హైదరాబాద్ : మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో తమ పార్టీ కచ్చితంగా గెలుస్తుందంటూ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసిన రాహుల్‌గాంధీ.. తెలంగాణ విషయంలో మాత్రం అదేస్థాయి ధీమా వ్యక్తం చేయలేకపోయారు. తెలంగాణలో తమ పార్టీ గెలవొచ్చు అంటూ అభద్రత భావాన్ని వ్యక్తంచేశారు. దీంతో తెలంగాణలో తమ పార్టీ ఓటమి ఖాయమని రాహుల్‌గాంధీ పరోక్షంగా ఒప్పుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో గెలుపుపై ఉన్న నమ్మకం తెలంగాణలో ఎందుకు లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్రంలో పార్టీ నాయకత్వం, బలంపై ఆయనకు స్పష్టత ఉన్నదని అంటున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం ఆయన వ్యాఖ్యలకు ప్రధాన కారణం కావొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. సీనియర్ల కుమ్ములాటలు, కులాల కుంపట్లు, నేతల మధ్య ఐక్యత లేకపోవడం, ప్రజలు కాంగ్రెస్‌ను పెద్దగా నమ్మక పోవడం వంటి అంశాలను బేరీజు వేసుకున్నాకే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. రాహుల్ వ్యాఖ్యలతో రాష్ట్రంలో ఎన్నికల పోరుకు ముందే కాంగ్రెస్ కాడి పాడేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రాహుల్‌గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుపై నమ్మకం లేని విధంగా మాట్లాడటం యాదృశ్చికంగా ఏమీ జరగలేదని, ఆయన అన్ని అంశాలను బేరీజు వేసుకునే ఆ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల్లో బీఆర్‌ఎస్ పట్ల, ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల అత్యధిక విశ్వసనీయత ఉండటం కూడా ఆయన వ్యాఖ్యలకు కారణం కావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.