- ఆదేశాలు జారీ చేసిన ఎన్.ఎఫ్.ఆర్.ఏ.
ముంబై : అదానీ గ్రూప్‌నకు దీర్ఘకాలంగా ఆడిటర్లుగా వ్యవహరిస్తున్న ఒక సంస్థపై అకౌంటింగ్ రెగ్యులేటర్ నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ) తాజాగా దృష్టిపెట్టింది. అదానీ కంపెనీలను ఆడిట్ చేసే ఎర్నస్ట్ అండ్ యంగ్ (ఈవై)కు ఇండియా సభ్య సంస్థ ఎస్‌ఆర్ బాట్లిబాయ్ వ్యవహారాలను ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ స్క్రూటినీ చేస్తున్నదని సంబంధిత వర్గాల్ని ఉటంకిస్తూ ఎకానమిక్ టైమ్స్ బుధవారం ఒక కథనాన్ని వెలువరించింది. ఈ ఆడిటింగ్ సంస్థపై కొద్దివారాల క్రితం దర్యాప్తు ప్రారంభించిందని, కొన్ని అదానీ గ్రూప్ కంపెనీల ఆడిట్స్‌కు సంబంధించిన ఫైళ్లు, కమ్యూనికేషన్లు సమర్పించమంటూ రెగ్యులేటర్ ఆదేశించిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 2014 సంవత్సరం నుంచి ఆడిట్ ఫైళ్లు కోరినట్టు సమాచారం. ఈ అంశంపై ఈవై, ఎస్‌ఆర్ బాట్లిబాయ్ ప్రతినిధులు వ్యాఖ్యానించేందుకు నిరాకరించగా, ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ, అదానీ గ్రూప్‌లు స్పందన వెల్లడించలేదని ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. అంతర్జాతీయ ఆడిటింగ్ దిగ్గజం ఈవైకు ఎస్‌ఆర్ బాట్లిబాయ్ ఇండియాలో సభ్య సంస్థగా కొనసాగుతున్నది. విదేశీ అకౌంటింగ్ సంస్థలు భారత్‌లో ఆడిటర్లుగా రిజిష్టర్‌కావడానికి చట్టం అనుమతించదు. అందుచేత ఈవైతో సహా నాలుగు అంతర్జాతీయ ఆడిటింగ్ దిగ్గజాలు ఇక్కడి సభ్య సంస్థల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. ఎస్‌ఆర్ బాట్లిబాయ్ ఐదు అదానీ లిస్టెడ్ కంపెనీలకు ఆడిటర్‌గా పనిచేస్తున్నది. అదానీ పవర్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ విల్మార్‌లతో పాటు గత ఏడాది హోల్సిమ్ నుంచి అదానీ గ్రూప్ కొనుగోలు చేసిన సిమెంట్ కంపెనీలు అంబూజా సిమెంట్స్, ఏసీసీలకు ఈ సంస్థే గత కొద్ది సంవత్సరాలుగా ఆడిటర్. గత ఏడాది అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ ఖాతా పుస్తకాలపై సైతం ఎస్‌ఆర్ బాట్లిబాయ్ సంతకాలు చేసింది. అదానీ గ్రూప్ అకౌంటింగ్, డిస్‌క్లోజర్లపై ఈ ఏడాది జనవరిలో యూఎస్ హెడ్జ్ ఫండ్ హిండెన్‌బర్గ్ పలు ప్రశ్నలను లేవనెత్తిన నేపథ్యంలో ఎస్‌ఆర్ బాట్లిబాయ్ ఆడిటింగ్ వ్యవహారాల్ని రెగ్యులేటర్ దర్యాప్తు చేస్తుండటం గమనార్హం. అప్పట్లో హిండెన్‌బర్గ్ ప్రశ్నలకు అదానీ గ్రూప్ స్పందిస్తూ తమ కంపెనీలను సర్టిఫైడ్, క్వాలిఫైడ్ వృత్తినిపుణులు ఆడిట్ చేశారని పేర్కొన్నది. ఆ వృత్తి నిపుణుల ఆడిట్‌పైనే రెగ్యులేటర్ ప్రస్తుతం దృష్టి సారించింది.