Saturday, December 2, 2023

ఆన్‌లైన్‌ షాపింగ్‌ …పండగ సీజన్‌…

తప్పక చదవండి

న్యూఢిల్లీ : రాబోయే పండుగ సీజన్‌లో 81 శాతం వినియోగదారులు ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసేందుకే ఇష్టపడుతున్నట్టు తేలింది. అంతేగాక ఈసారి గతంతో పోల్చితే మరింత ఎక్కువగా కొనుగోలు చేస్తామని ప్రతీ ఇద్దరిలో ఒకరు అంటున్నట్టు అది తెలిపింది. నీల్సన్‌ మీడియా ద్వారా అమెజాన్‌ ఇండియా ఈ సర్వేను చేపట్టింది. దేశంలోని మెట్రో నగరాలతోపాటు ఇతర నగరాలు, ప్రథమ-ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని 8,159 మంది కస్టమర్ల అభిప్రాయాలను సేకరించారు. మెట్రో నగరాల్లోని 87 శాతం మంది, ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని 86 శాతం మంది ఈసారి పండుగ షాపింగ్‌ ఆన్‌లైన్‌ వేదికగానే చేస్తామన్నట్టు సర్వే పేర్కొన్నది.
‘వాషింగ్‌ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, గీజర్లు, ఏసీల వంటి ఖరీదైన వస్తూత్పత్తులను కొనాలనుకునే ప్రతీ నలుగురిలో ముగ్గురు ఈ పండుగకు వచ్చే ఆన్‌లైన్‌ ఫెస్టివ్‌ షాపింగ్‌ ఈవెంట్ల కోసమే ఎదురు చూస్తున్నారు. అలాగే స్మార్ట్‌ఫోన్లను కొనేవారిలో 76 శాతం మంది భారీ ఆఫర్లతో వచ్చే ఆన్‌లైన్‌ మెగా సేల్స్‌ కోసం వేచిచూస్తున్నారు. ప్రతీ ముగ్గురిలో ఇద్దరు 5జీ మొబైల్స్‌ను తీసుకోవాలనుకుంటున్నారు. రూ.10,000-20,000 ధరల శ్రేణిలో కావాల్సిన వాటిని కొనుక్కునేందుకు 60 శాతం మంది ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు’ అని నీల్సన్‌ సర్వే సోమవారం వెల్లడించింది. సౌకర్యవంతంగా ఉండటం, పెద్ద ఎత్తున డిస్కౌంట్లు లభిస్తుండటం, ఉన్నచోట నుంచే లేదా తీరిగ్గా ఉన్న సమయంలో షాపింగ్‌ చేసే వీలుండటం, త్వరగా డెలివరీ అవుతుండటంతోనే ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నట్టు సర్వేలో పాల్గొన్న 77 శాతానికిపైగా మంది స్పష్టం చేశారు. ఇక 76 శాతం మంది ఈసారి లగ్జరీ, నమ్మకమైన సౌందర్య ఉత్పత్తులను ఆన్‌లైన్‌ వేదికగా కొనాలని భావిస్తున్నారు. ఆన్‌లైన్‌ షాపింగ్‌లో ఎటువంటి మోసాలు జరుగవని, తాము ఎంచుకున్న ఒరిజినల్‌ ఉత్పత్తుల్నే డెలివరీ చేస్తారని 74 శాతం మంది విశ్వసిస్తున్నారు. ‘ఈ ఏడాది వినియోగదారులు ఆన్‌లైన్‌లో మరింతగా కొనుగోళ్లు జరిపేందుకు ఉత్సాహాన్ని చూపిస్తుండటం సంతోషంగా ఉన్నది. కస్టమర్ల విశ్వాసాన్ని అమెజాన్‌ ఇండియా నిలబెట్టుకుంటుంది’ అని అమెజాన్‌ ఇండియా కన్జ్యూమర్‌ బిజినెస్‌ విభాగం మేనేజర్‌ మనీశ్‌ తివారీ అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు