Friday, July 19, 2024

తెలంగాణకు మోడీ ఇచ్చిన భరోసా ఏమిటి..?

తప్పక చదవండి
  • మోదీ.. దేశానికి ప్రధాన మంత్రా? గుజరాత్ కు ప్రధాన మంత్రా?
  • మోదీ పర్యటన ఖర్చుతో పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయొచ్చు
  • కేసీఆర్ కుటుంబం అవినీతిపై మోదీ మౌనం ఎందుకు
  • ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికే మోదీ పర్యటన
  • బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
  • మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిలకు నివాళులు..

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనతో ప్రజలకు నిరాశే మిగిలిందని కాంగ్రెస్‌ ఎంపీ, టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి అన్నారు. మోదీ.. దేశానికి ప్రధాన మంత్రా? గుజరాత్ కు ప్రధాన మంత్రా? అని సందేహం వ్యక్తం చేశారు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి. విభజన సందర్భంగా తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ ఏ భరోసా ఇవ్వలేదని.. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హమీలనే నెరవేర్చలేదని ఆరోపించారు. పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ప్రకటించకుండా, పసుపు బోర్డును ఏదో కొత్తగా ఇస్తున్నట్లు ప్రకటించారని విమర్శించారు. యూపీఏ హయాంలో తీసుకున్న నిర్ణయాలను సైతం ప్రధాని అమలు చేయలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వాలు ప్రజలకి ఇచ్చిన హామీలు ఆపుతారా? అని ప్రశ్నించారు. తెలంగాణపై అక్కసు పెంచుకున్న మోదీని తెలంగాణకు తేవడం ప్రజలని అవమాన పరచడమే అని అన్నారు. మోదీ చేసిన మోసానికి డీకే అరుణ, కిషన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

మోదీ పర్యటన ఖర్చుతో పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయొచ్చు..మోదీ సభకు పరోక్షంగా సహకరించిన కేసీఆర్ కూడా దోషినే అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియనే మోదీ తప్పు పట్టారు. అలాంటి మోదీ సభనుపాలమూరు జిల్లాలో నిర్వహించినందుకు డీకే అరుణ, జితేందర్ రెడ్డి జిల్లా ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. మీ భజన మీరు చేసుకోవడానికే సభ పెట్టుకున్నారని విమర్శించారు. మోదీ వచ్చి వరాలు ఇస్తాడని ఆశించామని.. పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై మోదీ ప్రకటన చేస్తారని అనుకున్నామన్నారు. గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు కొత్త అంశాలు కాదని తెలిపారు. అలాగే బీఆర్‌ఎస్‌ మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావులపైనా ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సోమవారంలో గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ పట్ల ప్రధాని మోదీ వివక్ష చూపుతున్నారని.. తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన మోదీ పర్యటనను కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు రేవంత్రెడ్డి. “మోదీ మహబూబ్ నగర్ పర్యటనలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటిస్తారని అనుకున్నాం. తెలంగాణకు ఉద్యోగ అవకాశాలు కల్పించే చర్యలు తీసుకుంటారని ఆశించాం. ఐటీఐఆర్ కారిడార్‌ను పునరుద్దరిస్తారని ఆశించాం.బయ్యారం ఉక్కు కర్మాగారంతోపాటు విభజన హామీలను అమలు చేస్తారని ఆశించాం. వీటిలో ఏ అంశాలను ప్రధాని ప్రస్తావించలేదు. పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ గతంలో ఇచ్చిన హామీలే. మోదీ తెలంగాణపై వివక్ష చూపుతున్నారు. విభజన హామీలు అమలు చేయకపోవడంతో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది” అని రేవంత్ రెడ్డి విమర్శించారు.

- Advertisement -

‘‘తెలంగాణ ఏర్పాటును అవమానించిన మోదీతో సభ నిర్వహించడం అనైతికం. వివేక్, కొండ విశ్వేశ్వరరెడ్డి, విజయశాంతి, రాజ్ గోపాల్ రెడ్డి అందుకే రాలేదు అనే చర్చ నడుస్తోంది. మోదీ పర్యటన ఖర్చు కూడా పాలమూరుకు ఇవ్వలేదు. కుటుంబ దోపిడీ (బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కుటుంబాన్ని ఉద్దేశించి..) గురించి మోదీ ఎందుకు మాట్లాడలేదు?. దీంతో.. బీఆర్‌ఎస్‌-బీజేపీల మధ్య చీకటి ఒప్పందం జరిగిందని తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది అని రేవంత్‌ అన్నారు. కేసీఆర్ కుటుంబం అవినీతిని బయటకు తీస్తామని ప్రజలకు మోదీ ఎందుకు హామీ ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికే మోదీ పర్యటనలన్నారు. కాంగ్రెస్ బలంగా ఉన్నచోట ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తున్నారని, మోదీ పరోక్షంగా బీఆరెస్ ను గెలిపించాలని చూస్తున్నారని” రేవంత్ రెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఇద్దరు ఏకమై చేస్తున్న పర్యటనలు ఇవి. కేటీఆర్ ,హరీష్ రావు బిల్లా రంగాల్లా తిరుగుతున్నారు. 2004,2009 కాంగ్రెస్ మ్యానిఫెస్టో తో నేను వస్తా. 2014,18 మ్యానిఫెస్టోలతో చర్చలకు వస్తారా? రెండు ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని బీఆర్‌ఎస్‌కు సవాల్‌ విసిరారు..

2004నుంచి 2014 వరకు దేశంలో కాంగ్రెస్ ఎన్నో రాష్ట్రాలలో అధికారంలో ఉన్నా..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసింది. కానీ, ఈ బిల్లా రంగాలు(కేటీఆర్‌, హరీష్‌ రావులను ఉద్దేశిస్తూ..) కాంగ్రెస్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్యశ్రీ, రైతు రుణమాఫీ, ఫీజు రీయింబర్స్ మెంట్, మైనారిటీ రిజర్వేషన్ అమలు చేసింది కాంగ్రెస్. 2004 నుంచి 2014 వరకు ఇచ్చిన ఆరు హామీలను వైఎస్సార్ అమలు చేసి చూపించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఈ పథకాలను అమలు చేసి చూపాం.

రాష్ట్రాల ఆదాయం, ప్రజల అవసరాలనుబట్టి పథకాలు ఉంటాయి. కానీ, ఈ బిల్లా రంగాలకు రాజ్యాంగం విలువ తెలియదు. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేని బిల్లా రంగాలు… ఇతర రాష్ట్రాల్లో అమలు చేయాలని మాట్లాడుతున్నారు. ఆ ఇద్దరికీ సూటిగా సవాల్ విసురుతున్నా. మా పదేళ్ల పాలన.. మీ పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా?. మీరు ఏడ్చి పెడబొబ్బలు పెట్టినా మిమ్మల్ని తెలంగాణ ప్రజలు నమ్మరు. కాంగ్రెస్ లో బహునాయకత్వం ఉంటే తప్పేంటి?. బడుగు బలహీన వర్గాలకు అవకాశాలు ఇస్తే తప్పేముంది?. అయినా రాజస్థాన్, ఛత్తీస్ గడ్, కర్ణాటకలో సీఎం లు మారారా?. మాట ఇస్తే అమలు చేసే పార్టీ కాంగ్రెస్.. ఆనాడు అమలు చేశాం. ఇప్పుడూ ఆరు గ్యారెంటీలను అమలు చేసి చూపిస్తాం. కాంగ్రెస్ ను ప్రశ్నించే నైతికత బిల్లా రంగాలకు లేదు. తెలంగాణ సమాజం కేసీఆర్ ను నమ్మదు.. క్షమించదు. కర్ణాటక ప్రభుత్వం వసూళ్లపై కేటీఆర్ కి అనుమానం ఉంటే విచారణకి లెటర్ రాస్తే దాన్ని ఆమోదించి విచారణ చేయించాలని నేను కర్ణాటక ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వసూళ్లపై విచారణ జరిపించాలని లెటర్ రాస్తాను. ఆమోదించి విచారణ జరిపిస్తారా? అని నిలదీశారు రేవంత్‌. అలాగే.. ఓట్ల కోసమే కేటీఆర్ స్వర్గీయ ఎన్టీఆర్ పేరును వాడుకుంటున్నాడంటూ విమర్శించారు రేవంత్‌. “ఎన్టీఆర్ పేరుతో ఓట్లు దండుకోవాలని బీఆరెస్ చూస్తోంది. మీ దోపిడీకి ఎన్టీఆర్ పేరును వాడుకుంటారా? ఎన్టీఆర్ పేరుతో పోల్చుకునే అర్హత కేటీఆర్ కు లేదు. ఎన్టీఆర్ తో పోల్చుకునే అర్హత బీఆరెస్ లో ఎవరికీ లేదు” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతి, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి 119వ జయంతి సందర్భంగా గాంధీభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వారికి నివాళులు అర్పించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు