపు జీవన సౌందర్యాన్ని, గతకాలపు మనుషుల నిష్కల్మష హృదయ సౌందర్యాన్ని గ్రంథస్తం చేసి, నేటి సమాజానికందిస్తే గుడ్డిలో మెల్లలా కొంతయినా సమాజానికి ఉపయోగపడుతుంది. మూర్ఖత్వం,ధూర్తత్వం మేళవించిన నవతత్వం మంచిని హింసిస్తుంటే,ఇక మానవీయం దేవతావస్త్రమే. ఈ వ్యవస్థ మారాలి. వ్యవస్థ అంటే అదో రాతి బొమ్మకాదు.చలనమున్న మనుషులతో కూడిన సమాజం అని గుర్తెరగాలి.నిజాయితీగా బ్రతికే వారికి చోటుండాలి.సత్యం,అహింసలకు కనీస మార్గముండాలి. మనసు లేని మనుషుల లోకం వింతగా మారిన నేపథ్యంలో సంఘం చెక్కిన సజీవ శిల్పాల్లో ఇకనైనా కదలిక రావాలి.
- సుంకవల్లి సత్తిరాజు, 9704903463.