Monday, December 4, 2023

మానవాళికి ఆదర్శం… రాధాకృష్ణుల ప్రేమ తత్వం

తప్పక చదవండి

భాద్రపదమాసంలోని అష్టమి శ్రీకృష్ణ పరమాత్మ పూజకు ఉత్కృష్టమైన రోజు. ఈ నాడు పవిత్ర ప్రేమకు చిహ్నంగా చెప్ప బడుతూ ఉన్న రాధా కృష్ణులను పూజించడం సాంప్రదాయం. ఈ దినానికి ‘రాధాష్టమి’ అని పేరు. ఈ రోజు రాధాకృష్ణులను పూజించడం వల్ల సంసార సుఖం లభిస్తుందని, భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని చెప్పబడుతూ ఉంది. రాధాయ నమః అనే మంత్రాన్ని శ్రీకృష్ణుడు ఆ దేవి నుంచి రాస మండలంలో ఉపదేశ రూపంలో పరిగ్రహించాడని, అదే మంత్రాన్ని గురు పరంపర నుంచి నారదుడు గ్రహించాడని ‘పద్మ పురాణం’ చెబుతున్నది. రాధ జన్మ వృత్తాంతం గురించి భిన్నగాథలు వ్యాప్తిలో ఉన్నాయి. ఆమె కేదారుడు అనే రాజుకు యజ్ఞ కుండంలో పుట్టిన కుమార్తె అని చెబుతారు. పేరు బృంద అని, కృష్ణుణ్ని భర్తగా పొందాలని కోరి తపం ఆచరిస్తే ఆయన ప్రత్యక్షమ య్యాడని విశ్వసిస్తారు. ద్వాపర యుగంలో రాధ తనను సేవించడం వల్ల ఆ ప్రదేశం ‘బృందావనం’గా మారుతుందని వరమిచ్చాడనీ ఆ గాథ సారాంశం. వృష భానుడు, కళావతి దంపతులకు పుట్టిన తనయకు గర్గ మహాముని ‘రాధ’ అని నామకరణం చేశాడు. బ్రహ్మవైవర్తం ప్రకారం, దూర్వాస ముని ‘రసరశ్మి’ అని పేరు పెట్టాడు. శ్రీకృష్ణుణ్ని రాధాదేవి తన మనసులో లయం చేసి విజయం సాధించిన రోజు- భాద్రపద శుద్ధ అష్టమి. అందుకే ‘రాధాష్టమి’గా వ్యవహరిస్తారు. శ్రీకృష్ణుణ్ని ప్రాణాధారంగా చేసుకొన్న రాధ ఆయన వామ పార్శ్వం నుంచి పుట్టిందని చెబుతారు. ఆమె పుట్టగానే రాస మండలంలో కృష్ణుడి సేవకోసం ధావనం (పరుగు) సాగించడం వల్ల రాధగా మారిందని బ్రహ్మవైవర్త పురాణం వివరిస్తోంది. గోలోకాన్ని మహారాస మండలి అంటారు. నిత్య బృందావనం, శ్వేత మండలి అని కూడా వ్యవహరిస్తారు. అది ఒక మహా రస జగత్తు. ఆ జగత్తుకు ప్రభువు గోపాలుడు. ఆయనే రాధా మాధవుడు. ఆ రస సమ్రాట్‌ శక్తినే రాసేశ్వరిగా భావిస్తారు. ‘రాసము’ అంటే గోకులంలోని ఒక క్రీడావిశేషం, సల్లాపం అని అర్థాలున్నాయి. ధావనం అంటే పరుగు. రాధాకృష్ణులు- ద్వంద్వ సమాసం. ఆ మాట వినగానే అద్వైత ప్రణయం గోచరిస్తుంది. అప్రాకృతమైన జగత్తులో- ముక్త ధామం, వైకుంఠం, గోలోకం అనే మూడు ప్రధాన లోకాలు ఉన్నాయని నారాయణోపనిషత్తు వర్ణిస్తుంది. రాధ అంటే భగవంతుని విశేషముగ ఆరాధించునది అని (భక్తీ అని ) అర్ధము. అనగా అత్యంత భక్తురాలు. కుండలి నుండి మూలాధార వరకు జాలువారుతున్న అమృత బిందువులను (విశ్వశక్తిని) ధారలా భూలోకము నుండి (మూలాధారా) వైకుంఠము (సహస్రారం)నకు తీసుకుని వెళ్ళగలిగే ఒక శక్తి … ధార …రాధ … ఇదో నిరంతర వాహిని …ఇదే ధ్యానం …భక్తీ … ప్రేమ…కృష్ణుడనగా ఆకర్షించు వాడని యర్ధము. నిరంతరం ఆత్మ అంతర్ముఖం కమ్మంటుంది.

  • రామకిష్టయ్య సంగనభట్ల.. 9440595494
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు