న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసిందనే వార్తలపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ మంగళవారం స్పందించారు.మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ట్విట్టర్ వేదికగా ప్రకటించి ఆపై పోస్ట్‌ను డిలీట్ చేసిన మరుసటి రోజు సోనియా రియాక్టయ్యారు. మహిళా బిల్లుపై స్పందించాలని కోరగా కాంగ్రెస్ నేత సోనియా గాంధీ మనదే అని వ్యాఖ్యానించారు.
ఇక అన్ని రాజకీయ పార్టీలు బిల్లుకు మద్దతిస్తుండగా మహిళా బిల్లును ప్రవేశపెట్టడానికి మోదీజీ పదేండ్లు ఎందుకు వేచిచూశారు అని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ట్విట్టర్‌లో ప్రశ్నించారు. మహిళా బిల్లుకు మోదీ సర్కార్ మోక్షం కల్పించడం నిజమైతే 2024 సార్వత్రిక ఎన్నికల కోసమే ఈ బిల్లును ప్రవేశపెడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఓబీసీ మహిళలకు ప్రభుత్వం కోటా కల్పించని పక్షంలో రానున్న సాధారణ ఎన్నికల్లో యూపీలో బీజేపీకి భంగపాటు తప్పదని కపిల్ సిబల్ హెచ్చరించారు. భారత్ నిజంగా సుసంప్ననం కావాలంటే 50 శాతం జనాభాను నిర్ణాయక ప్రక్రియలో భాగస్వామ్యం కల్పించాలని కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి, రాజ్యసభ ఎంపీ కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. ఈ బిల్లు ప్రాధాన్యతను సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్‌లు గుర్తెరగడంతో మహిళా బిల్లును 2010లో రాజ్యసభలో ఆమోదం పొందేందుకు కృషి చేశారని ఆయన గుర్తుచేశారు. కాషాయ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా లోక్‌సభలో బిల్లును తక్షణమే ఆమోదించాలని డిమాండ్ చేశారు. మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలపడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్వాగతించారు. బిల్లులో పొందుపరిచిన అంశాలను వెల్లడించకపోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.మహిళా బిల్లు గురించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదని, మీడియా ద్వారానే ఈ విషయం వెలుగుచూసిందని ఆమె పేర్కొన్నారు.
తప్పక చదవండి
-Advertisement-