మిస్కో : అమెరికాపై రష్యా మరోసారి తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగింది. తామెలా జీవించాలనేది నిర్ణయించే హక్కు అమెరికాకు లేదని మండిపడిరది. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తాజాగా రష్యాలో పర్యటించారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కిమ్ సమావేశమై కీలక అంశాలపై చర్చించారు. అయితే, వీరి భేటీపై అమెరికాతోపాటు దక్షిణ కొరియా తదితర దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. దాంతో రష్యా తీవ్రంగా స్పందించింది. ముఖ్యంగా అమెరికాపై నిప్పులు చెరిగింది. ప్రపంచవ్యాప్తంగా మిత్ర దేశాలకు ఆయుధాలు సరఫరా చేస్తూ గందరగోళాన్ని సృష్టించే విూరు ఉత్తర కొరియాతో సంబంధాలపై మాకు నీతులు చెప్పొద్దని వ్యాఖ్యానించింది. ‘మేం ఎలా జీవించాలో నిర్ణయించే హక్కు అమెరికాకు లేదు’ అని మండిపడిరది. ఈ మేరకు అమెరికాలోని రష్యా రాయబారి అనాటోలి ఆంటోనొవ్ ఒక ప్రకటన చేశారు. కాగా, రష్యా పర్యటన సందర్భంగా దాదాపు ఐదు గంటలపాటు పుతిన్‌తో భేటీ అయిన కిమ్.. సైనిక సహకారం, ఆయుధాల సరఫరా వంటి విషయాలపై చర్చలు జరిపినట్లు సమాచారం. అదే సమయంలో ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న పోరాటానికి కిమ్ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో రష్యాకు ఉత్తర కొరియా ఆయుధాలను అందించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో రష్యాపై అమెరికా, దక్షిణ కొరియా తదితర దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు, రష్యా నుంచి తుర్కియే, యూఏఈ, జార్జియాలతో జరిగే 150కిపైగా వ్యాపారాలపై అమెరికా ఆంక్షలు విధించింది. వాటికి సంబంధించిన వ్యక్తులపైనా నిషేదాజ్ఞలను అమల్లోకి తెచ్చింది. దీనికి ప్రతిగా అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఇద్దరు అమెరికా దౌత్యవేత్తలను రష్యా బహిష్కరించింది