- చంద్రబాబుపై కేటీఆర్ వ్యాఖ్యలకు కౌటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి..
- ఈ ఎన్నికల్లో సెటిలర్స్ బీ.ఆర్.ఎస్. ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు..
- ఐటీ రంగం వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తామంటే మీకెందుకు కోపం..?
- హైదరాబాద్ కేటీఆర్ జాగీర్ కాదు : రేవంత్ రెడ్డి..
హైదరాబాద్ : తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్‌పై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. బుధవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ‘‘మంత్రి కేటీఆర్.. చంద్రబాబుకు మద్దతుగా నిరసన తెలిపే వాళ్ల ఓట్లు కావాలి.. కానీ వాళ్లకి హక్కులు లేకుండా చేస్తారా? నిరసన తెలియచేసే వాళ్లని అడ్డుకుంటే ప్రజలు చెంపలు వాయిస్తారు. అవసరం అయితే వినతిపత్రం తీసుకొని అనుమతి ఇవ్వాలి తప్పా… తిరస్కరించడం తప్పు. ఎన్నికల్లో సెటిలర్స్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెడుతారు. పన్నులు కట్టించుకొని, ఓట్లు వేయించుకొని మా రాష్ట్రం సమస్య కాదని అంటే ప్రజలు మూతి పండ్లు రాలగొడతారు. ఐటీ రంగం వాళ్లు ప్రొటెస్ట్ చేస్తా అంటే ఒప్పుకోకపోవడానికి హైదరాబాద్ కేటీఆర్ జాగీరా? సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి తెలంగాణ అంశంపై ప్రొటెస్ట్ చేయొచ్చు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇక్కడి ఐటీ వాళ్లు నిరసన తెలియచేస్తే అడ్డుకోవడం ఏంటీ? చంద్రబాబు జాతీయ స్థాయి వ్యక్తి. చంద్రబాబు అంత అనుభవం ఉన్నవాళ్లు వేళ్లపై లెక్కపెట్టవచ్చు’’ అని రేవంత్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.